సింగరేణి చర్చలు విఫలం

ABN , First Publish Date - 2021-12-07T03:53:18+05:30 IST

సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా ఆపేందుకు యాజమాన్యంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 3న సీఎండీతో చర్చలు జరగగా, సోమవారం హైద్రాబాద్‌లోని అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌తో ఏర్పాటు చేసిన సమావేశం సఫలీకృతం కాలేదు.

సింగరేణి చర్చలు విఫలం
ఏఎల్‌సీతో చర్చల్లో పాల్గొన్న కార్మిక సంఘాల నేతలు

ఏఎల్‌సీతో ముగిసిన సమావేశం

సీఎంతో సమావేశానికి యాజమాన్యం సూచన

మంచిర్యాల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా ఆపేందుకు యాజమాన్యంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 3న సీఎండీతో చర్చలు జరగగా,  సోమవారం హైద్రాబాద్‌లోని అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌తో ఏర్పాటు చేసిన సమావేశం సఫలీకృతం కాలేదు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా అడ్డుకోవాలని టీబీజీకేఎస్‌తోపాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, బీఎంఎస్‌లు గత నెల 25న సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. యాజమాన్యం స్పందించకపోతే ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు సమ్మె నిర్వహించనున్నట్లు నోటీసులో పేర్కొన్నాయి. దీంతో యాజమాన్యం, రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌ కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించాయి. సోమవారం జరిగిన చర్చల సందర్భంగా ప్రైవేటీకరణ విషయమై కంపెనీ యాజమాన్యంతోపాటు   ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కావాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈ నెల 8వ తేదీ లోపు ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించాలని తీర్మానించాయి.  ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ సెక్రరీ జనరల్‌ బి జనక్‌ప్రసాద్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బొగ్గు బ్లాకుల వేలం ఆపేలా చర్యలు చేపట్టేందుకు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇప్పించేందుకు యాజమాన్యం, అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ కృషి చేయాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ఈనెల 8న సీఎంతో చర్చలు విఫలమైతే కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.  

Updated Date - 2021-12-07T03:53:18+05:30 IST