పాకిస్థాన్ సైన్యంపై సింధ్ పోలీసుల తిరుగుబాటు

ABN , First Publish Date - 2020-10-21T19:17:35+05:30 IST

వ్యవస్థలు ఒక్కొక్కటిగా నిర్వీర్యమైతే పర్యవసానాలు ఎలా ఉంటాయో

పాకిస్థాన్ సైన్యంపై సింధ్ పోలీసుల తిరుగుబాటు

కరాచీ : వ్యవస్థలు ఒక్కొక్కటిగా నిర్వీర్యమైతే పర్యవసానాలు ఎలా ఉంటాయో పాకిస్థాన్‌ను చూస్తే తెలుస్తుంది. ప్రజాస్వామిక ప్రభుత్వాలకు విలువ లేకుండా చేసి, సైన్యం శక్తిమంతమైతే ప్రజలకే కాదు పోలీసులకు సైతం రక్షణ ఉండదు. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలే కాదు కనీస ఆత్మగౌరవానికి కూడా చోటు దక్కదు. 


పాకిస్థాన్‌లో కీలు బొమ్మ ప్రభుత్వం, సైన్యం కలిసి అమలు చేస్తున్న విధానాలతో అణచివేతకు గురవుతున్న రాజకీయ నేతలతోపాటు పోలీసులు కూడా ఉద్యమాల బాట పడుతున్నారు. సింధ్ ప్రావిన్స్‌ పోలీసులు బహిరంగంగా సైన్యంపై తిరుగుబాటు ప్రకటించారు. సెలవుపై వెళ్ళేందుకు సామూహికంగా దరఖాస్తు చేశారు. 


పోలీసుల ఉద్యమానికి కారణం...

ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ప్రతిపక్షాల కూటమి నిరసనలు నిర్వహించింది. పాకిస్థాన్ డెమొక్రాటిక్ మువ్‌మెంట్ (పీడీఎం) పేరుతో ఈ నిరసనలు జరిగాయి. కరాచీలో జరిగిన ఈ కార్యక్రమాల్లో వేలాది మంది పాల్గొన్నారు. నిరసనల తర్వాత పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేత మరియం నవాజ్ భర్త సఫ్దర్ అవన్‌ను హోటల్‌లో అరెస్టు చేశారు. ఈ అరెస్టు సమయంలో సింధ్ ఐజీపీ ముస్తాక్ మెహర్ పట్ల సైన్యం అవమానకరంగా ప్రవర్తించిందని సింధ్ పోలీసులు ఆరోపించారు. సైన్యం ప్రవర్తనకు నిరసనగా పోలీసు ఉన్నతాధికారులు సెలవు కోసం సామూహికంగా దరఖాస్తు చేశారు. 


ఇదిలావుండగా, పీఎంఎల్-ఎన్ నేత ముహమ్మద్ జుబెయిర్ మాట్లాడుతూ, సింధ్ ఐజీపీని పాకిస్థాన్ రేంజర్లు కిడ్నాప్ చేసి, సఫ్దర్ అరెస్టుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేవిధంగా నిర్బంధించారని ఆరోపించారు. 


సింధ్ ప్రావిన్స్‌లోని ముగ్గురు అదనపు ఐజీలు, 25 మంది డీఐజీలు, 30 మంది ఎస్ఎస్‌పీలు, పదుల సంఖ్యలో ఎస్పీలు, డీఎస్పీలు, ఎస్‌హెచ్ఓలు సెలవు కోసం దరఖాస్తు చేశారు. ఈ నెల 18/19 తేదీల్లో జరిగిన సంఘటనలు తమను తీవ్రంగా బాధించాయని వీరు పేర్కొన్నారు. సింధ్ పోలీసు హైకమాండ్‌ను ఎగతాళి చేసి, దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ప్రొవిన్షియల్ పోలీస్ ఫోర్స్‌ను ఈ పరిణామాలు దిగ్భ్రాంతికి గురి చేసినట్లు పేర్కొన్నారు.


సైన్యంలో కదలిక 

సింధ్ ప్రావిన్స్‌లో పరిణామాలు పాకిస్థాన్ సైన్యంలో కదలిక తీసుకొచ్చాయి. ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా స్వయంగా రంగంలోకి దిగారు. కరాచీలో జరిగిన సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. 


జనరల్ బజ్వాకు బిలావర్ భుట్టో ఫోన్

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ మంగళవారం రాత్రి సింధ్ ఐజీపీ ముస్తాక్ మెహర్ నివాసానికి వెళ్ళారు. తాను జనరల్ బజ్వాతో ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు. కరాచీ సంఘటనపై పారదర్శకంగా దర్యాప్తు జరిపిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. అనంతరం ఐజీపీ తన సెలవు దరఖాస్తును వాయిదా వేశారు. సింధ్‌లోని ఇతర పోలీసు అధికారులను కూడా సెలవు పెట్టాలనే ఆలోచనను 10 రోజులపాటు వాయిదా వేయాలని కోరారు. మరోవైపు  సింధ్ పోలీసు శాఖ అధికార ప్రతినిథి ఇచ్చిన ట్వీట్‌లో జనరల్ బజ్వాను ప్రశంసించారు. తమ మనోభావాలను గుర్తించినందుకు, నిష్పాక్షిక విచారణకు ఆదేశించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2020-10-21T19:17:35+05:30 IST