వివాదాల క్షేత్రం.. సింహగిరిపై వరుసగా తప్పులు

ABN , First Publish Date - 2020-09-24T17:01:41+05:30 IST

సింహాచలం దేవస్థానంలో వరుసగా తప్పులు జరుగుతున్నాయి. వాటిని..

వివాదాల క్షేత్రం.. సింహగిరిపై వరుసగా తప్పులు

అనుమతులు లేకుండా గ్రావెల్‌ తవ్వకాలు

వర్గాలుగా విడిపోయిన సిబ్బంది

బంగారం విక్రయ వ్యవహారంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పాత్ర

కొండ దిగని కార్తీక్‌...

దేవస్థానం భూముల్లో అక్రమ నిర్మాణాలు

దిద్దుబాటులోనూ తప్పటడుగులు

షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంలో తప్పులు ఎత్తిచూపినా చర్యలు శూన్యం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): సింహాచలం దేవస్థానంలో వరుసగా తప్పులు జరుగుతున్నాయి. వాటిని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తున్నారు. సిబ్బంది వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఈఓ స్థాయి అధికారులు కూడా వారికి కొమ్ముకాస్తున్నారు. కిందివారు ఏది చెబితే...అదే నిజమని నమ్మి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ వివాదాలు ఇలా కొనసాగుతుండగా చైర్మన్‌ కూడా తన మాటే నెగ్గాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. 


ఒకటి కాదు... రెండు కాదు

ఇటీవల దేవస్థానం నిర్వహణపై అనేక ఆరోపణలు వచ్చాయి. అనుమతులు లేకుండా గ్రావెల్‌ తవ్వకాలు, ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు, అప్పన్న బంగారం విక్రయం పేరిట మోసం... తదితర ఆరోపణలపై దేవదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ (ఎస్టేట్స్‌) చంద్రశేఖర్‌ ఆజాద్‌ రెండుసార్లు విచారణ జరిపారు. ఆయన నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ కార్యాలయం ఉత్తర్వులు జారీచేస్తే... దానిని పక్కనపెట్టి గతంలో పనిచేసిన ఈఓ ఒకరు సొంతంగా మరో కమిటీ వేసి విచారణ చేయించారు. ఏఈఓ స్థాయి అధికారిపై విచారణకు మరో ఏఈవోని నియమించడం విమర్శలకు తావిచ్చింది.


దేవస్థానం భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు ఏఈఓ శ్రీనివాసరావు సహకరించారని ఆజాద్‌ కమిటీ పేర్కొంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని చెబితే... అప్పటి ఈవో తీసుకోలేదు. ఆ తరువాత తప్పనిసరి స్థితిలో అధికారులు ఆయన్ను సస్పెండ్‌ చేశారు. ఇక దేవస్థానం ఎంప్లాయీస్‌ యూనియన్‌ కొండ దిగువన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేస్తుంటే చూసీచూడనట్టుగా ఉన్నతాధికారులు వ్యవహరించారు. దీనిని కూడా ఆజాద్‌ ఆక్షేపించారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నట్టు తేల్చారు. అయినా యూనియన్‌ కార్యవర్గంపై చర్యలు లేవు. దీనిపై విజిలెన్స్‌ విచారణ కూడా జరిగింది.


విచారణతో బయటకు వచ్చిన రికార్డు

గతంలో ఇక్కడ పనిచేసిన ఈఈ మల్లేశ్వరరావు సర్వీసు రికార్డు గల్లంతైంది. ఆయన బదిలీపై వెళ్లిపోయారు. ఇక్కడ విజిలెన్స్‌ విచారణ మొదలుకావ డంతో మాయం చేసిన రికార్డును మళ్లీ తీసుకువచ్చి యథావిధిగా పెట్టేశారు.  కొన్నాళ్లు కనిపించడం లేదని చెప్పిన రికార్డు ఇప్పుడు ఎలా వచ్చిందనేది ఆ విభాగం సిబ్బంది చెప్పడం లేదు. దీనిపై విజిలెన్స్‌ ఆరా తీస్తోంది.


ఆ ముగ్గురి తప్పు ఎంత?

దేవస్థానం బంగారం విక్రయిస్తామంటూ ఓ మహిళ నెల్లూరుకు చెందిన వారి దగ్గర రూ.1.44 కోట్లు నొక్కేసింది. ఈ కేసు విచారణ సమయంలో  అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది ముగ్గురిని విధుల నుంచి తప్పించారు. వారిని ఎందుకు తప్పించారో అధికారికంగా వెల్లడించలేదు. వారిలో ఒకరు సొంతంగా బిల్లు పుస్తకాలు ముద్రించి, అన్నదానానికి విరాళాలు సేకరిస్తున్నారనే విషయం బయటపడింది. వారిని తొలగించారే తప్ప వారి నుంచి రికవరీ ఏమీ చేయలేదు. దీనికి తెర వెనుక ఎవరు సహకరించారనేది బయటకు రాకుండా చేశారు. ఇప్పుడు ఆ ముగ్గురిలో ఒకరిని మళ్లీ విధుల్లోకి తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.  


కార్తీక్‌పై చర్యలు ఏవీ?

ఇక కార్తీక్‌ అనే వ్యక్తిని దేవస్థానం చైర్మన్‌ తీసుకొచ్చారు. ఆయన కొండపై గత నాలుగు నెలలుగా అతిథి గృహంలో ఉంటున్నారు. రూపాయి కూడా కట్టలేదు. పైగా ఆయన పనులు చేయడానికి కొందరు సిబ్బందిని కేటాయించారు. కీలకమైన ఫైళ్లను ఆయన పరిశీలిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని చైర్మన్‌కు గత ఈఓ భ్రమరాంబ లేఖ రాశారు. ఆమె స్పందించకపోవడంతో ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. విచారణకు వచ్చిన ఆజాద్‌ సైతం కార్తీక్‌కు వ్యతిరేకంగా నివేదిక సమర్పించారు. అయినా అతడిని అక్కడి నుంచి వెనక్కి పంపలేదు. ఫైళ్లను ఇవ్వడం ఆపలేదు. కొత్త ఈఓగా త్రినాథ్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత అన్నీ పరిశీలిస్తున్నారే తప్ప ఆయన కూడా చర్యలకు నడుంకట్టలేదు. ఏదేమైనా సింహాచలం దేవస్థానం వివాదాల నిలయంగా మారిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.


Updated Date - 2020-09-24T17:01:41+05:30 IST