తెలుగు NRI రాధిక సేవలకు గుర్తింపు.. ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక..

ABN , First Publish Date - 2021-08-27T23:03:00+05:30 IST

తెలుగు ఎన్నారై మహిళ రాధిక మంగిపూడికి అరుదైన అవార్డు దక్కింది.

తెలుగు NRI రాధిక సేవలకు గుర్తింపు.. ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక..

ఎన్నారై డెస్క్: తెలుగు ఎన్నారై మహిళ రాధిక మంగిపూడికి అరుదైన అవార్డు దక్కింది. తెలుగు భాషా దినోత్సవం-2021 సందర్భంగా రాధిక 'తెలుగు ఎన్నారై అవార్డు'కు ఎన్నికయ్యారు. ఏపీలోని విజయనగరానికి చెందిన రాధిక ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్నారు. కాగా, తెలుగు భాషా దినోత్సవాన్ని పురష్కరించుకుని రెండు రోజుల పాటు దక్షిణాఫ్రికా తెలుగు సమాజం, వీధి అరుగు వారు నార్వేలో వర్చువల్‌గా వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అవార్డు ప్రదానోత్సవం ఆగస్టు 28, 29తేదీల్లో జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్నారైల నుంచి అవార్డుల కోసం చాలా నామినేషన్లు వచ్చాయని, వాటిలో నుంచి కేవలం 12 మందిని మాత్రమే ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. వివిధ దేశాల్లో వీరంతా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని ప్రోత్సాహించడం కోసం పాటుపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. 


దీనిలో భాగంగా సింగపూర్‌లో రాధిక మంగిపూడి 2020 వరకు తెలుగు కళ, సంస్కృతి, కవిత్వానికి అందించిన అత్యుత్తమ సేవ, కృషికి ఈ అవార్డుకు ఎంపికయ్యారని తెలిపారు. ఆమె తెలుగు కవిత్వం, చిన్న కథలపై ఇప్పటికే రెండు పుస్తకాలు ప్రచురించినట్లు వారు పేర్కొన్నారు. దీంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిచే సింగపూర్ నుంచి తొలి చిన్న కథల రచయిత్రిగా ఆమె గుర్తింపు పొందారని వారు గుర్తు చేశారు. అలాగే 'ద గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం' అనే ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా పలు తెలుగు కథనాలు ప్రచురించి తెలుగు సాహిత్యం, సంస్కృతి ప్రచారంపై దృష్టి సారించారు. ఇప్పటికే ఆమె శ్రీ సాంస్కృతిక కళాసారధి సింగపూర్ ఆధ్వర్యంలో పలు తెలుగు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగమయ్యారు. ఈ సంస్థకు ఆమె కార్యనిర్వాహక సభ్యురాలిగా, కోఆర్డినేటర్‌గా కొనసాగుతున్నారు. ఇక 'తెలుగు ఎన్నారై అవార్డు' దక్కడం పట్ల రాధిక మంగిపూడి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు.      

 

Updated Date - 2021-08-27T23:03:00+05:30 IST