సింగరేణిలో ఏ ఒక్కరూ కరోనాకు బలి కాకూడదు

ABN , First Publish Date - 2020-08-11T20:32:45+05:30 IST

సింగరేణిలో ఏ ఒక్కరూ కరోనాకు బలికాకూడదని సీఎండీ శ్రీధర్‌ సూచించారు. సింగరేణిలో కరోనా కట్టడి చర్యలపై సంస్థ సీఎండీ శ్రీధర్‌ సోమవారం అన్ని ఏరియాల జీఎంలు, వైద్య అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

సింగరేణిలో ఏ ఒక్కరూ కరోనాకు బలి కాకూడదు

ప్రతి ఏరియాలో రోజు 200 పరీక్షలు

కార్మికులకు మాస్క్‌లు, శానిటైజర్స్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎండీ శ్రీధర్‌


గోదావరిఖని(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో ఏ ఒక్కరూ కరోనాకు బలికాకూడదని సీఎండీ శ్రీధర్‌ సూచించారు. సింగరేణిలో కరోనా కట్టడి చర్యలపై సంస్థ సీఎండీ శ్రీధర్‌ సోమవారం అన్ని ఏరియాల జీఎంలు, వైద్య అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి ఆయన పలు సూచనలు చేశారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఏరియా ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మందులకు అదనంగా ఎంత మేరకు అవసరమైతే అన్ని మందులు తెప్పించాలని ఆదేశించారు. మందులు వైద్య సామగ్రితో ఏరియా ఆసుపత్రులన్నింటిని పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న క్వారైంటన్‌ సెంటర్లను పెంచాలని, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని క్వారైంటన్‌ సెంటర్లలో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాజిటివ్‌ వ్యక్తులను క్వారైంటన్‌ కేంద్రాలకు తరలించి పర్యవేక్షించాలని వారి కోసం మెడికల్‌ కిట్‌ అందజేయాలని పేర్కొన్నారు. 


ఆవిరి యంత్రం, థర్మామీటర్‌లతో పాటు ఎనిమిది రకాల మందులు మొత్తం 16 వస్తువులతో కూడిన వెయ్యి కిట్లు ఏరియా ఆసుపత్రి పంపించనున్నట్లు సీఎండి తెలిపారు. ప్రతి ఏరియాలో రోజు 200 పరీక్షలు జరపాలన్నారు. ప్రతి కార్మికుడికి, అధికారికి శానిటైజర్‌తో పాటు నాలుగు చొప్పున మాస్క్‌లను పంపిణీ చేయాలని సీఎండీ ఆదేశించారు. ఏరియాల వారీగా జీఎంలు గనులను తనిఖీ చేసి కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించి అనంతరం పూర్తి నివేదికను తనకు పంపించాలని ఆదేశించారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా కరోనా లక్షణాలు గుర్తిస్తే వీలైనంత త్వరగా వైద్యానికి తరలించాలని సూచించారు.


కరోనా లక్షణాలు ఉండి నిర్లక్ష్యంగా ఉండే వారిని తక్షణమే వైద్య కేంద్రాలకు తరలించి వైద్య పరీక్షలు జరపాలన్నారు. కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలను కరపత్రాలపై ముద్రించి ప్రతి కార్మికుడికి చేరవేయాలని సూచించారు. కరోనా కట్టడి విషయంలో అలసత్వంపై ఉపేక్షించేది లేదని, సింగరేణి మొత్తం కరోనా కట్టడికి కలిసి పనిచేయాలని, ఏ ఒక్క ఉద్యోగి కరోనాకు బలికాకూడదని సీఎండీ శ్రీధర్‌ పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో డైరెక్టర్‌ (పా)ఆపరేషన్‌ చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ ఫైనాన్స్‌ బలరాం, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, ఆర్‌జీ-1, 2 జీఎంలు నారాయణ, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-11T20:32:45+05:30 IST