Advertisement
Advertisement
Abn logo
Advertisement

మౌనమేల మోదీ, ఈ విషాద వేళ..

గడచిన కొద్ది రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంభీరమైన మౌనాన్ని పాటిస్తున్నారు. పిఐబిలో కొన్ని సందర్భాల్లో రోజుకు నాలుగైదు ఉపన్యాసాలు చేస్తూ కనపడిన మోదీ ఇప్పుడు ట్వీట్లు, సంతాప సందేశాలకే పరిమితమవుతున్నారు. మోదీకి సన్నిహితులు, వారణాసిలో ఆయన విజయానికి దోహదం చేసిన వారు కూడా కరోనాకు గురై మరణిస్తుండడం ఆయనకు అత్యంత బాధాకరంగానే ఉంటుంది. "మా నాయకుడు మౌనంగా ఉన్నారంటే ఏదో ఒక గొప్ప వ్యూహాన్ని రచిస్తూనే ఉండాలి. అన్ని వైపులా విమర్శలు ఎదురవుతున్న ఈ సమయంలో ఆయన ఆత్మరక్షణలో పడిఉండవచ్చుకాని ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోలేదు" అని ఒక సీనియర్ బిజెపి నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనంపై వ్యాఖ్యానించారు. కరోనాకు గురై వేలాది మంది కుప్పలు తెప్పలుగా మరణిస్తున్నారు. వైద్య, ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలాయి. ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నది. ఈ సమయంలో ప్రధానమంత్రి 2014 తొలి రోజుల్లో కలిగించినంత ఆత్మవిశ్వాసాన్ని ఎలా కలిగించగలరు? అని అడిగితే "అదీ మేము కూడా ఆలోచిస్తున్నాము.. కాని ఆయన పై మేము నమ్మకం కోల్పోలేదు" అని ఆయన జవాబిచ్చారు. ఒక రాజకీయ నాయకుడు పరిపాలనలో వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా ఎన్నికల్లో విజయానికి శాయశక్తులా కృషిచేస్తారు. తనపై వస్తున్న విమర్శలన్నిటికీ పశ్చిమ బెంగాల్‍లో ఘన విజయంతో సమాధానం చెప్పాలని మోదీ ఆశించినందువల్లే అన్ని ఆయుధాలను ఆ రాష్ట్రంలో ప్రయోగించారు. ఎన్నికల కమిషన్‌ను జేబు సంస్థగా ఉపయోగించుకున్నారు. కాని ఆ విజయం కూడా లభించకపోవడంతో మోదీ హతాశుడైనట్లు కనిపిస్తోంది. బెంగాల్‍లో పరాజయం కన్నా మోదీకి ప్రజల ముందు కేవలం బూటకపు ప్రచారం చేసుకునే నేతగా మిగిలిపోవడం ఎక్కువ బాధిస్తున్నట్లు కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, పుల్వామా-బాలాకోట్‍లు, అయోధ్యలో రామమందిరం శంకుస్థాపన, కశ్మీర్లో 370 అధికరణ రద్దు మొదలైనవి చరిత్రపుటల్లో నిలిచిపోయినా అవేవీ కష్టకాలంలో బీజేపీని ఆదుకునేవిగా కనపడడం లేదు. ఎడా పెడా విదేశీ పర్యటనలు, అమెరికా అధ్యక్షుడిని ఆలింగనం చేసుకోవడం, ఆత్మనిర్భర్ ప్యాకేజీలు, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేయాలన్న నిర్ణయాలు, వాక్సిన్ కోసం ప్రదర్శించిన హడావిడి వంటివి విఫల ప్రయోగాలుగా మిగిలిపోయాయి. ఒకప్పుడు ఆసక్తి కలిగించి, చర్చను రేకెత్తించిన ప్రసంగాలు ఇప్పుడు చాలా పేలవంగా కనిపిస్తున్నాయి. విదేశీ మీడియా, స్వదేశీ మీడియా, ఆఖరుకు సోషల్ మీడియా కూడా మోదీని గతంలో కంటే ఎక్కువ విమర్శిస్తున్నాయి. ఆయన హావభావాలు, వేష ధారణ, నాటకీయ చర్యలు ప్రజలకు బాగా అర్థమైనట్లు కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధానమంత్రి ఇప్పుడు అమ్ముల పొదిలో అన్ని ఆయుధాలూ ఖర్చు చేసుకుని పాశుపతాస్త్రం కోసమో, బ్రహ్మాస్త్రం కోసమో ధ్యానిస్తున్నట్లు కనిపిస్తోంది. బహుశా మోదీ మౌనానికి ఇదే కారణమేమో.


కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందని అంటారు కాని మౌనం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పదు. శ్మశానాల్లో శవాలకు కూడా స్థానం దొరకని సమయంలో, గ్రామాల నుంచి నగరాల వరకు రోదనలు వినపడని రోజులు లేనప్పుడు, ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్లు కనపడుతుండగా, రాష్ట్రాల నుంచి ప్రశ్నలు తలెత్తుతుండగా, న్యాయస్థానాల ముందు ప్రభుత్వ న్యాయవాదులు తలదించుకుంటుండగా మౌనం పాటించడం వ్యూహం కాదు, సమాధానం చెప్పుకోలేని నిస్సహాయతే అవుతుంది. 


నిజానికి ఈ సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేని పరిస్థితిని మోదీయే కల్పించారు. దేవెగౌడ లాంటి మైనారిటీ పార్టీ నేత ప్రధాని అయినప్పుడు కూడా రాష్ట్రాల వారీగా ప్రధానమంత్రి కార్యాలయానికి సీనియర్ విలేకరులను పిలిచి తనను పరిచయం చేసుకుని సలహాలు ఇవ్వమని కోరారు. కాని గడచిన ఏడేళ్లలో మోదీ ఒక్కసారి కూడా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. ప్రజల మధ్యకు వెళ్లి కరచాలనం చేసి వారితో ఆహ్లాదంగా ముచ్చటించలేదు. అసలు సంభాషణ, చర్చ అన్న పదాలకే తాను వ్యతిరేకం అన్న భావనను కల్పించారు. ప్రశ్నించినవారికి ఊపిరాడని పరిస్థితి కల్పించారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వాతావరణాన్నీ వాస్తవాలతో నిమిత్తం లేకుండా భక్తుల అండతో, భావోద్వేగాలతో తిప్పిగొట్టే ప్రయత్నం చేశారు. ఆఖరుకు పార్లమెంటులో కూడా ఆరోగ్యకరమైన, విస్తృతమైన చర్చలకు ఆస్కారం లేకుండా చేసి ఏకపక్షంగా దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే బిల్లులను ఆమోదింపచేశారు.


2014లో అఖండమైన మెజారిటీ వచ్చిన తర్వాత ప్రజల మధ్య తిరుగుతూ, పార్లమెంటులో ఆరోగ్యకరమైన చర్చలను ప్రోత్సహిస్తూ, మంత్రివర్గంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పిస్తూ, ప్రతి ఆరునెలలకోసారి విలేకరులను పిలిచి వారి వాగ్బాణాలకు ప్రతిబాణాలు సంధిస్తూ ఉంటే ఇవాళ నరేంద్ర మోదీ ఇంత ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి ఉండేది కాదేమో.


కాని రాజకీయాల్లో వ్యూహాత్మక మౌనం అనేక సందర్భాల్లో అవసరం అవుతుందని, మోదీ మౌనాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. వారి ప్రకారం మోదీ గతంలో అనేక అవమానాలకు, సంక్షోభాలకు గురైనప్పుడల్లా మౌనం పాటించారు. ప్రత్యర్థుల ఎత్తులకుపై ఎత్తులు వేశారు. అనుకున్నది సాధించేవరకూ ఓపికగా నిరీక్షించారు. ముఖ్యమంత్రి పదవీ, చివరకు ప్రధానమంత్రి పదవీ ఆయనకు అదే ఓపిక ఫలితంగా లభించింది. ఢిల్లీలో పార్టీలో ఎదురు లేకుండా చేసుకుని పార్టీని పూర్తిగా హస్తగతం చేసుకున్నారు. అడ్వాణీ లాంటి వారు తెరవెనుకకు జారిపోగా, ఒకప్పటి అడ్వాణీ సన్నిహితులను అడ్డులేకుండా చేసుకున్నారు. గతానికి ప్రతీక అయిన అశోకా రోడ్ బీజేపీ కార్యాలయాన్నివదిలేసి దీనదయాళ్ రోడ్డులో అద్భుతమైన, ఆధునికమైన భవన్‍ను నిర్మించుకున్నారు. ఒకరకంగా అది ఇప్పుడు మోదీ భవన్. ఇప్పుడు గత వ్యవస్థల్ని కుప్పకూల్చే క్రమంలో కొత్త పార్లమెంటు, కొత్త ప్రధానమంత్రి కార్యాలయంతో సెంట్రల్ విస్తాను రూపుదిద్దుకునే పనిలో ఉన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ప్రతిపక్షాలు నిర్వీర్యం అయ్యాయి. వ్యవస్థలు దాసోహం అయ్యాయి. ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో అని ప్రత్యర్థులు భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇవన్నీ ప్రశ్నలకు ఆస్కారం లేని మౌనం వల్ల లభించిన ఫలితాలే.


