తొలినాటి ముచ్చట్లు!

ABN , First Publish Date - 2020-09-27T05:30:00+05:30 IST

బాలుతో పాడించని సంగీత దర్శకుడు లేరు. ఆ గొంతులోని మాధుర్యం అలాంటిది. ఎంత ప్రతిభ ఉన్నా, తన సీనియర్ల పట్ల గౌరవం చూపించే వ్యక్తిత్వం బాలుది. సినీ సంగీత ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు తన సీనియర్ల పట్ల ఎంత గౌరవం చూపించేవారో.. 50 ఏళ్ల ప్రస్థానం తర్వాత కూడా అంతే వినమ్రంగా ఉండేవారు...

తొలినాటి ముచ్చట్లు!

బాలుతో పాడించని సంగీత దర్శకుడు లేరు. ఆ గొంతులోని మాధుర్యం అలాంటిది. ఎంత ప్రతిభ ఉన్నా, తన సీనియర్ల పట్ల గౌరవం చూపించే వ్యక్తిత్వం బాలుది.  సినీ సంగీత ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు తన సీనియర్ల పట్ల ఎంత గౌరవం చూపించేవారో.. 50 ఏళ్ల ప్రస్థానం తర్వాత కూడా అంతే వినమ్రంగా ఉండేవారు. 1970 జూలైలో ‘సినిమా రంగం’లో  ప్రచురించిన ఒక ఇంటర్వ్యూలో సంగీత దర్శకుల గురించి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాల సమాహారం ఇది. బాలు ఇచ్చిన తొలి సమగ్ర ఇంటర్వ్యూ కూడా ఇదే కావడం ఒక విశేషం.





స్వాతంత్య్రం ఇచ్చిన మహాదేవన్‌


‘‘మూగజీవులు’’ చిత్రంలో నేను పాడిన ‘‘దయలేని లోకాన’’ అన్న పద్యాన్ని మహాదేవన్‌ గారికి వినిపించారు కోదండపాణిగారు. ఆ విధంగా మహాదేవన్‌గారితో నా గాత్రానికే ముందుగా పరిచయం కలిగింది. ఆయనతో నాకు ముఖ పరిచయం లేదప్పుడు. మిత్రుడు మోహన్‌కుమార్‌ నన్ను డి.బి.ఎన్‌వారి ఆఫీసుకు వెంటబెట్టుకుపోయారు. అక్కడ మహాదేవన్‌గారు.. పుహళేంది గారి సాయంతో స్వరకల్పన చేస్తున్నారు. దర్శకులు విశ్వనాథ్‌ గారు పర్యవేక్షణ చేస్తున్నారు. మోహన్‌కుమార్‌ నన్ను అక్కడి వారికి పరిచయం చేశారు. ‘‘నీ పాట విన్నానోయ్‌.. బాగుంది. సిగ్గు పడబోకు. ఒక పాట పాడు. మనవాళ్ళు వింటారు’ అని మహాదేవన్‌గారు భుజం తట్టి ఉత్సాహ పరిచారు. అలవాటు ప్రకారం ‘‘దోస్తీ’’లో పాట పాడాను. మహాదేవన్‌గారికి, పుహళేంది గారికి రఫీ పద్ధతి చాలా ఇష్టం. వారికి నా పాట నచ్చింది. ఆయన కోరికననుసరించి ‘ముద్దబంతి పూవులో’ (మూగ మనసులు) పాట పాడాను. ఆ నాటికి ఆ అనుభవం పూర్తయింది. నాలుగు రోజుల తర్వాత ‘‘ప్రైవేట్‌ మాస్టర్‌ ’ చిత్రంలోని ‘‘పాడుకో పాడుకో’’ (ఆరుద్ర రచన) పాట పాడుకోమని పిలుపు వచ్చింది. సైకిల్‌పై డి.బి.ఎన్‌ ఆఫీసుకి వెళ్ళాను.




