ష్‌... గప్‌చుప్‌

ABN , First Publish Date - 2021-07-30T05:38:55+05:30 IST

సింహాచలం దేవస్థానం..

ష్‌... గప్‌చుప్‌
సింహాచలం పంచగ్రామాలు వ్యూ

సింహాచలం దేవస్థానం భూములపై ముగిసిన విచారణ

పది రోజుల క్రితమే నివేదిక సమర్పించిన కమిటీ

ఆలయం ఆధీనంలో లేని భూములకే మినహాయింపు ఇచ్చినట్టు నిర్ధారణ?

అన్నీ పాత లెక్కలే... కొత్తగా గుర్తించిందేమీ లేదు

ఏం చేయాలో పాలుపోక అధికార పార్టీ పెద్దల తర్జనభర్జన

దాని ఆధారంగా చర్యలు తీసుకున్నా... న్యాయస్థానంలో నిలవడం కష్టమనే వాదన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): సింహాచలం దేవస్థానం భూములపై అందిన నివేదికను ఏమి చేయాలా?...అని పాలక పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు. దేవస్థానం చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు పనిచేసిన కాలంలో సుమారు 840 ఎకరాలను పక్కదోవ పట్టించారని చెబుతూ ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక కమిటీతో విచారణ చేయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 16వ తేదీనే కమిటీ నివేదికను అందజేసింది. రూ.10 వేల కోట్ల విలువైన భూములను నాటి ఈఓ రామచంద్రమోహన్‌, చైర్మన్‌ అశోక్‌గజపతిరాజు తప్పించేశారని...అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు చేసిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. 


ఇటు సింహాచలం దేవస్థానం, అటు మాన్సాస్‌లో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు అశోక్‌గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా వున్న సమయంలో తప్పులు జరిగాయని చెప్పడానికి అధికార పార్టీ నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మాన్సాస్‌ ట్రస్టులో ఆడిట్‌ జరగలేదని, అడ్డగోలుగా భూములు అమ్మేసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. ఆ తరువాత మరో అడుగు ముందుకు వేసి సింహాచలం దేవస్థానానికి చెందిన 840 ఎకరాలను రికార్డుల నుంచి తప్పించేశారని ఆరోపించారు. వీటిని నిగ్గు తేలుస్తామంటూ నెల రోజుల క్రితం ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది. వారి విచారణకు అడ్డం పడతారనే ఆలోచనతో సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్టులకు ఈఓగా ఏకకాలంలో పనిచేసిన కె.రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి దేవదాయ శాఖ సరండర్‌ చేసింది. విచారణ కమిటీకి 15 రోజులు గడువు ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో, రికార్డులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని సూచించారు. 


అన్నీ పాత లెక్కలే...కొత్తగా గుర్తించిందేమీ లేదు

దేవస్థానానికి పంచ గ్రామాల్లో 2010 రికార్డుల ప్రకారం 11,118 ఎకరాల భూమి ఉండగా, 2016లో ప్రభుత్వ రికార్డులకు ఎక్కించినప్పుడు వాటి విస్తీర్ణం 10,278 ఎకరాలుగా పేర్కొన్నారు. ఈ వ్యత్యాసం 840 ఎకరాలు. ఈ భూముల (840 ఎకరాలు)ను ఏ కారణంతో నిషేధిత జాబితా 22-ఏ(1)సిలో చేర్చలేదో అప్పటి అధికారులు స్పష్టంగా ఆనాడే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వాటిలో కొన్నింటిని గతంలోనే వేలం ద్వారా విక్రయించారని, మరికొన్నింటిని ఆక్రమణదారులకు క్రమబద్ధీకరించారని, మరికొన్ని ఇనామ్‌ రిజిస్టర్‌ 1191లో నమోదు కాలేదని పేర్కొన్నారు. అలాగే ముడసర్లోవలో కేంద్ర కారాగారం కోసం సర్వే నంబర్‌ 275లో 110.16 ఎకరాలు ఇచ్చినందున, దానిని మినహాయించినట్టు చూపించారు. అదేవిధంగా హిందూస్థాన్‌ పాలిమర్స్‌ దఫదఫాలుగా వివిధ సర్వే నంబర్లలో రైతుల నుంచి 30 ఎకరాల వరకు కొనుగోలు చేయగా, వారికి క్రమబద్ధీకరించారు. వేపగుంటలో హౌసింగ్‌ బోర్డుకు 2002లో 50 ఎకరాలు ఇచ్చినందున వాటిని మినహాయించారు. ఏఎంజీ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థకు వేలం ద్వారా 11.9 ఎకరాలు విక్రయించారు. అలాగే దేవస్థానం ఉద్యోగుల హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీకి 8 ఎకరాలు ఒకసారి,  3.4 ఎకరాలు మరోసారి ఇచ్చారు. దాంతో వాటిని మినహాయించారు.


