జౌరా మీరా

ABN , First Publish Date - 2021-07-25T08:44:13+05:30 IST

21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది.. అప్పుడెప్పుడో మల్లీశ్వరి సాధించిన ఘనతతోనే మురిసిపోతున్న భారతావనికి మరో మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ అంతకు మించిన ప్రదర్శనతో ఆనందాన్ని డబుల్‌ చేసింది.

జౌరా మీరా

మీరాబాయికి రజతం

21 ఏళ్ల తర్వాత లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకం


21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది.. అప్పుడెప్పుడో మల్లీశ్వరి సాధించిన ఘనతతోనే మురిసిపోతున్న భారతావనికి మరో మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ అంతకు మించిన ప్రదర్శనతో ఆనందాన్ని డబుల్‌ చేసింది. అంచనాలను వమ్ము చేయకుండా స్టార్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను దేశ ప్రతిష్టను శిఖరాగ్రానికి చేర్చింది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్టుగా రియో గేమ్స్‌ పరాభవానికి టోక్యోలో బదులు తీర్చుకుంది. కుంగుబాటును అధిగమిస్తూ.. గాయాలను దాటుకుంటూ.. లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ.. అంతులేని ఆత్మవిశ్వాసంతో.. ఇదిగో.. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్‌ రజత పతకాన్నే సగర్వంగా అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత లిఫ్టర్‌గానూ నిలిచింది. ఈ మణిపురి కోమలి ప్రతిభకు ఇప్పుడంతా జయహో చాను అంటూ జేజేలు పలుకుతున్నారు.


స్వర్ణం కోసం ప్రయత్నించా. అయినా రజతం అందుకోవడం గర్వంగా ఉంది. ఈ పతకాన్ని దేశానికి అంకితం చేస్తున్నా. ఈ సందర్భంగా నా కుటుంబాన్ని గుర్తుచేసుకోవాలి. ముఖ్యంగా మా అమ్మ చేసిన త్యాగానికి వెల కట్టలేం. 2016 తర్వాత నా ప్రదర్శనను మెరుగుపర్చుకునేందుకు కఠోరంగా శ్రమించా. ఈక్రమంలో నా సోదరి పెళ్లికి కూడా వెళ్లలేదు. కోచ్‌ విజయ్‌ శర్మతో పాటు ప్రభుత్వం, స్పాన్సర్లు అంతా నాకు మద్దతుగా నిలిచారు. 

    - మీరాబాయి చాను


పంతం పట్టి.. పతకం ముద్దాడి..

దృఢ సంకల్పం ముందు కొండైనా తలొంచాల్సిందే. అలాంటి మనోబలం ఉన్న లిఫ్టర్‌ మీరాబాయి. ఎన్నో అడ్డంకులు.. ఎన్నోసార్లు నిరాశ.. వేధించిన గాయాలు. కానీ, అలుపెరుగని పోరాట స్ఫూర్తితో.. జీవిత స్వప్నాన్ని నెరవేర్చుకుంది. విశ్వవేదికపై మువ్వన్నెలను రెపరెపలాడించిందీ మణిపూర్‌ మణిపూస. ఐదేళ్లక్రితం రియోలో నిరాశపడ్డా.. పతకం కోసం పంతం పట్టింది. టోక్యోలో తారాజువ్వలా ఎగసింది. కట్టెలు మోసిన చేతులతోనే.. విశ్వవేదికపై ‘రజతం’తో మెరిసింది.


అమ్మ ఇచ్చిన చెవి కమ్మలతో..

