వెంటిలేటర్‌పై ఎస్పీ బాలు

ABN , First Publish Date - 2020-08-15T07:37:59+05:30 IST

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కరోనా పాజిటివ్‌ రావడంతో గత పదిరోజులుగా ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు...

వెంటిలేటర్‌పై ఎస్పీ బాలు

  • ఆందోళనకరమని చెన్నై ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రి ప్రకటన 
  • ఐసీయూకు తరలింపు.. నిపుణుల బృందం పర్యవేక్షణ
  • నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది: చరణ్‌ 
  • బాలు వేగంగా కోలుకోవాలంటూ ప్రముఖుల ట్వీట్లు
  • త్వరగా లేచిరా బాలు.. ఇళయరాజా వీడియో సందేశం
  • మన లెజెండ్‌ కోసం ప్రార్థించండి: ఏఆర్‌ రెహమాన్‌ 
  • ప్రియతమ సోదరుడు కోలుకోవాలంటూ చిరంజీవి ట్వీట్‌ 
  • కరోనాను జయించి క్షేమంగా బయటపడాలి: చంద్రబాబు


చెన్నై, హైదరాబాద్‌, అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కరోనా పాజిటివ్‌ రావడంతో గత పదిరోజులుగా ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి ఆయన ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రి మెడికల్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధా భాస్కరన్‌ ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. వైద్యనిపుణుల సలహా మేరకు బాలసుబ్రహ్మణ్యాన్ని ఐసీయూకి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితిని వైద్యనిపుణులతో కూడిన ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని తెలిపారు. బాలును ఐసీయూలో వెంటిలేటర్‌ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారని ఆయన కుమారుడు చరణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ నెల 5వ తేదీన జలుబు, దగ్గు, జ్వరంతో అస్వస్థతకు గురైన బాలసుబ్రహ్మణ్యం, ఎంజీఎం ఆస్పత్రికి వెళ్ళి వైద్యపరీక్షలు చేయించుకున్నారు.


పరీక్షల్లో ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ వివరాలను స్వయంగా బాలునే ఆస్పత్రి నుంచి వీడియో ద్వారా అభిమానులకు వెల్లడించారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్న వార్తలు వస్తుండటంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎస్పీబీ వేగంగా కోలుకోవాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన కుమారుడు చరణ్‌ ట్వీట్‌ చేశారు. ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారని,. పరిస్థితి నిలకడగా ఉందని..  నాన్న ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని అభిమానులను కోరారు.  అభిమానుల ప్రార్థనలు ఫలిస్తాయని.. భగవంతుడి ఆశీస్సులతో క్షేమంగా తిరిగివస్తారని బాలూ సోదరి వసంత పేర్కొన్నారు.


సంపూర్ణ ఆరోగ్యంతో వస్తావు: ఇళయరాజా

సినీలోకం నుంచి పలువురు ప్రముఖులు, ఎస్పీబీ త్వరగా కోలుకోవాలంటూ ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. బాలు వేగంగా స్వస్థత పొందాలని కాంక్షిస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రత్యేకంగా వీడియోను పోస్ట్‌ చేశారు. ‘త్వరగా లేచిరా బాలు. నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో తప్పకుండా వస్తావు. ఆ నమ్మకం నాకు ఉంది’ అని వీడియోలో ఇళయరాజా పేర్కొన్నారు. ‘ప్రియతమ సోదరుడైన బాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని సినీనటుడు చిరంజీవి ట్వీట్‌ చేశారు. ‘ఎస్పీబీ బలమైన, ఆశావాద దృక్పథం కలవారు. ప్రస్తుత స్థితి నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని నేపథ్యగాయిని చిత్ర ట్వీట్‌ చేశారు. ‘సంగీత అభిమానులందరికీ ఇదే నా విన్నపం. మన లెజెండ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’ అని ఏఆర్‌ రెహమాన్‌ పేర్కొన్నారు. నటులు ధనుష్‌, విక్రమ్‌, ప్రభు, ఖుష్బూ, రాధిక, కీర్తి సురేశ్‌, సౌందర్య (రజనీకాంత్‌ కూతురు), సంగీత దర్శకులు అనిరుధ్‌,  దేవీశ్రీ ప్రసాద్‌, హారిస్‌ జయరాజ్‌, తమన్‌, సినీ దర్శకులు భారతీరాజా, శ్రీనువైట్ల, గీతరచయిత రామజోగయ్య శాస్త్రి, క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షా భోగ్లే..ఎస్పీబీ కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. కరోనాను జయించి ఆయన క్షేమంగా బయటపడాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-15T07:37:59+05:30 IST