Abn logo
May 28 2020 @ 02:33AM

వెండితెర వెలుగు దీపం

ఒక జాతి మొత్తానికీ గౌరవం తెచ్చే వ్యక్తులు కోటికొక్కరు ఉంటారు. అటువంటి యన్టీఆర్‌ తెలుగు జాతికీ, తెలుగు సినీరంగానికీ వసివాడని కస్తూరీ తిలకం. సినిమా, రాజకీయాలు రెంటినీ శ్వాసించి, తన జీవితకాలంలో ఆ రెండు రంగాలనూ అద్వితీయంగా శాసించిన వ్యక్తి యన్టీఆర్‌.


తెలుగు సినీరంగానికి ఆయన చేసిన సేవ అప్పటికీ, ఇప్పటికీ అనన్య సామాన్యమే. వెండి తెరపై కథానాయకుడిగా ఆయన ప్రవేశించే నాటికి తెలుగు సినిమా బాల్యావస్థలో ఉంది. ఆర్థికంగా ఒక పరిశ్రమగా స్థిరపడలేదు. కేవలం ఏడాదికి పది సినిమాలు మాత్రమే వస్తున్న ఆ రంగాన్ని తన వృత్తి జీవిత కాలంలో ఉజ్వల స్థాయికి చేర్చిన ఘనత యన్టీఆర్‌దే. ఏడాదికి పది సినిమాల స్థాయి సినీరంగాన్ని తాను ఆ రంగం నుంచి నిష్క్రమించే సమ యానికి ఏడాదికి వంద సినిమాల స్థాయికి తీసుకువెళ్ళిందీ ఆయ నే. సినీరంగంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే, షూటింగ్‌లో చేయి విరిగి, రూములో మిత్రులతో కూర్చొని, భోజనానికి మెస్‌ టికెట్లు సైతం అయి పోయిన దుర్భరక్షణాల్లో ఆవేశపరుడైన ఓ ఔత్సాహిక యువ నటుడు చేపట్టిన దీక్ష తెలుగు సినీ రంగాన్ని ఈ స్థాయికి ఎదిగేలా చేసింది. ‘పదిమందికీ ఆకలి తీర్చేలా సినీ రంగం ఎదగాలి. ఈ రంగం పురోభివృద్ధికి మనం పాటుపడితే, దీనితో పాటే మనమూ ఎదుగుతాం’ అంటూ తీసుకున్న నిర్ణయాన్ని కెరీర్‌ చివరి దాకా ఆయన విడిచిపెట్టలేదు. తెలుగు సినిమాను వెలుగు తీరాలకు చేర్చారు. 


ఫ యన్టీఆర్‌ తన సినీ కెరీర్‌లోని తొలి ఇరవై ఏళ్ళకే (1950 - 1970) ఏకంగా రెండొందల సినిమాలు చేశారు. అంటే ఏడాదికి సగటున పది సినిమా లు చేశారు. విశేషం ఏమిటంటే, ఆ కాలవ్యవధిలో యన్టీఆర్‌ కాకుండా మిగతా సినిమా ఇండస్ట్రీ మొత్తం కలసి కూడా దాదాపు ఇన్నే సినిమాలు చేసింది. అలా పరిశ్రమ పురోగతిలో సగభాగం ఆయనే! సగం భారం ఆయన మోసినదే. మహాభారతంలో కుంతీదేవి భీముడికి సగం అన్నం పెట్టి, మిగతా సగభాగం తతిమా పాండవులకు పెట్టినట్టు, తెలుగు సినీ కళామాత స్వయంగా యన్టీఆర్‌కు సగభాగం పంచి ఇచ్చింది. ఆయన తన కెరీర్‌తో సినీ రంగాన్ని స్థిరపరిచి, పరిశ్రమ పురోభివృద్ధితో ఆ సగభాగాన్ని ఆమెకే నైవేద్యం చేశారు.  


ఫ ఆ నందమూరి అందగాడు తన కెరీర్‌లో మొత్తం 300 పైగా సినిమాలు చేస్తే, వాటిలో 250కి పైగా చిత్రాలు పెట్టిన పెట్టుబడిని వెనక్కి తేవడం ఒక అపూర్వ చరిత్ర. అందులో 200 పైగా సినిమాలు లాభాలు తెచ్చాయి. మరో యాభై సినిమాలు ఫస్ట్‌ రిలీజ్‌లో నష్టపరచినా, తరువాత కాలంలో సెకండ్‌ రిలీజుల్లో, ఆపై వచ్చిన వీడియో, డీవీడీ, శాటిలైట్‌ టీవీ ప్రసారాల లాంటి వివిధ మాధ్యమాల్లో జనాదరణతో లాభాలు తేవడం విశేషం. యన్టీఆర్‌ కెరీర్‌లో దాదాపు 125 సినిమాలు తొలి రిలీజుకు అయిదేళ్ళ తరువాత కూడా పదే పదే రీరిలీజవుతూ, అలా విడుదలైన అనేక పర్యాయాలు ఆ చిత్ర నిర్మాణవ్యయాన్ని మళ్ళీ మళ్ళీ రాబట్టడం ఘనమైన విషయం. మరో గొప్ప విశేషం ఏమిటంటే, యన్టీఆర్‌ నటించిన చిత్రాలలో దాదాపు 99 శాతం చిత్రాలు తొలి రిలీజైన అయిదేళ్ళ తరువాతా మళ్ళీ ల్యాబ్‌ నుంచి కొత్తగా వేసిన ప్రింట్లతో రీరిలీజ్‌ అయ్యేవి. అలా అన్ని పాత చిత్రాలకు కొత్త ప్రింట్లు తీసి మరీ, థియేటర్లలో ఆడిన ఘనత భారత సినీచరిత్రలో మరెవ్వరికీ దక్కలేదు. ఒక్క ఎం.జి.ఆర్‌. మినహా ఇలా కొత్త ప్రింట్లతో పదే పదే రీరిలీజైన పాత చిత్రాల సంఖ్య మరి ఏ ఇతర భారతీయ హీరోకూ 25శాతం కూడా లేకపోవడం గమనార్హం. చదువుకొనే రోజుల నుంచి చివరి దాకా తెలుగు భాష, జాతి ఆత్మగౌరవాలే ఆభరణాలుగా బతకడం యన్టీఆర్‌కే చెల్లింది. తెలుగు పతాకాన్ని ప్రపంచ రాజకీయ వినువీధుల్లో ఆయన ఎగురవేశారు. అందుకే, అటు తెరపైనా, ఇటు ఇలలోనా యన్టీఆర్‌ ఎప్పుడూ ఒకే ఒక్కడు. తెలుగువాడిగా ఆయన చేసిన సినిమాలు, ఆయన చూపిన ప్రజా సంక్షేమ కాంక్ష జాతి మరువదు. తరాలు మారినా, యుగాలు మారినా ఆయన నిత్య తెరస్మరణీయుడు. చిరస్మరణీయుడు.

కర్టెసీ: కొమ్మినేని వెంకటేశ్వరరావు  

Advertisement
Advertisement
Advertisement