‘సిప్‌’ చేద్దాం

ABN , First Publish Date - 2022-01-23T07:55:07+05:30 IST

మార్కెట్‌ రిస్క్‌లను ఇష్టపడని మదుపర్లు, స్థిర ఆదాయాన్ని ఆశించే వారు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు....

‘సిప్‌’ చేద్దాం

  ఫండ్స్‌లో రికార్డు స్థాయికి పెట్టుబడులు

  డిసెంబరులో రూ.11,300 కోట్లు

  మొత్తం ఏయూఎంలో 15 శాతం వాటా


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మార్కెట్‌ రిస్క్‌లను ఇష్టపడని మదుపర్లు, స్థిర ఆదాయాన్ని ఆశించే వారు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు సిస్టమాటిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రణాళికను (సిప్‌) ఎంచుకుంటున్నందున సిప్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో చేసే పెట్టుబడులు కొత్త రికార్డు స్థాయిలకు చేరుతున్నాయి. వరుసగా గత తొమ్మిది నెలలుగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ పెట్టుబడులు కొత్త రికార్డు స్థాయిలకు చేరుతున్నాయని.. సిప్‌ ద్వారా మదుపర్లు డిసెంబరులో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఏకంగా రూ.11,305 కోట్ల పెట్టుబడులు పెట్టారని మోతీలాల్‌ ఓస్వాల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అఖిల్‌ చతుర్వేది తెలిపారు. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు నిర్వహిస్తున్న మొత్తం ఆస్తుల్లో (ఏయూఎం) సిప్‌ల ద్వారా వచ్చిన నిధుల ఏయూఎం వాటా దాదాపు 15 శాతానికి చేరింది. ఐదేళ్ల క్రితం ఇది 7.75 శాతం మాత్రమే. గత ఐదేళ్లుగా మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహిస్తున్న ఆస్తులు ఏడాదికి 18 శాతం చొప్పున పెరుగుతుంటే.. సిప్‌ ఏయూఎంలు ఏడాదికి 34 శాతానికి పైగా పెరుగుతున్నాయి. 

ఈక్విటీ ఫండ్స్‌లోనే: సిప్‌ల ద్వారా పెట్టుబడులు పెడుతున్న వారు ప్రధానంగా ఈక్విటీ, మల్టీక్యాప్‌ ఫండ్‌లను ఎంచుకుంటున్నారని చతుర్వేది అన్నారు. సిప్‌ల ఏయూఎం దాదాపు రూ.5.6 లక్షల కోట్లు. ఇందులో దాదాపు నాలుగో వంతు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోనే ఉన్నాయి. గత ఐదేళ్లలో సిప్‌ల ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చిన మొత్తం నిధుల ప్రవాహం దాదాపు రూ.4.9 లక్షల కోట్లు ఉన్నట్లు మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ అంచనా వేస్తోంది. ఒక్కో ఖాతాకు సంబంధించి సగటు సిప్‌ పరిమాణం రూ.2,300లకు చేరింది.  


4.91 కోట్ల సిప్‌ ఖాతాలు: అంతరాయం లేకుండా రిస్క్‌ను తగ్గించుకుని షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లు దోహదం చేస్తాయని.. దీనికి సిప్‌ ఉత్తమ మార్గమని చతుర్వేది అన్నారు. సిప్‌ ఖాతాలు 4.91 కోట్లు ఉండగా.. ఇందులో 4.16 కోట్లు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉద్దేశించినవే. 31.2 లక్షల ఖాతాలు హైబ్రిడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రారంభించినవి. మార్కెట్లో అప్పుడప్పుడు తగ్గుతున్నప్పటికీ.. దానితో సంబంధం లేకుండా సిప్‌ ద్వారా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో మదుపర్లు పెట్టుబడులు పెడుతున్నారు. దీర్ఘకాలిక ప్రాతిపదికన భారత్‌ ఆర్థిక వ్యవస్థ, వృద్ధిరేటుపై విశ్వాసమే ఇందుకు కారణమని మ్యూచువల్‌ ఫండ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2022-01-23T07:55:07+05:30 IST