ప్రజల ముఖాల గుర్తింపు పథకంపై సింగపూర్‌లో ఆందోళన

ABN , First Publish Date - 2020-10-19T00:45:56+05:30 IST

సింగపూర్ ప్రభుత్వం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రజల ముఖాల గుర్తింపు పథకాన్ని అమలు చేయబోతోంది.

ప్రజల ముఖాల గుర్తింపు పథకంపై సింగపూర్‌లో ఆందోళన

న్యూఢిల్లీ : సింగపూర్ ప్రభుత్వం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రజల ముఖాల గుర్తింపు పథకాన్ని అమలు చేయబోతోంది. వచ్చే ఏడాది నుంచి ప్రజలు బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలు, ఇతర సదుపాయాలు పొందాలంటే ఫేస్ స్కాన్ చేయించుకోవలసి ఉంటుంది. అయితే ఈ విధానం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ప్రభుత్వ వర్గాలు చెప్తున్నదాని ప్రకారం, ప్రజలు పాస్‌వర్డ్, సెక్యూరిటీ డాంగుల్  వంటివాటిని గుర్తుంచుకోవలసిన అవసరం లేకుండా ఈ బయోమెట్రిక్ చెక్ ఉపయోగపడుతుంది. 


సింగపూర్ టెక్నాలజీ ఏజెన్సీ గవ్‌టెక్ ప్రతినిథి క్వోక్ క్వెక్ సిన్ మాట్లాడుతూ, ప్రజలు, వ్యాపార సంస్థల ప్రయోజనం కోసం టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఫేషియల్ వెరిఫికేషన్ ఇప్పటికే ప్రపంచంలో అనేక చోట్ల వివిధ రూపాల్లో అమల్లో ఉందన్నారు. ఫేషియల్ వెరిఫికేషన్ కోసం సేకరించిన సమాచారాన్ని మూడో పక్షంతో పంచుకోబోమని తెలిపారు. ఇది నిఘా పెట్టడం కాదని, నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తామని చెప్పారు. 


సింగపూర్‌లోని ఓ పాత్రికేయుడు కిర్‌స్టెన్ హాన్ మాట్లాడుతూ, నిఘా, డేటా సేకరణ విషయంలో ప్రభుత్వ అధికారానికి స్పష్టమైన పరిమితులు లేవన్నారు. ఏదో ఒక రోజు ఈ సమాచారం పోలీసుల చేతుల్లోకి వెళ్లినట్లు, ప్రజలు సమ్మతి తెలియజేయని సంస్థకు చేరినట్లు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. 


Updated Date - 2020-10-19T00:45:56+05:30 IST