సింగిల్‌ చార్జింగ్‌తో వారం లైఫ్‌!

ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST

సాధారణంగా అందరూ పొద్దున్న లేవగానే మొదట బ్రష్‌ చేసుకుంటారు. అయితే మొబైల్‌ వాడకం పెరిగాక బ్రెషింగ్‌కు ముందు మరో పని చేరింది.. ..

సింగిల్‌ చార్జింగ్‌తో వారం లైఫ్‌!

సాధారణంగా అందరూ పొద్దున్న లేవగానే మొదట బ్రష్‌ చేసుకుంటారు. అయితే మొబైల్‌ వాడకం పెరిగాక బ్రెషింగ్‌కు ముందు మరో పని చేరింది  అదే సెల్‌ తీసుకుని చార్జింగ్‌ పెట్టుకోవడం. పొరపాటున మర్చిపోయామా... రోజంతా బ్యాటరీ డౌన్‌ ఇబ్బందులే. 


ఒక సెల్‌ఫోన్‌ లేదంటే ల్యాప్‌టాప్‌ను విపరీతంగా ఉపయోగించే వ్యక్తులు రోజులో రెండు మూడుసార్లు చార్జింగ్‌ చేసుకుంటూ ఉంటారు. ఒకవైపు చార్జింగ్‌ జరుగుతూ ఉంటే, ఫోన్‌ మాట్లాడటం లేదంటే మరోలా ఉపయోగించడం ప్రమాదకరం అన్నది ప్రాథమిక సూత్రం. అయితే ఇటీవలి కాలంలో ఒకవైపు చార్జింగ్‌ జరుగుతూ ఉండగానే మరోవైపు మన పని చేసుకునే వెసులుబాటు కల్పించే కొత్త ప్రొడక్టులు మార్కెట్లోకి వస్తున్నాయి. వాచీల విషయానికి వస్తే ఒకసారి ఫుల్‌ చార్జింగ్‌ చేసుకుంటే వారానికి లేదంటే పదిహేను రోజులకు సరిపోయే విధంగా ఉత్పత్తులు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చేశాయి. 


ఈ నేపథ్యంలో టెక్‌ జైయింట్స్‌ ఐబీఎం, శాంసంగ్‌ సంయుక్తంగా సెమికండక్టర్‌ డిజైన్‌లో పురోగతిని సాధించామని ప్రకటించాయి. ఫలితంగా సెల్‌ ఫోన్‌ బ్యాటరీలు ఒకసారి చార్జింగ్‌ చేస్తే వారం రోజులు వరకు వస్తుందని కూడా తెలిపాయి. వెర్టికల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫీల్డ్‌ ఎఫెక్ట్‌ ట్రాన్సిస్టర్స్‌, సూక్ష్మంగా వీటీఎఫ్‌ఈటీగా ఈ నూతన డిజైన్‌కు నామకరణం చేశారు. నిజానికి ఇదో కొత్త తరహా ట్రాన్సిస్టర్‌. సాధారణంగా సెమికండక్టర్‌పై సమాంతరంగా పడుకునేలా ట్రాన్సిస్టర్లను రూపొందిస్తారు. అయితే కొత్త డిజైన్‌ ప్రకారంఫిన్‌ ఫీల్డ్‌- ఎఫెక్ట్‌ ట్రాన్సిస్టర్‌గా కంప్యూటర్‌ చిప్‌లోకి ప్యాక్‌ చేశారు. ఇందులో కరెంట్‌ నిలువుగా(వెర్టికల్‌)గా వెళుతుంది. అలా వీటీఎఫ్‌ఈటీ నిర్దేశిస్తుంది. దాంతో పర్ఫార్మెన్స్‌ రెండింతలు అవుతుంది. మరోలా చెప్పుకోవాలంటే ఎనర్జీ వినియోగం 85 శాతం మేర తగ్గుతుంది. ఈ డిజైన్‌ లేదంటే సాంకేతికతతో చార్జింగ్‌ ఎక్కువ రోజులు ఉండేందుకు ఉపయోగపడుతుందని ఐబీఎం విశదీకరించింది. తరవాతి తరం ట్రాన్సిస్టర్ల దిశగా సాధించిన పురోగతిగా కూడా ఐబీఎం దీన్ని అభివర్ణించింది.  అయితే అధికారికంగా సదరు చిప్‌ తయారీ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందన్నది మాత్రం తెలియజేయలేదు.


షావోమీ సైతం...

షావోమీ కూడా బ్యాటరీ లైఫ్‌కి సంబంధించి సరికొత్త ఇంప్రూవ్‌మెంట్‌ను ప్రకటించింది. బ్యాటరీ బ్యాకప్‌ వంద నిమిషాలకు పెంచుతోంది.  సదరు సదుపాయం ప్రస్తుత ఏడాదే స్మార్ట్‌ ఫోన్లకు అందబాటులోకి రానుంది. బ్యాటరీ లోపల ఉండే సిలికాన్‌ను మూడు రెట్లు పెంచడం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుతోంది. ఈ కొత్త సాంకేతికత ప్రకారం ఎంఎహెచ్‌ పది శాతం మేర పెరుగుతుంది. సింగిల్‌ చార్జింగ్‌తో ఇదే వంద నిమిషాల అదనపు రన్‌టైమ్‌కు తోడ్పడుతుంది. ఎంఎహెచ్‌ అంటే మిలియం పర్‌ అవర్‌. లెక్కలపరంగా చూసుకున్నప్పుడు ఒక బ్యాటరీ 100 ఎంఎహెచ్‌ అంటే దాని ఆపరేటింగ్‌ సమయం ఇరవై గంటలు.  ఒక గంట సమయంలో ఎంత యాంపియర్స్‌ కరెంట్‌ను బ్యాటరీ డెలివర్‌ చేస్తుందని తెలుసుకోవడంగానూ చెప్పుకోవచ్చు. అలాగే ప్యాకేజింగ్‌ టెక్నాలజీలోనూ మార్పు చేసింది. పీసీఎం అంటే ప్రొటెక్షన్‌ సర్క్యూట్‌ మాడ్యూల్‌ కింద ప్లాట్‌గా ఉండటానికి బదులు 90 డిగ్రీలకు వంగుతుంది. పొజిషన్‌లో మార్పుతో స్పేస్‌ ఆదా కానుంది. ఇందుకోసం అడ్వాన్స్‌డ్‌ అల్గోరిథమ్‌పై ఆధారపడే ఫ్యూయల్‌ గాజ్‌ చిప్‌ను ఉంచుతోంది. అదే నేరుగా సెల్‌ జీవితకాలం అలాగే భద్రతను మెరుగుపరుస్తుంది.

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST