Advertisement
Advertisement
Abn logo
Advertisement

మౌనం... సద్గతికి మార్గం


పిల్లలు పుట్టినప్పుడు ఏ భాషలోనూ మాట్లాడలేరు. కాబట్టి ఏం చెప్పాలన్నా ఏడవడం మొదలుపెడతారు. ఈ విధంగా గర్భంలో ధారణ చేసిన మౌనం... జన్మ తీసుకోగానే భగ్నమవుతుంది. ఇక... మాటలు వచ్చిన తరువాత... మనం ఎంత మాట్లాడతామో మనకే తెలీదు. వాటిలో అనర్థమైనవీ, వ్యర్ధమైనవీ ఉంటాయి. మన జీవితంలో ఇంత చిన్న నాలుకతో మాట్లాడే మాటలను ఈ భూమికి రెండు రెట్లు పెద్ద కాగితం తీసుకున్నా... రాయడానికి అది సరిపోదు. బుద్ధిమంతులైన వ్యక్తులు, సాధువులు, సన్యాసులు, సామాన్యులు... అందరూ మాట్లాడతారు. ప్రతి వ్యక్తి ఏదో సందర్భంలో మూర్ఖంగా... సమయం, అవసరం, వ్యక్తులు, పరిస్థితులు, ఉచితానుచితాలు ఆలోచించకుండా మాట్లాడతాడు. మన మాటలతో ఎంతోమందిని సంతోషపెడతాం. ఎంతోమందిని బాధ పెడతాం, ఎన్నో ఫిర్యాదులు చేస్తాం. మంచి, చెడు మాట్లాడుతూనే ఉంటాం. ఎలా మసలుకోవాలో తెలిసినా... ఆచరణ తక్కువగా ఉంటుంది. ఇక కొందరు మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. నిర్భయంగా మాట్లాడవలసి వచ్చినప్పుడు, స్నేహాన్ని వ్యక్తం చేయాల్సిన సమయంలో, జ్ఞాన, యోగ, సద్గుణాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు శాంతంగా ఉండిపోతారు. ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దలు నోరు విప్పి మాట్లాడి ఉంటే... మహాభారత కథ అలా ఉండేది కాదు.


సమాజంలో మనకు ఎన్నో రకాల వ్యక్తులు కనిపిస్తారు. కొందరు పరస్పరం మాట్లాడుకోరు, వారి మనసులు ఈర్ష్య, ద్వేషం, అసహ్యాలతో నిండి ఉంటాయి. కొంతమంది చెప్పకూడని విషయాలు కూడా చెబుతూ ఉంటారు. పెద్దవారితో ఎలా గౌరవంగా మాట్లాడాలి, ఎప్పుడు వారి ఎదుట మౌనం వహించాలి అనే విషయాలు చాలామందికి తెలియవు. ఇతరులను తిట్టడం, నిందించడం, వారితో గొడవపడడం లాంటి కర్మలకు ఎలాంటి శిక్షలు లభిస్తాయో తెలుసుకోవడమే సద్వివేకం. అదే కర్మదర్శనం. కర్మల గతి బుద్ధిమంతులకు, విద్వాంసులకు సైతం అంతుపట్టదన్నాడు ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు. 


మనిషి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. దానికి విరామం ఉండదు నిద్రపోయినప్పుడు మాట్లాడడం ఆగిపోతుందని చెప్పలేం. స్వప్నంలోనూ మాట్లాడతాం. అందులో మన సంస్కారాలు కూడా మాట్లాడతాయి. బుద్ధి నియంత్రణలో లేనివారి మనసు ఎప్పుడూ మౌనంగా ఉండదు. ఈ విధంగా వారి శక్తి వ్యర్థంగా పోవడం వల్ల మానసిక శక్తులు సన్నగిల్లుతాయి. వారిలో ఏకాగ్రత, క్రమశిక్షణ ఉండవు. మన మనసే మన ఆధీనంలో లేకపోతే జీవితంలో మనం ఏం సాధించినట్టు? సమయం గడచిపోవడం కాదు... వాస్తవానికి సమయం నష్టం అవుతుంది. మన సమయాన్ని ‘చెడు మాట్లాడడం’ అనే ముళ్ళు నాటడంలో వినియోగిస్తున్నాం. మన ఆలోచనా విధానమే తప్పు. మనకు జీవించడం, ఇంద్రియాలను సరిగ్గా ఉపయోగించుకోవడం రావడం లేదు. ఈ ధోరణితో మనకు మనమే నష్టం చేసుకుంటున్నామని అర్థం చేసుకున్నవారు అదృష్టవంతులు. మంచి చేస్తే అంతా మంచే జరుగుతుంది. ఇది శాశ్వత సత్యం. మనం ఇతరులకు మంచి మాటలనే రత్నాలను పంచాలి. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే పరమాత్మ నుండి దూరమైనట్టే. మంచి ఆలోచన చేయడం కూడా ఒక శ్రేష్ట పురుషార్థమే కాని మనసుతో మౌనం పాటించడం అత్యవసరం. లేకపోతే సంపూర్ణ సద్గతి లభించదు. మౌనంతో ఆత్మకు సశక్తీకరణ జరుగుతుంది. దివ్యగుణాలనే పుష్పాలు వికసించి, సేవలో సఫలత లభిస్తుంది. వాస్తవానికి అదే రాజయోగం. 

 బ్రహ్మకుమారీస్‌ 7032410931

Advertisement
Advertisement