మీరాబాయి చాను రజతంతో పాటు ఒలింపిక్‌ రింగ్‌లతో కూడిన బంగారు చెవి కమ్మలు కూడా అందరినీ విశేషంగా ఆకర్షించాయి. వాటి వెనుక ఆమె తల్లి త్యాగం ఉంది. కూతురు ఎలాగైనా ఒలింపిక్‌ పతకం సాధించాలనే తపనతో వాటిని చాలా ఏళ్ల క్రితమే ఆమె చేయించింది. ఇప్పుడవి చానుకు గుడ్‌లక్‌ సింబల్‌గా మారడం విశేషం. వాటిని టీవీలో చూశాక తల్లి సైఖోమ్‌ ఓంగ్‌బి టోంబి లీమా భావోద్వేగానికి గురైంది ‘ఆ రింగ్స్‌ను రియో గేమ్స్‌కు ముందు ఇచ్చాను. వాటిని నా బంగారం, దాచుకున్న సొమ్మును కలిపి చాను కోసం చేయించాను. రజతం సాధించాక టీవీలో వాటిని చూడగానే నాకు కన్నీళ్లు ఆగలేదు. టోక్యోకు వెళ్లేటప్పుడే స్వర్ణం సాధిస్తానని, కనీసం ఓ పతకమైనా దక్కించుకుంటానని మాటిచ్చింది. శనివారం పోటీలను తిలకించేందుకు మా దూరపు బంధువులు కూడా ఇక్కడికి వచ్చి టీవీలో చూశారు. ఆమె పతకంతో మా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చాను రాక కోసం నిరీక్షిస్తున్నాం’ అని లీమా హర్షం వ్యక్తం చేసింది. పోటీలకు ముందు వీడియో కాల్‌లో తల్లి ఆశీర్వాదం తీసుకున్నాకే చాను బరిలోకి దిగింది. 


ప్రశంసల జల్లు

వెయిట్‌ లిఫ్టింగ్‌లో  పతకం సాధించిన చానుకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ఒలింపిక్స్‌లో పతకంతో భారత్‌కు మంచి శుభారంభాన్నిచ్చావు. భవిష్యత్‌లో దేశానికి మరింతగా పేరు తేవాలి.       

 - ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మీరా ప్రదర్శనతో యావత్‌ దేశం మురిసింది. ఆమె విజయంతో దేశ ప్రజలు ఉప్పొంగారు.         

- ప్రధాని నరేంద్ర మోదీ 

 దేశం గర్వించదగిన క్షణాలు. చాను చారిత్రక ప్రదర్శనతో ప్రతి భారతీయుడు ఉప్పొంగిపోతున్నాడు.       

- హోం మంత్రి అమిత్‌ షా

తొలి రోజే దేశానికి పతకం అందించిన చానుకు శుభాకాంక్షలు. తన బిడ్డను చూసి దేశం గర్విస్తోంది. 

- కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ 

అద్భుతమైన ప్రదర్శన. గాయం నుంచి కోలుకొని చారిత్రక పతకం సాధించడం ఆశ్చర్యకరం. దేశం గర్వపడేలా చేశావు.   

- సచిన్‌ టెండూల్కర్‌

మీరా రజతం సాధించడం గొప్ప విషయం. ఇదే స్ఫూర్తితో మిగతా వారు పతకాలు కొల్లగొట్టాలి.       

- తెలంగాణ సీఎం కేసీఆర్‌

ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో భారత్‌ ఖాతా తెరవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. రజత పతకం సాధించిన మీరాకు అభినందనలు. 

- ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి

వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు శుభాకాంక్షలు. దేశం ఆమెను చూసి గర్విస్తోంది.    

- తెలంగాణ మంత్రి కేటీఆర్‌

వెయిట్‌ లిఫ్టింగ్‌ కుటుంబానికి సంతోషకరమైన రోజు. మీరా పతకం సాధించడం వల్ల ఎంతో మంది ఈ క్రీడలవైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. టోక్యోలో భారత్‌కు 10 నుంచి 12 పతకాలు లభిస్తాయని ఆశిస్తున్నా.         

  -కరణం మల్లీశ్వరి, ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వీసీ


పేదరికానికి ఎదురీది..:

లిఫ్టర్‌గా మారాలని నిశ్చయించుకున్నా.. అనేక అడ్డంకులు. పేద కుటుంబం కావడంతో మీరాకు ఆర్థికంగా అండ దొరకలేదు. దీనికితోడు అటు స్కూల్‌.. ఇటు ట్రైనింగ్‌ చేయడం కష్టంగా మారింది. తన ఇంటికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకాడమీకి ఓ బస్‌ మారి వెళ్లాల్సిన పరిస్థితి. మొదట్లో వెదురుబొంగులతోనే సాధన చేసింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ ఖరీదైన క్రీడ కావడంతో.. ఆమెకు తగిన డైట్‌ కూడా లభించేది కాదు. వారంలో రెండుమూడుసార్లు మాత్రమే గుడ్డు, మాంసం తినేది. కానీ స్పాన్సర్లు దొరకడంతో కఠోర శిక్షణను ఆరంభించింది. 2009లో జాతీయస్థాయి పతకం సాధించిన మీరా.. 2014లో కామన్వెల్త్‌ పతకంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 


