నల్లనేలపై కాంతిపుంజాలు!

ABN , First Publish Date - 2021-01-18T09:19:23+05:30 IST

సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్‌ విద్యుదుత్పత్తిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరిస్తోంది. సింగరేణి వ్యాప్తంగా అనువైన ప్రాంతాల్లో 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు సంస్థ రూ.1,361

నల్లనేలపై కాంతిపుంజాలు!

సోలార్‌ విద్యుత్‌పై సింగరేణి దృష్టి.. 300 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం.. రూ.1,361 కోట్ల వ్యయంతో ప్లాంట్లు 

2021 చివరికి నిర్మాణాలన్నీ పూర్తి 

ఇప్పటికే కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తి షురూ

సోలార్‌ పవర్‌ హబ్‌గా ఇక ఇల్లెందు  

నీటిపై తేలియాడే ప్లా ంట్ల కోసం కసరత్తు 


కొత్తగూడెం, జనవరి 17: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్‌ విద్యుదుత్పత్తిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరిస్తోంది. సింగరేణి వ్యాప్తంగా అనువైన ప్రాంతాల్లో 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు సంస్థ రూ.1,361 కోట్లు కేటాయించింది. తొలి దశలో 129 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, ఇల్లెందు, పెద్దపల్లి జిల్లా రామగుండం-3 ఏరియాల్లో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. కొన్ని ప్రాంతాల్లో ప్లాంట్‌లను ఇప్పటికే ప్రారంభించింది. ఇక రెండో దశలో 90 మెగావాట్ల ప్లాంట్లు, మూడో దశలో 81 మెగావాట్ల ప్లాంట్లను ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ ఏడాది చివరికి ఈ ప్లాంట్లను పూర్తి చేయాలనే పట్టుదలతో సంస్థ ముందుకు సాగుతోంది. ఇల్లెందు ప్లాంట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. 39 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌లో ఇప్పటికే 15 మెగావాట్లకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఈ తరుణంలో మంగళవారం ట్రయల్‌ రన్‌ ప్రారంభించారు. ఇల్లెందు ఇక సోలార్‌ హబ్‌గా మారనుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించిన నేపఽథ్యంలో వాణిజ్య విద్యుత్తు రంగంలో సింగరేణి భవిష్యత్‌లో అద్భుతాలు చేయగలదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మానేరులో నీటిపై తేలియాడే ప్లాంట్లు 

సింగరేణి  నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంట్ల నిర్మాణంపై కూడా దృష్టి సారించింది. ఇందుకోసం ఇటీవల కరీంనగర్‌ జిల్లాలోని లోయర్‌ మానేరు డ్యామ్‌ను సింగరేణి బృందం సందర్శించింది. రాష్ట్రంలోని భారీ జలాశయాల్లో ఈ ప్లాంట్ల నిర్మాణం కోసం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మూడు భారీ జలాశయాలున్నా కరీంనగర్‌ పక్కనే ఉన్న లోయర్‌ మానేరు జలాశయం 350 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌కు ఎంతో అనుకూలంగా ఉందని సింగరేణి భావించింది. తెలంగాణ రాష్ట్ర రె న్యూవబుల్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (రెడ్‌కో) బృందం ఇదే విషయాన్ని నివేదించడంతో డీపీఆర్‌ ముసాయిదా తయారు చేయాలని సంబంధిత అధికారులను సింగరేణి యాజమాన్యం ఆదేశించింది. 


ప్లాంట్లు పూర్తయితే మరింత ఆదాయం 

రాష్ట్రంలోని అన్ని సింగరేణి ఏరియాల్లో చేపట్టిన సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం పూర్తయితే మొత్తం 85 మిలియన్‌ యూనిట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తవుతుంది. తద్వారా సంస్థ భారీగా ఆదాయం పొందే అవకాశముంది. ఇప్పటికే సింగరేణికి సోలార్‌ విద్యుత్‌ ద్వారా ఏడాదికి రూ.2.97 కోట్ల ఆదాయం సమకూరుతోంది. నిర్మాణంలో ఉన్న ప్లాంట్లు పూర్తయితే ఆదాయం మరింత పెరిగే అవకాశముంది.  

Updated Date - 2021-01-18T09:19:23+05:30 IST