సైకిల్‌ మీద నన్ను చూసిన మహాదేవన్‌గారు గాయకుడికి సైకిల్‌ తొక్కడం మంచిది కాదని..మానేయమని సలహా ఇచ్చారు. నాకు ఏ విధంగా పాడితే వీలుగా ఉంటుందనిపిస్తే..ఆ పద్ధతిలో పాడమని- సన్నివేశానికి తగిన ట్టు పాడమని సంపూర్ణ స్వాతంత్య్రం ఇచ్చేవారు మహాదేవన్‌ గారు. నటనకు ప్రతిరూపాలైన మన ఎన్‌.టి.ఆర్‌, ఏఎన్నార్‌ గారలకు.. ‘‘ఏకవీర’’, ‘ఇద్దరమ్మాయిలు’’ చిత్రాలలో తొలిసారిగా పాడే అవకాశం మహాదేవన్‌గారు ఇచ్చారు. తమిళ కథానాయకులు- ప్రజాభిమాన ధనాఢ్యులు ఎమ్‌.జి.ఆర్‌ గారికి ‘అడిమై పెణ్‌’ తమిళ చిత్రం (తెలుగులో ‘కొండవీటి సింహం’)లో పాడే అవకాశం కూడా ఆయనే ఇచ్చారు. పల్లవిని సులభంగా వినిపించి.. వినగానే పాడగలిగేట్టు మలచడంలో మహదేవన్‌ గారు నేర్పరులు. ఆయన నిర్దేశకత్వంలో నేను పాడిన పాటలలో సంగీత, సాహిత్య పరంగా ‘‘ఏకవీర’లోని పాటలు.. పద్యాలు, ‘‘ఉండమ్మా బొట్టు పెడతా’’లోని ‘చుక్కలతో చెప్పాలని’ పాట నాకు ఎంతో ఇష్టం. ‘‘సంగీత మేదైనా సాధించును స్వరాల ప్రయోగం అమోఘం సుమా’’ అనే ఆరుద్ర ముద్ర నా మీద ప్రసరించి- నేను, నా గాత్రం పైకి రావడానికి మహాదేవన్‌గారి పాత్ర ప్రముఖమైనది.


గమకాల మాస్టర్‌ వేణు!


1964లో ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఊళ్ళో జరిగిన సంగీత పోటీలలో పాల్గొని రెండో బహుమతి (కారణాంతరాల వల్ల) పొందాను. బహుమతి ప్రదానం చేయడానికి మదాస్రు నుంచి సంగీత దర్శకులు మాస్టర్‌ వేణుగారు, శ్రీమతి జానకి గారు వచ్చారు. వారి ముందు బహుమానం పొందిన వారిని పాడమన్నారు. మొదటి బహుమతి సంపాదించిన వ్యక్తి, నేను పాడటం విని నాకు రెండో బహుమతి రావడం అన్యాయమని.. నేను అన్ని విధాలా మొదటి బహమతికి అర్హుడినని అన్నారు. అప్పుడే నన్ను పక్కకు పిలిచి, భుజం తట్టి ప్రోత్సాహపరిచి, మద్రాసుకు వచ్చినప్పుడు కలుసుకొమ్మన్నారు. ఆ విధంగానే ఆయనను మద్రాసులో కలిశాను. ఒకానొక పౌర్ణమి రాత్రి- వారింటి మేడ మీద నేను పాడగా, ఆయన దిల్రుబా వాయించగా గానామృత వర్షంలో ఓలలాడిన వైనం మరువలేని మధురోదంతం. నౌషాద్‌గారి పాటలు అలవరచుకొని పాడమని చెప్పేవారు. ఆయనకు  నౌషాద్‌గారికి ఉన్న అనుబంధం తెలిసిన విషయమే కదా! హార్మోనియం వాయించడంలో వారికున్న ప్రతిభ అద్వితీయం, తంత్రీ వాద్యాలలో పలికే గమకాలు వీరినోట అలవోకగా పలకడం అద్భుతం. అవి అలాగే మేము పాడలేక పోవడం మా దురదృష్టం. అందుకే ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాడిన పాటలకు నూటికి యాభై పాళ్ళు న్యాయమే చేకూర్చానని చింతిస్తుంటాను. ఆయన పాడిన ట్టు పాడగలిగేంత జ్ఞానం రావడానికి ఎంతటి కృషి, ఎంతటి ప్రతిభ అవసరమో చెప్పలేను. ‘అర్ధరాత్రి’ చిత్రంలోని ‘ఈ పిలుపు నీ కోసమే’ అన్న పాట నేను ఆయన సంగీత దర్శకత్వంలో  పాడిన తొలి పాట. కానీ, అది ఆ చిత్రంలో పూర్తిగా రాలేదు. తరువాత ‘మమత’ చిత్రంలో శ్రీమతి జానకిగారితో కలిసి పాడిన ‘మడిసి జనుమ మురిపించే సిలకరా’ అన్న జానపద గీతిక నాకు చాలా ఇష్టం.


