ప్చ్‌..ఆయన ‘లాభం లేదు!’

ABN , First Publish Date - 2020-06-02T08:45:37+05:30 IST

సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌..

ప్చ్‌..ఆయన ‘లాభం లేదు!’

సింహాచలం ఈవో చర్యలతో దేవస్థానానికి నష్టం

ఆయన హైలీ ఇల్లీగల్‌, ఇర్రెగ్యులర్‌

చర్యలు కూడా తీసుకోవాలి

విచారణ అధికారి తీవ్ర వ్యాఖ్యలు

సింహగిరిపై మూడుచోట్ల అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు

తవ్వకందారుల నుంచి రూ.లక్షల రికవరీకి సిఫారసు

మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా పనులు

పనులు పూర్తయ్యాక టెండర్లు

తప్పుబట్టిన దేవదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌

ఆయన్ను కొనసాగిస్తే కొండపై పశుపక్ష్యాదులు, వృక్ష, జంతుజాలానికి నష్టం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(ఈఓ) వెంకటేశ్వరరావు చర్యలతో సింహాచలం దేవస్థానానికి చాలా నష్టం జరుగుతోందని, ఆయన పనితీరు బాగాలేదని, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం నియమించిన విచారణ అధికారి దేవదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ (ఎస్టేట్స్‌) చంద్రశేఖర ఆజాద్‌ తన నివేదికలో పేర్కొన్నారు. సింహాచలం దేవస్థానం భూముల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు, చందనోత్సవానికి అనధికార వ్యక్తుల హాజరు, కొండపై అక్రమంగా మట్టి తవ్వకం... అనే మూడు అంశాలపై ఆయన విచారణ జరిపారు. దేవస్థానం భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆయన ధ్రువీకరించారు. ఈఓ చురుగ్గా పనిచేయడం లేదని, ఆయన దృష్టికి ఆరోపణలు వచ్చినా స్పందించి, చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించలేదని పేర్కొన్నారు.



మూడుచోట్ల అక్రమ తవ్వకాలు

దేవస్థానం కొండపై అక్రమంగా మట్టి తవ్వి తీసుకుపోతున్నారనే విషయమై ‘అప్పన్నకు టెండర్‌’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ఫిబ్రవరి 25న కథనం ప్రచురించింది. దానిపై ఇప్పుడు జాయింట్‌ కమిషనర్‌ విచారించారు. దేవస్థానానికి చెందిన ఇతర అధికారులతో కలిసి వెళ్లి మే 18న ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే ‘ఆంధ్రజ్యోతి’లో పేర్కొన్న టోల్‌గేట్‌ సమీపానే కాకుండా మరో రెండుచోట్ల కూడా అక్రమంగా గ్రావెల్‌ తవ్వి తీసుకుపోయినట్టు గుర్తించారు. ఘాట్‌రోడ్‌ ప్రవేశ మార్గానికి 250 మీటర్ల దూరంలో భారీగా గ్రావెల్‌ తవ్వినట్టు ఆయన గుర్తించారు. గణేశ్‌ కనస్ట్రక్షన్‌కు చెందిన కె.శ్రీనివాసరావు అనే వ్యక్తి దాత పేరుతో ఈ తవ్వకాలు చేపట్టారని, ఆయన పనికి రాని మట్టిని తీసుకుపోతున్నట్టు పేర్కొన్నారని వివరించారు.


సుమారు ఎనిమిది వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తరలిపోయిందని, దీనివల్ల దేవస్థానానికి రూ.15 లక్షల నష్టం వాటిల్లిందని, ఆ మొత్తాన్ని కె.శ్రీనివాసరావు నుంచి వసూలు చేయాలని సూచించారు. అలాగే కొండపై రిపీటర్‌ స్టేషన్‌ వద్ద పార్కింగ్‌ ఏరియా పేరుతో గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ అధికారులకు చెప్పకుండా, ఇష్టానుసారంగా తవ్వడం వల్ల అక్కడ ఏమాత్రం పెద్ద వర్షం కురిసినా మట్టి పెళ్లలు విరిగిపడే ప్రమాదం పొంచి వుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పని చేపట్టాలని మాస్టర్‌ప్లాన్‌లో వున్నప్పటికీ దానిని ఎగ్జిక్యూట్‌ చేసిన విధానం అడ్డగోలుగా ఉందన్నారు. ఈ తవ్వకం పనులకు కూడా ఎటువంటి ఒప్పందాలు లేవని, దాతలు చేస్తున్నారని ఈఓ పేర్కొన్నారని వివరించారు. గిరిజన కుటీరాల వెనుక కూడా గ్రావెల్‌ను తవ్వేశారని, అది చాలా ప్రమాదకరమని నివేదికలో ప్రస్తావించారు. ఈ పనులు ఏవీ మాస్టర్‌ ప్లాన్‌లో లేవని పేర్కొన్నారు.


ఏపీ ట్రాన్స్‌కో కూడా...

ఏపీ ట్రాన్స్‌కో కొండ పైనుంచి హైపవర్‌ తీగలను వేసింది. వాటి కోసం కాంట్రాక్టర్‌ అక్కడ కొండను తవ్వేశారు. ఆ మట్టిని సొంత పనులకు తరలించుకుపోయింది. సుమారుగా ఐదు వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తీసుకుపోయారని, వారి నుంచి రూ.6 లక్షలు వసూలు చేయాలని సూచించారు. 


పనులు పూర్తయ్యాక టెండర్లు?

కొండపై పలు ప్రాంతాల్లో పార్కింగ్‌కు అనుకూలంగా కొన్ని ప్రాంతాలను చదును చేశారు. ఆయా పనులను దాతలే చేశారు. అవి పూర్తయిన తరువాత వాటి కోసం మే 16వ తేదీన టెండర్లు పిలుస్తూ ప్రకటన ఇచ్చారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని విచారణ అధికారి పేర్కొన్నారు. పైగా ఎక్కడెక్కడ చదును చేస్తున్నారో స్పష్టత లేదని ఆరోపించారు.


ఈఓ హైలీ ఇల్లీగల్‌

విచారణ అధికారి తన నివేదిక చివరి పేరాలో ఈఓ హైలీ ఇల్లీగల్‌, ఇర్రెగ్యులర్‌ అని పేర్కొన్నారు. ఆయన్ను అక్కడ కొనసాగిస్తే... దేవస్థానం కొండపై పశుపక్ష్యాదులు, వృక్ష జంతుజాలానికి నష్టమని, అక్కడ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఈఓను కొనసాగిస్తే... దేవస్థానం ఆశయాలకు భంగం కలుగుతుందన్నారు. మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా వ్యవహరించడం, అక్రమంగా మట్టి తవ్వకాలు, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసినందుకు ఆయనపై తగిన చర్యలు చేపట్టాలని విచారణ అధికారి సూచించారు.

Updated Date - 2020-06-02T08:45:37+05:30 IST