సింగపూర్‌లో ఘనంగా శ్రీవారి కల్యాణోత్సవం

ABN , First Publish Date - 2021-04-20T18:11:29+05:30 IST

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్ధం మరియు అందరి శ్రేయస్సే మహాసంకల్పంగా ఉగాది రోజు దేవదేవుడు శ్రీవారికి సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం తదితర కార్యక్రమాలు జరిగా

సింగపూర్‌లో ఘనంగా శ్రీవారి కల్యాణోత్సవం

సింగపూర్ సిటీ: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్ధం మరియు అందరి శ్రేయస్సే మహాసంకల్పంగా ఉగాది రోజు దేవదేవుడు శ్రీవారికి సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం తదితర కార్యక్రమాలు జరిగాయి. మహా గణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి,ఆంజనేయస్వామి వార్లకు అభిషేకము, విశేష కైంకర్యములతో పాటు శ్రీదేవి , భూదేవి సమేత శ్రీ శ్రీనివాసకల్యాణోత్సవమును స్థానిక సెరంగూన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయం నందు ఏప్రిల్ 13న అత్యంత  భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా, భగవన్నామ స్మరణల మధ్య తెలుగు సమాజం సభ్యులు నిర్వహించారు. కల్యాణోత్సవానంతరం బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అంతేకాకుండా ఉగాది పచ్చడిని ప్రత్యేక ప్యాకెట్ రూపంలో సుమారు 2వేల మందికి అందించారు. ఈ కార్యక్రమానికి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


కరోనా నేపథ్యంలో సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హిందూ ఎండోమెంట్స్ బోర్డ్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం దేవాలయానికి వచ్చే భక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించడం, భక్తుల వివరాలను సేకరించడంతో పాటు సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. శ్రీవారి కాల్యాణోత్సవమును ఫేస్‌బుక్ తదితర సామాజిక మాద్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ఏర్పాట్లపై భక్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి ప్రసంగిస్తూ తెలుగువారందిరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పంచాగ పఠనం చేసిన నాగఫణి శర్మకు, ముఖ్య అతిథిగా కార్యక్రమానికి హాజరైన బండారు దత్తాత్రేయకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన పెరుమాళ్ దేవస్థానాల కార్యవర్గాలకు, దాతలకు, భక్తలకు, వలంటీర్లకు ఉపాధ్యక్షులు పోలిశెట్టి ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2021-04-20T18:11:29+05:30 IST