పెండ్యాలంటే భయం..


పెండ్యాల నాగేశ్వరరావుగారి వద్ద పాడే అవకాశం నాకు చాలాకాలం వరకు కలగలేదు. ఆయన సంగీత దర్శకత్వంలో పాడడం అదృష్టం. కానీ, ఆయన వద్ద పాడడానికి కాస్త భయం ఉండేది. కారణం- ఆయన తాను కోరుకున్న విధంగా పాట రూపొందేందుకు చాలా శ్రమ తీసుకొని, గాయకుల సామర్థ్యాన్ని, సంపూర్ణంగా ఉపయోగించుకొని, సంగీత దర్శకత్వం నిర్వహించడమే. చెప్పింది విని చెప్పినట్టు పాడడం నాకు కాస్త కష్టమని చెప్పాను కదా! అందుచేత నేను భయపడ్డాను. పెండ్యాలగారు ‘‘జయభేరి, జయదేకవీరుని కథ’ వంటి  చిత్రాలలో వినిపించిన సంగీతం ఎంత అపూర్వమైనదో, పాడేందుకు అంత కష్టమైనది కూడా. అంతటి వ్యక్తి వద్ద నాకున్న ఈ అల్ప జ్ఞానంతో పాడలేమోనని భయపడ్డాను.


చివరికి ఎస్‌.పి.వి. ఫిలిమ్స్‌ వారి పౌరాణిక చిత్రంలో మన్మథుడికి పాడే అవకాశం నాకు లభించింది.  మన్మథుని గాత్రంలో ఉండవలసిన లాలన, ప్రేమ, తపన నా గాత్రంలో పలికించవలసిన పద్ధతులను వివరిస్తూ- ‘లోకాల మోహాల తేలించు నేను నీ కడగంటి చూపులో కరగిపోయేను’ అన్న ఆ పద్యాన్ని రాగేశ్వరి రాగంలో మలచి వినిపించారు పెండ్యాలగారు. ఆయన చెప్పిన విధంగా పాడడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా, నా పద్ధతిలో ఏదో తేడా ప్రతిసారీ కనబడేది. చివరికి శ్రద్దగా పాడేందుకు ప్రయత్నించి, పాడి, ఆయన అంగీకారం పొందడం జరిగింది. ‘బాగా వచ్చింది, బాబూ’ అని ఆయన అనగానే కొండెక్కినంత సంబరం కలిగింది.   


అశ్వత్థామ పరిచయం చిరస్మరణీయం


అశ్వత్థామ గారి వద్ద పాడేందుకు వెళ్ళేంత మటుకు నాకు, ఆయన తెలీదు. భవాని ఫిలిమ్స్‌ వారి ‘మాయని మమత’లో ఒక చిన్న పద్యమే నేను ఆయన సంగీత నిర్దేశకత్వంలో పాడిన తొలి పద్యం. అందరు సంగీత దర్శకుల వలె హార్మోనియం మీద పాట వరసను గాయకులకు వినిపించి, గాయలకులతో పాట పాట తాలూకు సంగీతం పాడించుకోరు. మామూలుగా గాయకులతో మాట్లాడుతూనే ఐదు నిమిషాల్లో పాట రాగం పట్టుబడేట్టు చేస్తారు. కారులో రికార్డింగ్‌ స్టూడియోకు వెళ్ళే దారిలోనే నేపథ్య సంగీతంతో సహా పాటను వినిపించి, స్టూడియో చేరగానే టేక్‌ తీసేంతటి దిట్ట ఆయన. నాతో పరిచయం ఈషణ్మాత్రమే అయినా నా గురించి ప్రోత్సాహపూర్వకంగా నా పరోక్షంలో పదుగురితో ముచ్చటించే ఆయన గొప్పతనానికి నేను రుణపడి ఉన్నాను. మొదట ఆ పద్యం పాడేందుకు అశ్వత్థామ గారు నన్ను పిలిపించిన రోజు (రికార్డింగ్‌ రోజు) నా గాత్రం అసలు బాగా లేదు. నా గాత్రం సరిగా లేదనిపిస్తే, అసలు పాడలేను నేను. నాడు అశ్వత్థామగారిచ్చిన ప్రోత్సాహం ఎంతటిదని చెప్పాలంటే కష్టం. నా గాత్రం బాగానే ఉందన్న భావం నాలో కలిగించి, నాతో చక్కగా పాడించుకొన్న ఆయన ప్రతిభ చాలా గొప్పది. ఆయనతో నా పరిచయం కొద్దిదైనా చిరస్మరణీయం, రమణీయం.


