సింగిల్‌ డోస్‌.. చుక్కల మందు కావాలి

ABN , First Publish Date - 2021-01-18T09:33:40+05:30 IST

కొవిడ్‌ టీకా అన్ని దేశాలకు అందుబాటులోకి రాకపోవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయెసుస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బాగా ఆదాయాలున్న 47 దేశాలకే టీకా

సింగిల్‌ డోస్‌.. చుక్కల మందు కావాలి

శీతల గిడ్డంగుల్లో నిల్వ చేయాల్సిన అవసరం రావద్దు

డబ్ల్యూహెచ్‌వో సదస్సులో శాస్త్రవేత్తలు


హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ టీకా అన్ని దేశాలకు అందుబాటులోకి రాకపోవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయెసుస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బాగా ఆదాయాలున్న 47 దేశాలకే టీకా అందుబాటులోకి వచ్చిందని, అక్కడ ఇప్పటివరకు మూడు కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశారని ఆయన వెల్లడించారు. 130 దేశాలకు చెందిన 2,800 మంది శాస్త్రవేత్తలతో వర్చువల్‌ మోడ్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యాక్సిన్‌ భద్రత, సమర్ధత, లభ్యతలపై ప్రధాన చర్చ జరిగింది. కరోనా కొత్త స్ట్రెయిన్లపై ప్రస్తుతం ఏ వ్యాక్సిన్లు, ఎంతమేరకు ప్రభావం చూపుతున్నాయనే దానిపైనా చర్చించారు.


రానున్న రోజుల్లో గర్భిణులు, బాలింతలు, 18 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సినేషన్‌ చేయాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా టీకాలను అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలకు టెడ్రోస్‌ పిలుపునిచ్చారు. సింగిల్‌ డోసులో, చుక్కల రూపంలో అందించేందుకు వీలుగా కరోనా టీకాలు ఉండాలని పలువురు శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేయాల్సిన అవసరం లేని విధంగా వ్యాక్సిన్లు ఉంటే.. పేద దేశాల్లో పంపిణీ సులభతరంగా జరుగుతుందన్నారు. అత్యవసర వినియోగ అనుమతులు పొందిన వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రయోగ పరీక్షలు, భద్రత, ప్రభావశీలతలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచదేశాలతో పంచుకునే వేదికగా నిలిచేందుకు డబ్ల్యూహెచ్‌వో అంగీకరించిందని ఆ సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ వెల్లడించారు.  

Updated Date - 2021-01-18T09:33:40+05:30 IST