సింగర్‌ నీతి మోహన్‌కి మగబిడ్డ!

సింగర్‌ నీతి మోహన్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘మా కుటుంబంలోకి చిచ్చరపిడుగు అడుగు పెట్టినందుకు నిహార్‌ పాండ్యా, నేను సంతోషంతో ఉన్నాం. పసివాడిన నా చేతుల్లోకి తీసుకోవడం అనేది మర్చిపోలేని అనుభూతినిచ్చింది. ఇప్పటికీ అదే ఆనందంతో పులకరించిపోతున్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో నీతి మోహన్‌ రాసుకొచ్చారు. నిహార్‌ కూడా తండ్రైనందుకు ఆనందం వ్యక్తం చేశాడు. ‘నాకు మా నాన్న నేర్పించినవన్నీ ఈ పిల్లాడికి నేర్పించే అవకాశాన్ని నా బెటర్‌ హాఫ్‌ నీతి నాకు కల్పించింది’’ అని ఆయన అన్నారు. నీతి మోహన్‌,  నిహార్‌లది ప్రేమ వివాహం. ఫిబ్రవరి 15, 2019 హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో వీరిద్దరి పెళ్లి జరిగింది. పదికి పైగా భాషల్లో నీతి పాటలు పాడారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ టీమ్‌లో ఆమె కూడా ఒకరు. తెలుగులో ‘తడాఖా’, ‘సాహో’, ‘టచ్‌ చేసి చూడు’, ‘సైజ్‌ జీరో’ సినిమాల్లో హిట్‌ సాంగ్‌లు పాడారు. 

Advertisement