తేనె ఊటల పాటల టి.వి. రాజు


రాజుగారు గాన జగతికి రాజుగారు. ఆ కాలంలో తమిళ చిత్రాల నేలిన కీ.శే. త్యాగరాజభాగవతార్‌ అంతటి వారినే తమ బాణీల ద్వారా లోబరుచుకొన్న మహామనీషి. దాదాపు 1963 నుంచి అనుకుంటాను. పాండీ బజారులో ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా పలకరించి, తప్పక అవకాశమిస్తానని ప్రోత్సహించేవారు. మొదటిసారిగా వారు నాతో పాడించిన పాట ‘నిండు హృదయాలు’ చిత్రంలో-  పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్‌.ఆర్‌.ఈశ్వరి, జమునారాణిగార్లతో కలిసి ‘మెత్త మెత్తని వయసు..’. ఆ తరువాత ‘బందిపోటు భీమన్న’, ‘కర్పూర హారతి’ చిత్రాల్లో మరపురాని పాటలు పడే అవకాశం ఇచ్చారు. రాజు గారి పాట తేనె ఊట. ఆయన బాణీలు కర్ణాటక-హిందూస్థానీ సంగీతాలలోను, అప్పుడప్పుడు మన సంగీత సంప్రదాయాన్ని పాశ్చాత్య సంప్రదాయాన్ని చక్కగా మేళవించి వినిపించే నవీన సంగీతంలోనూ రూపొంది రసిక జనులకు ఆనందం చేకూరుస్తాయి. గీతార్థాన్ని సంగీతార్థంతో వివరించి వినిపించి, పాడించేయగల గరిమ రాజుగారిలోని మహత్తు. ఎన్‌.టి.ఆర్‌ ఎస్టేట్స్‌ వారి ‘కోడలు కాపురం’ చిత్రంలో.. శ్రీకాంత్‌ వారి తాజా చిత్రంలో నందమూరి తారక రామారావు గారికి పాడే అవకాశాలు నాకు రాజుగారే ఇచ్చారు. 


పాటల వాణి.. కోదండ పాణి


‘‘నాకు మొదటి నుంచి ఒక బలహీనత ఉన్నది. ఏ పాట విన్నా, విన్నది విన్నట్టుగా పాడక.. కొద్దిగా మార్చి.. స్వంత సంగతులు, గమకాలు వేసి నా పద్ధతిలో పాడుకునే అలవాటే ఆ బలహీనత. ఆ బలహీనత ఈ పాట (దోస్తి లోనిది)లో కనబడింది. అది కోదండపాణికి నచ్చింది. ఆయన సంగీత దర్శకత్వంలో పాడడం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను చక్కగా పాడాలన్న కోరిక ఆయనకు చాలా ఎక్కువ. ఎప్పుడైనా నేను పాడే పద్ధతి నచ్చకపోతే మెత్తగా, గట్టిగా చీవాట్లు పెడతారు ఆయన. నేను ఎప్పుడైనా కారులో వేగంగా వెళ్ళడం చూశారంటే ‘‘ఏమిటా జోరు? నిదానంగా పోరాదా?’’అని ప్రశ్నించి మందలిస్తుంటారు. చాలామంది నేను, ఆయన బంధువులు (నేను ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం, ఆయన ఎస్‌.పి. కోదండపాణి గనుక.) అనుకుంటారు. మా ఇనిషియల్స్‌ చూసి. నాకు ఆయన బంధువు కారు. అంతకన్నా అధికులు, దైవ సమానులు. ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాడిన ఎన్నో పాటలలో నాకు నచ్చిన పాట ఆస్తులు- అంతస్థులులోనిది. శ్రీమతి సుశీలతో నేను పాడిన- ‘‘ఒకటై పోదామా’’ అనే ఆ పాట నా మనసుకు ఎంతో హత్తుకుంది. కోదండపాణిగారు సంగీతపరంగా.. మానసికంగా నాకు గురువు.


