సార్‌.. ఆక్సిజన్‌ ఉందా?

ABN , First Publish Date - 2021-05-05T08:36:32+05:30 IST

‘‘సార్‌.. మా అంకుల్‌కు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఆక్సిజన్‌ కావాలి. ఎక్కడ, ఎవరిని సంప్రదించాలో తెలియడంలేదు.

సార్‌.. ఆక్సిజన్‌ ఉందా?

  • బెడ్స్‌ ఎక్కడ ఖాళీ ఉన్నాయి?
  • సైబరాబాద్‌ కంట్రోల్‌ రూంకు కాల్స్‌
  • వెంటనే స్పందిస్తున్న సిబ్బంది
  • ప్లాస్మా, అంబులెన్స్‌ సేవలు 

బాధితులు సంప్రదించాల్సిన సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూం నంబర్‌: 9490617440

అత్యవసర వైద్యసేవలు, అంబులెన్స్‌ కొరకు సంప్రదించాల్సిన నంబర్‌: 9490617431


హైదరాబాద్‌ సిటీ, మే 4(ఆంధ్రజ్యోతి): ‘‘సార్‌.. మా అంకుల్‌కు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఆక్సిజన్‌ కావాలి. ఎక్కడ, ఎవరిని సంప్రదించాలో తెలియడంలేదు. దయచేసి ఆక్సిజన్‌ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి సార్‌’’... ఇది సోమవారం అర్ధరాత్రి శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన నవీన్‌ (పేరు మార్చాం) కొవిడ్‌ కంట్రోల్‌ రూంకు చేసిన ఫోన్‌ కాల్‌. ఈ కాల్‌ అందుకున్న కంట్రోల్‌ రూం సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆక్సిజన్‌ కిట్‌తో ఉన్న అంబులెన్స్‌ను నవీన్‌ చెప్పిన చిరునామాకు పంపించగా.. ఆ అంబులెన్స్‌ పేషెంట్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించింది.  ఇలా కేవలం నవీన్‌ మాత్ర మే కాదు ఎంతో మంది బాఽధితులు సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌లు చేస్తున్నారు. రోజుకు 350-400 ఫోన్‌ కాల్స్‌ వస్తుండగా.. వాటిలో 200లకు పైగా ప్లాస్మాకోసం వస్తున్నాయని, మిగిలినవి అంబులెన్స్‌ సర్వీసులు, ఆక్సిజన్‌ ఎక్కడ దొరుకుతుంది? ఏ ఆస్పత్రిలో  బెడ్స్‌ ఖాళీలున్నాయనే సమాచారం కోసం వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. సైబారాబాద్‌ సీపీ సజ్జనార్‌.. మార్చిలోనే కొవిడ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కంట్రోల్‌ రూంలో 24/7 సేవలు కొనసాగిస్తున్నారు.  కరోనా రోగులు, కరోనాలేని అత్యవసర రోగులకూ సేవలు అందిస్తున్నారు. అవసరమైన వారికి ప్లాస్మా, అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 


రండి.. ఆపత్కాలంలో ఆదుకుందాం 

ఆస్పత్రి యాజమాన్యాలు ఉచితంగా అంబులెన్స్‌లు అందించడం, ఇతర సంస్థలు, ఎన్జీవోలు కొవిడ్‌ సేవల్లో తమ పాత్ర పోషించడం సంతోషంగా ఉందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. మిగిలిన సంస్థలు కూడా ముందుకొచ్చి ఈ ఆపత్కాలంలో బాధిత ప్రజలను ఆదుకోవాలని కోరారు. 

Updated Date - 2021-05-05T08:36:32+05:30 IST