భారత సంతతి వ్యక్తికి 8 ఏళ్ల జైలు శిక్ష..అదనంగా 24 కొరడా దెబ్బలు..!

ABN , First Publish Date - 2021-11-24T02:45:00+05:30 IST

భారత సంతతి వ్యక్తి అర్జున్ రత్నవేల్‌కు సింగపూర్‌లోని న్యాయస్థానం 8 ఏళ్ల కారాగార(కరెక్టివ్ సెంటెన్సింగ్) శిక్ష విధించింది. దీనికి అదనంగా.. నిందితుడికి 24 కొరడా దెబ్బలు వేయాలంటూ తీర్పిచ్చింది.

భారత సంతతి వ్యక్తికి 8 ఏళ్ల జైలు శిక్ష..అదనంగా 24 కొరడా దెబ్బలు..!

ఇంటర్నెట్ డెస్క్: భారత సంతతి వ్యక్తి అర్జున్ రత్నవేల్‌కు సింగపూర్‌లోని న్యాయస్థానం 8 ఏళ్ల కారాగార(కరెక్టివ్ సెంటెన్సింగ్) శిక్ష విధించింది. దీనికి అదనంగా.. నిందితుడికి 24 కొరడా దెబ్బలు వేయాలంటూ తీర్పిచ్చింది. అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసిన నేరంలో కోర్టు ఈ శిక్షలను విధించింది. 2018లో ఓ వ్యక్తిపై దాడికి సంబంధించిన కేసులో న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. ఇక గతంలో ఓ నేరంపై జైలుపాలయ్యాక సత్ప్రవర్తనపై విడుదలైన అర్జున్ ఈ నేరానికి పాల్పడ్డాడని తేల్చిన న్యాయమూర్తి అదనంగా మరో 360 రోజుల జైలు శిక్షను కూడా విధించారు. సింగపూర్ చట్టాల ప్రకారం.. కరెక్టివ్ సెంటెన్సింగ్ జైలు శిక్ష పడ్డవాళ్లు సత్ప్రవర్తనపై విడుదలయ్యే అవకాశం ఉండదు. సాధారణ జైలు శిక్షతో పోలిస్తే ఇది మరింత కఠినంగా, నిందితుడిలో మార్పు తెచ్చేందుకు ఉద్దేశించింది. 


విచారణ సందర్భంగా అక్కడి ప్రభుత్వ న్యాయవాది.. నిందితుడు అర్జున్ గురించి పలు విషయాలు కోర్టు దృష్టికి తెచ్చారు. 2018 నాటి కోసులోని బాధితుడికి, అర్జున్‌కి అంతకుమునుపే పరిచయం ఉందని, వారిద్దరి మధ్య పలుమార్లు తగాదా జరిగిందని చెప్పారు. 2018, జులై 25న బాధితుడు బస్టాప్‌లో ఉండటం చూసిన అర్జున్ అతడి స్నేహితులను బాధితుడిపైకి ఊసిగొల్పాడని, దాడిలో ఉపయోగించిన ఆయుధాలను అతడే అందించాడని తెలిపారు. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడటంతో అతడికి పలు ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. కాల్లో కొంత భాగం తొలగించాల్సి వచ్చింది. ఇక నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించడంతో కోర్టు అతడికి ఈ శిక్ష ఖరారు చేసింది. ఈ దాడిలో అర్జున్‌కు సహకరించిన మరో ముగ్గురు నిందితులు కూడా జైలు పాలయ్యారు. 

Updated Date - 2021-11-24T02:45:00+05:30 IST