రియో నుంచి రాటుదేలి..:

వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చితే.. అత్యున్నతస్థాయికి ఎదుగుతారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చాను తీవ్రంగా నిరాశపరిచింది. తీవ్ర ఒత్తిడికి లోనైన మీరా.. స్నాచ్‌లో ఒక్కసారి మాత్రమే బరువు ఎత్తగా.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో మూడుసార్లూ విఫలమైంది. కానీ, ఆ బాధను ఎదుగుదలకు మెట్లుగా మార్చుకొంది. 2017లో వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. తర్వాతి ఏడాది కామన్వెల్త్‌లో స్వర్ణంతో మెరిసింది. ఈక్రమంలో వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేసింది. తాను ఎంతగానో ఇష్టపడే కుటుంబానికి దూరంగా ఉండడంతోపాటు.. వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో పాల్గొనడం కోసం అక్క పెళ్లి కూడా వెళ్లలేక పోయింది. వెన్నునొప్పి కారణంగా మీరా 2018లో ఆసియాడ్‌కు దూరమైంది. అయితే, ఏడాది విశ్రాంతి తర్వాత మళ్లీ సాధనను ఆరంభించిన చాను.. 2019లో ఆసియా, వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో పతకాలతో అదరగొట్టింది. విశ్వక్రీడలకు గురి పెట్టిన చాను.. పతకం కోసం అకుంఠిత దీక్షతో సాధన చేసింది. ఒలింపిక్‌ పతకంతో దేశాన్ని మురిసేలా చేసింది. 

-ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం

మీరాబాయి చాను కెరీర్‌ ఘనతలు

ఒలింపిక్స్‌ (2021) - రజతం

ఆసియా చాంపియన్‌షిప్‌ (2020) - కాంస్యం

కామన్వెల్త్‌ క్రీడలు (2018) - స్వర్ణం

ప్రపంచ చాంపియన్‌షిప్‌ (2017) - స్వర్ణం

కామన్వెల్త్‌ క్రీడలు (2014) - రజతం


ఒలింపిక్స్‌లో పోటీ..

అత్యంత కఠినంలో కఠినం. ఈ పతకం కోసం అథ్లెట్లు జీవితాలనే పణంగా పెడతారు. సైకోమ్‌ మీరాబాయి చాను కూడా ఆ కోవకు చెందిన లిఫ్టరే. నిరుపేద కుటుంబంలో జన్మించింది మీరా. సైకోమ్‌ క్రితి మీటే, ఓంగ్‌బి టోంబి లీమా దంపతుల ఆరుగురు సంతానంలో మీరా చిన్నది. బాల్యంలో మగ పిల్లలతోనే ఎక్కువగా ఆడేది. చిన్నతనం నుంచే ఆమె జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు. వంట చెరకు కోసం కొండకోనలకు వెళ్లేది.. కుంటల్లో మంచి నీటిని తెచ్చేది.. పాలక్యాన్లు మోసేది. 12ఏళ్ల వయసులోనే చాను బలం ఏంటో తెలిసింది. ఓసారి ఆమె అన్న కట్టెల మోపును మోయలేకపోతే.. తాను ఎత్తుకొని రెండు కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకెళ్లింది. బడికెళ్లే వయసులో విలువిద్య పట్ల ఆకర్షితురాలైనా.. మణిపూర్‌కే చెందిన కుంజారాణి దేవి గురించి విని వెయిట్‌లిఫ్టింగ్‌ను ఎంచుకొంది. కట్టెల మోతతో మొదలైన ఆమె ప్రయాణం.. టోక్యో ఒలింపిక్స్‌కు చేరింది. 


Updated Date - 2021-07-25T08:44:13+05:30 IST