రసాలూరు రాజేశ్వరావు


సంగీత రావేశ్వరులు రాజేశ్వర రావుగారిని 1962లో గూడూరులో శ్రీ కాళిదాస కళానికేతన్‌ వారు నిర్వహించిన సంగీత పోటీల బహుమతి ప్రదాతగా కలిశాను. ఆ పోటీలలో నాకు మొదటి బహుమతి లభించింది. అప్పుడు నా ఆటోగ్రాఫ్‌ పుస్తకంలో ‘‘మీరు అనతికాలంలోనే గొప్ప నేపథ్య గాయకులవుతారు’’ అని రాశారాయన. ఆయన సంగీత దర్శకత్వంలో మొట్టమొదట నేను పాడినది ‘‘వీరాంజనేయ’’లో ‘హనుమా.. పావన రుద్ర తేజమున’’ అని బ్రహ్మ పాడే పద్యం. పద్యాన్ని కానడ రాగంలో స్వరకల్పితం చేశారు. ఆయన సన్నివేశాన్ని వివరించి, ‘‘బ్రహ్మకు పాడుతున్నారు. కాస్త గంభీరంగా, హుందాగా’’ పాడమని హెచ్చరించారు తమాషాగా. ఆయన కోరిన పద్ధతిలో పాడేందుకని నాతో పలుసార్లు పాడించారు. తన సహాయకులు రాజగోపాల్‌ గారిని నాతోసరిగ్గా పాడించేందుకు నియమించి రికార్డ్‌ చేయించారు. సంగీతానికి, సాహిత్యానికి న్యాయం చేస్తూ, సన్నివేశ బలానికి తగిన నటనను గాత్రంలో ప్రస్ఫుటంగా ప్రకటించగల్గడమే నేపథ్యగాయకుల కర్తవ్యమని ఆయన భావిస్తారు. ఆయన పాటలు తేనెల ఊటలుగా ప్రజల హృదయాలలో చోటు సంపాదించడానికి ఆ భావనే ప్రముఖ కారణం. ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాడిన పాటలలో నాకు నచ్చిన పాట ‘‘ఆత్మీయులు’’ చిత్రంలోని ‘‘చిలిపి నవ్వుల నిను చూడగానే’’. అపూర్వ సంగీతవేత్త అయిన ఆయన సహచర్యం లభించడానికి నా పూర్వజన్మ సుకృతమే హేతువు.


తృప్తి చెందని సత్యం మాస్టారు!


‘పాలమనసులు’ చిత్రంలోని ‘ఆపలేని తాపమాయె’ అన్న డా. నారాయణరెడ్డి గారి గీతికను గాయని కుమారి ఎల్‌.ఆర్‌. ఈశ్వరితో పాడేందుకు సత్యం గారి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది. అదే ఆయన సంగీత దర్శకత్వంలోనే పాడిన తొలి పాట. ఆ రోజున ఆలపించిన పద్ధతి ఆలకించి.. అలాగే ఆలపించినా.. ఆయన తృప్తి పడలేదు. ఆయన పాడిన విధంగానే పాడినా ఆయనకు నచ్చలేదు. చివరికి ఆయన చిరాకుతో నాతో పాడించవద్దనుకునేంత మటుకు వచ్చింది వ్యవహారం. పక్కన ఎల్‌.ఆర్‌.ఈశ్వరి గారున్నారు. నా కళ్ళలో నీళ్ళు తిరిగేంత దూరం వచ్చేసింది పరిస్థితి. దుఃఖం దిగమింగి, పాట పాడి ‘ఓకే’ అనిపించుకున్నాను. ఇంతకీ ఆ పాట ఆ చిత్రంలో లేకపోయింది. ఆ తరువాత నుంచి ఆయన సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటిలోనూ నేను పాడుతున్నాను. ఆయన అభిమానించే గాయకులలో నేను కూడా చేరిపోయానని చెప్పుకుంటే అది సత్య దూరమూ కాదు; స్వోత్కర్ష అంతకన్నా కాదు. ‘టక్కరి దొంగ చక్కని చుక్క’ చిత్రంలోని ‘నడకను చూస్తే’ అన్న పాటలో ‘ఒక కంట మంటలను’ అన్న చోట నా గాత్రం కాస్త బొంగురుగా వినిపిస్తుంది. అది వినబడకుండా పాడించిన టేక్‌ను విస్మరించి, ఎవరో ఆ టేక్‌ను ఓకే చేసేశారు. అది తలచుకొని ఆయన, నేను ఇప్పటికీ బాధ పడుతుంటాం. ‘రాజయోగం, ప్రతీకారం, రాజసింహ’ మొదలైన చిత్రాలలోనూ, అనేక కన్నడ చిత్రాలలోనూ చాలా మంచి పాటలు నాతో పాడించారు సత్యం గారు. ఆయన సంగీత నిర్దేశకత్వంలో నే పాడిన పాటలలో నా అభిమానపాత్రమైనది ‘వారసత్వం’లోని ‘నారీ రసమాధురీ’ అన్న పాట. ‘మట్టిలో మాణిక్యం’, ‘బంగారు కుటుంబం’ మొదలైన చిత్రాలలో నేను పాడిన పాటలు బాగున్నవని నేను భావిస్తాను.


