షర్మిల విమర్శలపై మౌనం!

ABN , First Publish Date - 2021-04-11T08:03:22+05:30 IST

తెలంగాణలో పాలక టీఆర్‌ఎ్‌సను ప్రశ్నించే ప్రతిపక్షం లేదని, అందుకే తాను పార్టీ పెడుతున్నానంటూ ప్రకటిస్తూ..

షర్మిల విమర్శలపై మౌనం!

  • ప్రస్తుతానికి పట్టించుకోవద్దని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నిర్ణయం
  • వీహెచ్‌ మినహా స్పందించని నేతలు.. గుత్తా పరోక్ష విమర్శలు
  • కేసీఆర్‌ స్ర్కిప్టును షర్మిల చదివారన్న బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పాలక టీఆర్‌ఎ్‌సను ప్రశ్నించే ప్రతిపక్షం లేదని, అందుకే తాను పార్టీ పెడుతున్నానంటూ ప్రకటిస్తూ.. ఖమ్మం సంకల్ప సభలో వైఎస్‌ షర్మిల సూటిగా చేసిన విమర్శలపై టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఊహించిన స్థాయిలో ప్రతిస్పందన లేదు. శనివారం కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత వీహెచ్‌ మాట్లాడినా.. అది ఆయన వ్యక్తిగతం అన్నట్లుగానే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్‌ఎ్‌సలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. షర్మిల పేరు ఎత్తుకుండా పరోక్ష విమర్శలు చేశారు. బీజేపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజన్న రాజ్యం అవినీతి రాజ్యమని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ రాసిచ్చిన స్ర్కిప్టునే షర్మిల చదివారని ఆరోపించారు. అయితే, పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయి నేతలు ఎవరూ మాట్లాడలేదు. 


షర్మిల పార్టీ, ఆమె విమర్శలకు ప్రస్తుతానికి అంత ప్రాధాన్యం ఇవ్వొద్దన్న అభిప్రాయానికి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు అసలు స్పందించాలా.. వద్దా అన్న దానిపై టీపీసీసీ ముఖ్యనేతల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఖమ్మంలో సభ జరిగింది కనుక.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ప్రకటన ఇప్పించాలన్న ఆలోచనా చేసినట్లు సమాచారం. అయితే, కాంగ్రెస్‌ పార్టీ స్పందించాలనే షర్మిల కోరుకుంటున్నారని, ఆమె వ్యాఖ్యలకు ప్రాముఖ్యం ఇచ్చి తెలంగాణ రాజకీయాల్లో తన స్థాయిని పెంచాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వినిపించాయి. దీంతో ప్రస్తుతానికి పట్టించుకోకపోవడమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.




సాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలోనేనా..? 

సాగర్‌ ఉపఎన్నిక నేపథ్యంలో షర్మిల పార్టీ, ఆమె వ్యాఖ్యలపై స్పందిస్తే అది ఏ పరిణామాలకు దారితీస్తుందోనన్న చర్చ ప్రధాన పార్టీల్లో జరుగుతోంది. అందుకే అవి ఆచితూచి వ్యవహరిస్తున్నాయంటున్నారు. ప్రస్తుతానికి షర్మిల వ్యాఖ్యలకు ప్రాధాన్యమివ్వొద్దన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

Updated Date - 2021-04-11T08:03:22+05:30 IST