ట్రంప్ ఉంటేనే.. అమెరికాలో సిక్కులు సేఫ్: సిక్కు సంఘాలు

ABN , First Publish Date - 2020-09-29T22:10:38+05:30 IST

అమెరికాలో నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఇంకా ఐదు వారాల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు అక్కడి మైనారిటీ వర్గాలపై దృష్టిసారించాయి.

ట్రంప్ ఉంటేనే.. అమెరికాలో సిక్కులు సేఫ్: సిక్కు సంఘాలు

వాషింగ్టన్ డీసీ: అమెరికాలో నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఇంకా ఐదు వారాల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు అక్కడి మైనారిటీ వర్గాలపై దృష్టిసారించాయి. దీనిలో భాగంగా సిక్కు అమెరికన్ల కోసం ఇరు పార్టీలు తమ ప్రచారంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ‘జో బైడెన్ కోసం సిక్కు అమెరికన్లు’ అనే కార్యక్రమాన్ని బైడెన్ క్యాంపెయిన్ తాజాగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అమెరికాలో సిక్కులు ఏ విధంగా వివక్షత, జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నారో ఈ కార్యక్రమం ద్వారా జో బైడెన్ హైలైట్ చేయనున్నట్టు క్యాంపెయిన్ వెల్లడించింది.


అయితే, అక్కడి కొన్ని ప్రముఖ సిక్కు సంఘాల నాయకులు మాత్రం అమెరికాలో సిక్కులు సేఫ్‌గా ఉండాలంటే ట్రంప్ వల్ల మాత్రమే సాధ్యమని చెబుతున్నారు. ఆయన హయాంలోనే మనం సురక్షితంగా ఉంటామని సిక్కు సంఘాలు అంటున్నాయి. బిడెన్-హారిస్ క్యాంపెయిన్ సిక్కు కమ్యూనిటీని డిమోరలైజ్, డిమోటివ్ చేయడానికి ప్రయత్నిస్తోందని వారు దుయ్యబట్టారు. 


అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన చర్యల వల్లే ఇవాళ అమెరికాలో మత స్వేచ్ఛ ఉందని, అందుకే చాలా మంది సిక్కు యువకులు యూఎస్ మిలిటరీలో తలపాగా, గడ్డంతో సేవలు అందిస్తున్నారని సిక్కు-అమెరికన్ న్యాయవాది, ట్రంప్ తరపు న్యాయవాదుల సహ అధ్యక్షులు హర్మీత్ ధిల్లాన్ అన్నారు. యూఎస్‌లోని కమ్యూనిటీ సభ్యులు అధ్యక్షుడు ట్రంప్ హయాంలో ఉన్నంత సురక్షితంగా ఇంతకుముందు ఎన్నడూ లేరని ట్రంప్ కోసం సిక్కుల కో-చైర్ జస్దీప్ సింగ్ అన్నారు. 


పలువురు సిక్కు సంఘాల నాయకులు బిడెన్-హారిస్ అడ్మినిస్ట్రేషన్ సిక్కు వ్యతిరేకి అని పేర్కొంటున్నారు. దీనికి ఉదాహరణగా హారిస్, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఉన్న సమయంలో జరిగిన ఓ ఘటనను వారు గుర్తు చేస్తున్నారు. సిక్కు వ్యక్తి త్రిలోచన్ సింగ్ ఒబెరాయ్ ఉద్యోగం కోసం వెళ్లగా... అతడిని గడ్డం తీసేయాలని అక్కడి అధికారులు ఆదేశించారు. దానికి అతను నిరాకరించాడు. దీంతో నీకు ఉపాధి కావాలో, విశ్వాసం కావాలో తేల్చుకోమని చెప్పారట. కమల భారత సంతతికి చెందిన మహిళ.. ఆమెకు సిక్కుల కట్టుబాట్లు, విశ్వాసం గురించి తెలుసు. అయినప్పటికీ ఆమె ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటనే ఆమె సిక్కు వ్యతిరేకి అని చెబుతుందంటూ సిక్కు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అందుకే జో బిడెన్, కమలా హారిస్‌లకు మద్దతు ఇచ్చేది లేదని సిక్కు సంఘాలు కరాఖండిగా తేల్చి చెబుతున్నాయి. కనుక అమెరికాలో తాము సురక్షితంగా ఉండాలంటే ట్రంప్ వల్లే సాధ్యమని సిక్కు సంఘాలు తెలిపాయి.  

Updated Date - 2020-09-29T22:10:38+05:30 IST