ఈ నేపథ్యంలో మోదీ మౌనం ప్రమాదకరం అని భావించేవారు కూడా లేకపోలేదు. ఆయనది అపజయాన్ని అంత తేలికగా ఆమోదించే మనస్తత్వం కాదు. కనుక ఈ మౌనం ఆయనకు ఒక ఆయుధంలా ఉపయోగపడుతుందా, లేక ఆయన మౌనంపై జనం ఆగ్రహం ఆయుధంలా మారుతుందా అన్నది ఇప్పుడే చెప్పడానికి వీల్లేదు. వాస్తవం ఏమంటే దేశంలో మోదీ బలహీనపడ్డా ప్రతిపక్షాలు జాతీయస్థాయిలో బలోపేతం అయ్యే పరిస్థితి అంతగా కనపడడం లేదు. ఇటీవల అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పేలవమైన పనితీరు కనిపించడానికి- ప్రజలతో పార్టీకి బలమైన సంబంధాలు లేకపోవడం, ముఠా తగాదాలు కారణమని వర్కింగ్ కమిటీ సమావేశంలో నివేదిక సమర్పించారు. కనీసం బెంగాల్ ఎన్నికల తర్వాతైనా కాంగ్రెస్ పుంజుకునేందుకు బలమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారనుకుంటే వర్కింగ్ కమిటీ కేవలం శవపరీక్ష చేసేందుకు జరిగిన సమావేశంగా ముగిసింది. 


నిజానికి దేశంలో మూడు రాష్ట్రాలలో (పంజాబ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్) కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. పది రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, తెలంగాణ, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, కేరళ) కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది. కనీసం పది రాష్ట్రాల్లో బీజేపీతో ముఖాముఖి తలపడే పరిస్థితి కాంగ్రెస్‍కు ఉన్నది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని దాదాపు 200 స్థానాల్లో కాంగ్రెస్ గట్టి పోటీనీయగలిగిన పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ జాతీయ స్థాయి లోను, వివిధ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఒక రక్తం చల్లారిన సంస్థగా మిగిలిపోయింది. బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఒక దేశ ప్రధానమంత్రి ఇవాళ అత్యంత సంక్షోభంలో చిక్కుకుపోయి, మౌనం పాటించాల్సిన స్థితిలో ఉన్న సమయంలో కూడా ప్రకటనలకూ, ట్వీట్లకూ పరిమితమై ఒక ప్రజాసంస్థగా తన్ను తాను నిరూపించుకోలేకపోతున్నది. ప్రతిపక్షంలో ఒక జాతీయ పార్టీ అన్నది లేకపోతే ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రం దాటి బయటకు రావడం అంత సులభం కాదు. పశ్చిమబెంగాల్‍లో మమతా బెనర్జీ అఖండమైన మెజారిటీతో గెలిచారో లేరో బెంగాల్‍లో హింసాకాండ ప్రజ్వరిల్లి ఆత్మరక్షణలో పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రానున్న అయిదేళ్ళూ ఆమెను బెంగాల్ దాటకుండా ఎలా అడ్డుకోవాలో, మిగతా ప్రాంతీయ నేతలను ఎలా చెప్పుచేతల్లో ఎలా ఉంచుకోవాలో మోదీకి బాగా తెలుసు. మోదీ ఇవాళ ఆత్మరక్షణలో పడ్డందువల్ల మౌనం పాటిస్తున్నారని, ఆయన తిరిగి బలం పుంజుకునే అవకాశాలు లేవని ప్రతిపక్షాలు సంబరపడితే వారికి ఒరిగేదేమీ లేదు. మోదీ మౌనం పాటించినా, మాట్లాడినా దానివెనుక ఒక బలమైన భావజాలం ఉన్నది, ఆ భావజాలాన్ని ఢీకొనేందుకు వారు సంసిద్ధం కావాలి. తాను ఎక్కువకాలం మౌనం పాటించలేనని మోదీకి కూడా తెలుసు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Advertisement
Advertisement