సింగరేణి ఉద్యోగులకు ఇళ్లు

ABN , First Publish Date - 2021-01-19T05:29:13+05:30 IST

సింగరేణి ఉద్యోగులకు ముఖ్యమంత్రి సూచనమేరకు సౌకర్యవంతమైన క్వార్టర్లను నిర్మించాలని నిర్ణయించినట్లు సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

సింగరేణి ఉద్యోగులకు ఇళ్లు
సత్తుపల్లిలో నిర్మాణం పూర్తయిన 352 ఉద్యోగుల గృహాలు

రూ.333కోట్లతో 1,478 గృహాల నిర్మాణం

ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేడమే లక్ష్యం 

సంస్థ సీఎండీ శ్రీధర్‌ ప్రకటన

సత్తుపల్లిలో తుదిదశకు 352క్వార్టర్ల పనులు

కొత్తగూడెం, జనవరి 18: సింగరేణి ఉద్యోగులకు ముఖ్యమంత్రి సూచనమేరకు సౌకర్యవంతమైన క్వార్టర్లను నిర్మించాలని నిర్ణయించినట్లు సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా తొలి దశలో రూ.333కోట్లతో 1,478 ఇళ్లను నిర్మిస్తున్నామని, వీటిలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్మిస్తున్న 352 ఇళ్లు జూన్‌ నాటికి పూర్తి కానుండగా మిగిలినవి ఈ ఏడాది చివరి వరకు పూర్తిచేసి కార్మికులకు కేటాయిస్తామని తెలిపారు. గతంలో సింగరేణి కార్మికుల క్వార్టర్లు కేవలం ఒక బెడ్‌ రూమ్‌, ఒక చిన్నహాలు, చిన్న కిచెన్‌ కలిగి ఇరుకుగా ఉండేవని, ఈ క్రమంలో సౌకర్యవంతంగా కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందన్నారు. కొత్తగా నిర్మించే క్వార్టర్లు 963 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్‌బెడ్‌ రూంతోపాటు హాలు, కిచెన్‌, కామన్‌ ఏరియాతో కలిపి నిర్మించనున్నామన్నారు. క్వార్టర్లకు మధ్య విశాలమైన రోడ్లు, డ్రెయినేజీలతో రోడ్లకు ఇరువైపుల, డివైడర్ల మధ్యలో మొక్కలను నాటనున్నారు. వీటితోపాటు పార్కులు, పిల్లలకు క్రీడా స్థలాలు కూడా కేటాయిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న 1,478 క్వార్టర్లలో ఒక్క భూపాలపల్లి ఏరియాలోనే 994 క్వార్టర్లు రూ.216కోట్లతో నిర్మిస్తున్నారు. ఇక్కడ కొత్త గనులు రానున్న నేపథ్యంలో గృహ వసతిని పెంచేందుకు వీటి నిర్మాణం చేపట్టారు. ఈ క్వార్టర్ల నిర్మాణ బాధ్యతను ఓపెన్‌ టెండరు ప్రక్రియ ద్వారా కేపీసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ వారికి అప్పగించారు. మంజూర్‌నగర్‌ సమీపంలో ఈ క్వార్టర్ల నిర్మాణం ఒకేసారిగా జరుగుతోంది. ఈ నిర్మాణం పనులను సంస్థ డైరెక్టర్లు (ఆపరేషన్స్‌ అండ్‌ పా) ఎస్‌. చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) ఎన్‌. బలరాంలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్వార్టర్లను ఈ ఏడాది డిసెంబరు నాటికీ పూర్తిచేసి కార్మికులకు కేటాయించనున్నారు.  ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉద్యోగుల కోసం రూ.80కోట్లతో నిర్మిస్తున్న 352 క్వార్టర్ల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ నిర్మాణపు పనులను బింద్రా - సిరి అనే నిర్మాణ సంస్థకు అప్పగించారు. మరో ఐదు నెలల్లో వీటి నిర్మాణం పూర్తికానుందని అధికారులు తెలియజేశారు. సత్తుపల్లిలో సింగరేణి  భారీగా ఓపెన్‌ కాస్టులను ప్రారంభించి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. వీటితో పాటు సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో సుమారు రూ.37కోట్లతో చేపట్టిన  132 క్వార్టర్ల నిర్మాణం కూడా తుది దశకు చేరుకుంది.

Updated Date - 2021-01-19T05:29:13+05:30 IST