ఒంటరి మహిళలకు నేనున్నానంటూ..

ABN , First Publish Date - 2020-12-24T05:49:00+05:30 IST

‘‘బాల్య వివాహం, గృహ హింస... వీటి వల్ల నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అలాంటి కష్టాలు మరే మహిళా పడకూడదని నాకు చేతనైన పని చేస్తున్నాను’’ అని చెబుతారు లక్ష్మీ వాఘ్మరే.

ఒంటరి మహిళలకు నేనున్నానంటూ..

ఎనిమిదేళ్ళకే పెళ్ళి... ఎన్నో ఏళ్ళు భర్త చేతిలో చిత్రహింసలు...

మహారాష్ట్రకు చెందిన లక్ష్మీ వాఘ్మరే ఇలాంటి ఎన్నో కష్టాలను తట్టుకున్నారు. 

తనలాంటి కష్టం మరొక మహిళకు రాకూడదని అనుకున్నారు. తన చొరవతో

17 వేల మంది మహిళలు గృహ హింస, పేదరికం నుంచి బయటపడడానికి 

దోహదపడిన ఈ దళిత మహిళ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


‘‘బాల్య వివాహం, గృహ హింస... వీటి వల్ల నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అలాంటి కష్టాలు మరే మహిళా పడకూడదని  నాకు చేతనైన పని చేస్తున్నాను’’ అని చెబుతారు లక్ష్మీ వాఘ్మరే. ముప్ఫై తొమ్మిదేళ్ళ లక్ష్మిది మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలోని తుల్జాపూర్‌ దగ్గరలోని ఒక గ్రామానికి చెందిన దళిత కుటుంబం. ఆమె తల్లిదండ్రులు తోళ్ళ పరిశ్రమలో పని చేస్తూ ఉండేవారు. పేదరికం కారణంగా రెండు పూటలా తినడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది. లక్ష్మి, ఆమె అక్కలూ ఇంటి పనులు చేస్తూ బడికి వెళ్తూ ఉండేవారు. ఆడపిల్లలకు పెళ్ళి చేసే స్థోమత ఆమె కన్నవాళ్లకు లేదు. దాంతో ఎనిమిదేళ్ళ వయసులోనే ఆమె కన్నా పదమూడేళ్లు పెద్దవాడైన మేనమామతో వివాహం చేశారు.  


పిల్లలతో ఇంట్లోంచీ బయటికొచ్చాను...

‘‘నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు రజస్వల కావడంతో నన్ను బడి మాన్పించి, అత్తవారింటికి పంపేశారు. కానీ నాకు చదువుకోవాలని ఉండేది. నన్ను చదివించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాను. చాలాసార్లు తిండి తినడం మానేశాను. ఏడాది గడిచాక నేను మళ్ళీ చదవడానికి నా భర్త అంగీకరించాడు. అలా పన్నెండో తరగతి వరకూ చదివాను. ఈలోగా గర్భవతిని కావడంతో నా చదువు మూలన పడిపోయింది’’ అంటున్న లక్ష్మికి ముగ్గురు పిల్లలు. వారిని పెంచడం, ఇంటి పనులు చేయడం, మరోవైపు భక్త వేధింపులు... వీటితో ఎంతో నలిగిపోయారామో. ‘‘నా భర్త చదువుకోలేదు. మా ఇద్దరి మధ్యా అభిప్రాయబేధాలు ఉండేవి. అతను పశువులు కాస్తూ ఉండేవాడు. రోజూ తాగి ఇంటికి వచ్చి నన్ను తిట్టేవాడు, అతను పెట్టే చిత్రహింసల్ని ఎన్నో ఏళ్ళు కన్నీళ్ళతో భరించాను. ఆ నరకాన్ని తట్టుకోలేక  తిరగబడ్డాను. పిల్లలను తీసుకొని బయటకు నడిచాను. ఆ సమయంలో మా అమ్మ మా ఇద్దరినీ కూర్చోబెట్టి నచ్చజెప్పింది. ఆ తరువాత క్రమంగా నా భర్తలో కొంత మార్పు వచ్చింది.


కానీ మొదటి నుంచీ తెలిసిన వ్యక్తే నా విషయంలో ఇలా ప్రవర్తిస్తే, ముక్కూ మొహం తెలియని మనిషిని చిన్నప్పుడే పెళ్ళాడి, వేధింపులను భరిస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? నా చుట్టుపక్కల అలాంటివారు ఎంతో మంది ఉన్నారు.  వాళ్ళ దుస్థితి చూసి నాకు ఎంతో బాధగా అనిపించేది. వాళ్లు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే దీనంతటికీ పరిష్కారమని అర్థమయింది’’ అని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారామె. 


నువ్వేం చెయ్యగలవని ఎగతాళి చేశారు...