కొత్త ప్రయోగాల ప్రయోక్త


తాతినేని చలపతిరావు గారు అచిరకాలంలోనే ప్రజాభిమానాన్ని సంపాదించుకొన్న సంగీత దర్శకులు. చలపతి రావుగారి వద్ద పాడే మొదటి అవకాశం ‘చిరంజీవి’ చిత్రం ద్వారా లభించింది. నా మిత్రుడు గోపి రాసిన ‘జీవితమెంతో’ అన్న ఆ పాట సంగీత పరంగా- సాహిత్య పరంగా నాకు నచ్చిన పాట. చలపతిరావుగారు చక్కని అభిరుచి, సంగీతంలో ఎనలేని ఆసక్తి కల వ్యక్తి. ఆయన సంగీత దర్శకత్వంలో వెలువడిన ‘పునర్జన్మ, నవరాత్రి, బంగారు గాజులు’ చిత్రాలలోని సంగీతం నాకు చాలా ఇష్టం. కొత్త ప్రయోగాల ప్రయోక్తగా ఆయన్ను నేను అభిమానిస్తాను.  చలపతిరావు గారు పాడడానికి సులభమైన రీతిలో స్వరకల్పన చేస్తూ, ప్రజలను ఆకట్టుకోగల దిట్ట. ఆయన సంగీత దర్శకత్వంలో పాడేందుకు నాకు మరిన్ని అవకాశాలు రావాలనే కోరిక తీరుతుందని భావిస్తాను.


అపూర్వ మేధావి ఆదినారాయణ రావు


1963లో గూడూరు కాళిదాస కళానికేతన్‌ వారు నిర్వహించిన సంగీత పోటీలలో నాకు లభించిన మొదటి బహుమతిని  ఆదినారాయణరావుగారి బంగారు చేతుల నుంచి పొందే మహదవకాశం నాకు కలిగింది. అటు హిందీ చిత్ర రంగాన్ని, ఇటు మద్రాసు చిత్రరంగాన్ని ఉర్రూతలూగించిన సంగీతస్రష్టగా ఆయన్ని తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మృదుమధుర రాగమాలికల స్రష్టగా వినుతికెక్కిన ఆయన వద్ద పాడాలన్న నా కోరిక తీరేందుకు చాలా కాలం పట్టింది. ఆయన దగ్గర పాడేందుకు భయం కూడా కలిగింది. ఆ తొలి అవకాశం వారి సంస్థ నుంచి రావడం ఆనందదాయకం. ‘అమ్మకోసం’లోని ‘గువ్వలా ఎగిరి పోవాలి’ అన్న పాటే ఆయన వద్ద నేను పాడిన మొదటి పాట. మొదటి రోజు వాద్యబృందం సరిగా లేదని ట్రాక్‌ మాత్రం తీసి, మరుసటి రోజు నా గాత్రాన్ని ప్రత్యేకంగా మిక్స్‌ చేయించారు. ఆయన ప్రయోగించే లయ ప్రత్యేక శోభ కలది. ఆ లయే ఆయనకు ఉత్తర, దక్షణ భారత దేశాలలో సంగీత కళానిధిగా కీర్తిని సంపాదించి పెట్టింది. ఆయన వద్ద నేను పాడిన తొలిపాటే ప్రజానురాగం పొంది హిట్‌ కావడం ఆనందదాయకం. అంతటి వారి వద్ద పాడేందుకు అవకాశం వచ్చి, అందు మూలంగా నాకు ప్రఖ్యాతి రావడం అదృష్టం. ఇంతటి అపూర్వ మేధావి తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. 


బాలు మళ్లీ పుట్టాలి..


కరోనా... ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదు. మనందరికీ కావలసిన వ్యక్తి ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం... వెంటాడి వెంటాడి ఆయన్ను తీసుకెళ్లిపోయింది. ఇకమీదటా ఆయన పాటలు వినిపిస్తాయి. అయినా కూడా బాలూ లేని లోటు ఉంటుంది. 


బాలు మరణం నాకు చాలా పెద్ద దెబ్బ. బాలు తొలి పాటలో నేను పాడాను. ఆయనతో కలసి విదేశాల్లో మ్యూజికల్‌ ప్రోగ్రామ్స్‌ చేశాను. ఇద్దరం 55 ఏళ్లు కలసి పాడాం. అలాంటి ది బాలు ఇకలేడనే ఒక్కమాటతో అడ్జెస్ట్‌ అవ్వలేకలేకపోతున్నాను. ఆ జ్ఞాపకాలు మర్చిపోవాలంటే చాలా కష్టం. ఇంత అన్యాయం అయిపోతుందనుకోలేదు. టీవీ కార్యక్రమాల ద్వారా గొప్ప సింగర్స్‌ను తయారుచేశారు. ఇవ్వాళ అందరూ ఆయనను తలచుకొని దుఃఖిస్తున్నారు. 


ఆయన లేరనే విషయం అప్పుడప్పుడు తలచుకొని బాధపడడం తప్పదు. ఘంటసాలను మరిపింపజేశారు బాలూ. మళ్లీ ఇలాంటి బాలూ పుట్టి మనందరినీ చూసుకోవాలి. మీరందరూ ధైర్యంగా ఉండండి. చల్లగా ఉండాలని ఆ బాలూను కోరుకుందాం. బాలు దేవుడిగా అయిపోతున్నాడు మనకు. బాలుగారే మనకు బలం ఇవ్వాలి.


- పి.సుశీల



చివరి చూపు చూడలేకపోయా


‘‘నేను కలిసి పనిచేసిన గాయకుల్లో బాలు నాకు సొంత సోదరుడు లాంటివాడు. నన్నెంతో ఆప్యాయంగా ‘అన్నయ్య’ అని పిలిచేవాడు. గత జన్మలో మేమిద్దరం సోదరులం అనుకుంటా? అందుకే బాలు నన్ను ఎంతగానో ఇష్టపడతాడు. తను సంప్రదాయ రీతిలో సంగీతం నేర్చుకోనప్పటికీ, సంగీతం పట్ల అతనికున్న పరిజ్ఞానం అపారం. ‘శంకరాభరణం’లో తన గానం విని ఆశ్చర్యపోయా. బాలు అందరినీ ఇష్టపడతాడు. ఎవరి మనసునూ నొప్పించడు. సంగీత విభావరి కోసం విదేశాలకు వెళ్లినప్పుడు తానే స్వయంగా ఆహారపదార్థాలు తయారు చేసేవాడు. నేను అమెరికాలో ఉండడం వల్ల ఇండియా రావడానికి అనుమతి దొరకలేదు. తమ్ముడు లాంటి బాలుని చివరిచూపు చూడలేకపోయినందుకు చాలా బాధగా ఉంది’’ 


- కె.జె.ఏసుదాసు



సేకరణ, సమర్పణ: 

తిరుపతి పి.ఎస్‌. గోపాలకృష్ణ, బిఎస్‌.సి

(రచయిత ఆల్‌ ఇండియా రేడియోలో స్టేషన్‌ డైరక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం బాలసుబ్రమణ్యం జీవితకథ రచన చేస్తున్నారు)

Updated Date - 2020-09-27T05:30:00+05:30 IST