ఇవికాకుండా విశాఖ నగర పాలక సంస్థకు వాటర్‌ ట్యాంకుల నిర్మాణానికి, బీఆర్‌టీఎస్‌ రహదారుల నిర్మాణానికి కొన్ని భూములు ఇచ్చారు. బస్సు డిపోల నిర్మాణానికి పంచ గ్రామాల పరిధిలో ఆర్‌టీసీకి దఫదఫాలుగా కొంత భూమి ఇచ్చారు. వాటిని కూడా మినహాయించారు. దేవస్థానం భూముల్లో నివాసం వుంటున్న వారికి వాటిని క్రమబద్ధీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో అవకాశం కల్పించింది. అప్పుడు తక్షణమే డబ్బు కట్టిన వారికి కొన్ని భూములను క్రమబద్ధీకరించారు. వాటన్నింటినీ సర్వే నంబర్లు, విస్తీర్ణంతో సహా పేర్కొంటూ వాటిని కూడా 22-ఏ-1-సి జాబితాలో చేర్చలేదు. 2016కు ముందే ఇవన్నీ జరిగిపోయాయి. దాంతో అవన్నీ దేవస్థానం స్వాధీనంలో లేవని నాటి ఈఓ రామచంద్రమోహన్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే ఆ భూములన్నీ రామచంద్రమోహన్‌, అశోక్‌గజపతిరాజు కావాలనే జాబితాలో చేర్చలేదని, అందులో స్వార్థం ఉందని, వాటి ద్వారా రూ.10 వేల కోట్లు లబ్ధి పొందారంటూ  వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు.


ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ...ఆ పాత జాబితానే బయటకు తీసి, దేవస్థానం భూములు అన్యాక్రాంతం అయిపోయాయంటూ నివేదిక ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ భూముల్లో కొన్ని ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో దేవస్థానం భూములుగానే వున్నాయని తమ విచారణలో తేలిందని పేర్కొంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ భూముల్లో ఆయా సంస్థలే వుండడం గమనార్హం. ఇప్పుడు ఈ నివేదిక ద్వారా ఏమైనా చర్యలు చేపడితే...అవి కోర్టులో నిలుస్తాయా?...అని పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. 


రికార్డుల్లోకెక్కని వాటిలో కొన్ని...

- ముడసర్లోవలో కేంద్ర కారాగారం కోసం కేటాయించిన 110.16 ఎకరాలు

- హిందూస్థాన్‌ పాలిమర్స్‌ రైతుల నుంచి కొనుగోలు చేసిన 30 ఎకరాలు

- వేపగుంటలో హౌసింగ్‌ బోర్డుకు 2002లో ఇచ్చిన 50 ఎకరాలు

- ఏఎంజీ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థకు వేలం ద్వారా విక్రయించిన 11.9 ఎకరాలు

- దేవస్థానం ఉద్యోగుల హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీకి ఇచ్చిన సుమారు 12 ఎకరాలు

- విశాఖ నగర పాలక సంస్థకు వాటర్‌ ట్యాంకులు, బీఆర్‌టీఎస్‌ రహదారుల నిర్మాణానికి ఇచ్చిన భూములు

- బస్సు డిపోల నిర్మాణానికి ఆర్‌టీసీకి ఇచ్చిన భూములు

- 2000 సంవత్సరంలో ఆక్రమణదారులకు రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించిన దేవస్థానం భూములు

Updated Date - 2021-07-30T05:38:55+05:30 IST