సొంతంగా తన కాళ్ళ మీద నిలబడాలన్న తపన ఉన్నా పరిస్థితులు సహకరించకపోవడంతో ఆమెను నిస్పృహ ఆవరిస్తూ ఉండేది. ఆ దశలోనే అనుకోని ఒక అవకాశం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. 2000 సంవత్సరంలో హలో మెడికల్‌ ఫౌండేషన్‌ ‘భారతీయ వైద్య’ పేరుతో ఒక ప్రాజెక్ట్‌ను ఆమె గ్రామంలో ప్రారంభించింది. గ్రామంలో రోగుల వివరాలను సేకరించి, వైద్యులకు తెలియజేసే ఒక  కార్యకర్త కావాలని పంచాయతీ సభ్యులను అడిగారు. ప్లస్‌ టూ వరకూ చదివిన లక్ష్మిని గ్రామ ఆరోగ్య కార్యకర్తగా పంచాయతీ సిఫార్సు చేసింది. ‘‘గర్భిణులు, శిశువుల సంరక్షణ, గర్భధారణ నిర్ధారణ, హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహించడం నా బాధ్యత. నెలకు మూడు వందల రూపాయల జీతం ఇచ్చేవారు. ఒక విధంగా చిన్న స్థాయి వైద్యురాలినన్నమాట. క్రమంగా చుట్టుపక్కల గ్రామాలకు కూడా నా సేవలు విస్తరించాను. మొదట్లో ప్రజలు నాకు సహకరించలేదు. ‘వైద్యురాలికి ఉండాల్సిన అర్హతలేవీ నీకు లేవు.?’ అంటూ ఎగతాళి చేశారు. క్రమంగా నా పనితీరు వారికి అర్థమయింది. ఆ తరువాత నన్ను ఆత్మీయంగా చూడడం ప్రారంభించారు’’ అంటారామె.


ఒంటరి మహిళల కోసం...

చాలా ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించిన తరువాత... మహిళల ఆర్యోం, ఆహార భద్రత, ఆర్థికంగా ఇతరుల మీద ఆధారపడడానికీ మధ్య విడదీయలేని సంబంధం ఉందని ఆమెకు అర్థమయింది. ‘‘నాలాగే గృహహింసకు గురైన ఎందరో మహిళలు భర్తల నుంచి వేరుపడి, పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్నారు.  వారికి ఆస్తులూ లేవు.   బ్యాంకులు రుణాలు ఇవ్వవు. దీంతో చిన్న చిన్న పనులు చేస్తూనే జీవితాలు వెళ్ళదీయాల్సి వస్తోంది. ఆరోగ్యం బాగులేక పని మానేస్తే ఆదాయం రానట్టే. అలాంటి వారికోసం పన్నెండు మంది మహిళలతో కలిసి స్వయంసహాయక బృందాన్ని ప్రారంభించాను’’ అంటారు లక్ష్మి. ఆ బృందం ద్వారా బాల్యవివావాహల నిరోధానికి ఆమె కృషి చేశారు. ఆమె సేవల్ని గుర్తించిన హలో మెడికల్‌ ఫౌండేషన్‌ ఆమెను ‘కమిటీ ఆఫ్‌ రిసోర్స్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ లిటరసీ’ (సిఓఆర్‌ఓ ఇండియా) నిర్వహించే ఒక ఫెలోషిప్‌ కార్యక్రమానికి సిఫార్సు చేసింది. అక్కడ తెలుసుకున్న విషయాలను ఆచరణలో పెట్టడం కోసం ‘ఏకల్‌ మహిళా సంఘటన్‌’ (ఒంటరి మహిళల సంస్థ)ను ఆమె ఏర్పాటు చేశారు. నాలుగు జిల్లాల్లోని మూడు వందల గ్రామాల్లో పని చెయ్యడం కోసం రెండువందల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఆమె ప్రయత్నం 17వేల మందికి పైగా ఒంటరి మహిళల జీవితాల్లో మార్పు తెచ్చింది. 


చేయాల్సింది ఎంతో ఉంది...

‘‘నాకు ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. అందరూ బాగా చదువుకుంటున్నారు. ఇంటి పనుల్లో సాయం  చేస్తారు. పొద్దున్న తొమ్మిది కల్లా సర్వేల కోసం బయటకు వెళ్తాను. దాదాపు మూడువేల మందికి పైగా గ్రామస్థులను కలుస్తాను. లాక్‌డౌన్‌ సమయంలో  ఫోన్లలోనే వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని సలహాలు ఇచ్చేదాన్ని’’ అని చెబుత్ను లక్ష్మి ఆరోగ్య కార్యకర్తగా వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాన్ని నడుపుతున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంస్థల ఆహ్వానం మేరకు సదస్సులకు హాజరై, ఒంటరి మహిళల సమస్యల గురించీ, వాటి పరిష్కారాల గురించీ అవగాహన కల్పిస్తున్న ఆమె ‘‘ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది’’  అంటారు.  


ఆడపిల్లలను బాగా చదివించాలి. వాళ్ళు సాధికారత సాధించడానికి కుటుంబంతో పాటు సమాజం కూడా సాయపడాలి. యుక్త వయసు వచ్చాక వారి ఇష్టంతోనే వివాహాలు చేయాలి. అప్పుడే వాళ్ళు ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో జీవించగలుగుతారు

Updated Date - 2020-12-24T05:49:00+05:30 IST