ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్

ABN , First Publish Date - 2021-06-12T06:03:56+05:30 IST

జూన్ 6తో ప్రారంభమైన వారంలో, ప్రతి రోజూ వేస్తున్న సగటు టీకాల సంఖ్య 30 నుంచి 34 లక్షలకు పెరిగింది. ఇదే రీతిలో వ్యాక్సినేషన్ కొనసాగినా ఈ సంవత్సరాంతానికి 60 కోట్ల టీకాలు వేయడం మాత్రమే సాధ్యమవుతుంది.....

ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్

జూన్ 6తో ప్రారంభమైన వారంలో, ప్రతి రోజూ వేస్తున్న సగటు టీకాల సంఖ్య 30 నుంచి 34 లక్షలకు పెరిగింది. ఇదే రీతిలో వ్యాక్సినేషన్ కొనసాగినా ఈ సంవత్సరాంతానికి 60 కోట్ల టీకాలు వేయడం మాత్రమే సాధ్యమవుతుంది. మరి 90 నుంచి 100 కోట్ల మంది వయోజనులకు ఈ ఏడాది ముగిసేలోగా టీకా రెండు డోసులు వేయాలన్న లక్ష్యం ఎలా నెరవేరుతుంది?


ఒకమహావిపత్తును ఎదుర్కోవడంలో ఎలా వ్యవహరించకూడదో వ్యాక్సినేషన్ గడబిడ స్పష్టం చేసింది. టీకాల సంక్షోభం వర్తమాన చరిత్రలో ఒక మచ్చలా నిలిచిపోయింది. ఈ నెల 7న దేశప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు పొరపాట్లను సరిదిద్దుకున్నారు. తప్పులను అంగీకరించడంలో అది ఆయన పద్ధతి కాబోలు. సరే, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ముందుకు కదలాలి. వ్యాక్సినేషన్‌లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించి, అంటువ్యాధుల నిపుణులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు మనం కృతనిశ్చయంతో పూనుకుని తీరాలి. అయితే గత 15 నెలలుగా మోదీ ప్రభుత్వం చేసిన తప్పులు ఏమిటో చూడడం చాలా ముఖ్యం.


(1) కరోనా వైరస్ తొలిదఫా విజృంభణకే కొవిడ్ విలయం పరిమితమవుతుందని, దేశీయంగా అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్లకు అనుగుణంగా వ్యాక్సినేషన్ను నింపాదిగా నిర్వహించవచ్చని కేంద్రప్రభుత్వం విశ్వసించింది. వైరస్ రెండోదఫా విజృంభణ అనివార్యమని, అది మరింత భయానకంగా ఉండగలదన్న వైద్య నిపుణుల హెచ్చరికలను ప్రభుత్వం పూర్తిగా ఉపేక్షించింది. దేశప్రజలు అందరికీ వ్యాక్సినేషన్‌ను సత్వరమే పూర్తి చేసి తీరాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించనే లేదు. (2) దేశీయ టీకా ఉత్పత్తిదారులను, వారి లాభాలను పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపింది.  


(3) అమెరికా, బ్రిటన్, జపాన్, యూరోపియన్ దేశాలు 2020 మే–జూన్ లోనే టీకా ఉత్పత్తిదారులకు తమ ఆర్డర్లను ఇవ్వగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు కేంద్రం తన మొదటి ఆర్డర్‌ను 2021 జనవరి 11న ఇచ్చింది! పైగా ఆ ఆర్డర్ కూడా కేవలం 1.1 కోట్ల డోసుల కోసం మాత్రమే!! భారత్ బయోటెక్‌కు ఆ తరువాత ఆర్డర్ ఇచ్చారు. అయితే ఆ ఆర్డర్ చేసిన తేదీ, ఎన్ని డోసులకు చేసిందీ వివరాలు తెలియవు. (4) టీకాల సత్వర ఉత్పత్తికి పెట్టుబడి పెట్టాలని లేదా సబ్సిడీ ఇవ్వాలని సీరమ్ డిమాండ్ చేసింది. అయితే కేంద్రం దేశీయ ఉత్పత్తిదారులకు కనీసం ముందస్తు చెల్లింపులు కూడా చేయలేదు. 2021 ఏప్రిల్ 19న మాత్రమే సీరమ్‌కు రూ.3000కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ.1500 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించారు. (5) సీరమ్, భారత్ బయోటెక్‌ల సగటు నెలవారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రభుత్వం కచ్చితంగా మదింపు చేయలేదు.  


(6) రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే కేంద్రం ఏకపక్షంగా వ్యాక్సినేషన్ విధానాన్ని రూపొందించి అమలుపరిచింది. ఆ విధానం ‘అసంబద్ధంగా’ ఉందని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. (7) వ్యాక్సిన్ల సేకరణను కేంద్రం వికేంద్రీకరించింది. 18–44 సంవత్సరాల మధ్య వయస్సు కల వారికి టీకాలు వేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపై మోపింది. ఈ వికేంద్రీకరణ ఒక ఘోర తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వాలు పిలిచిన టెండర్లకు ఎవరూ ప్రతిస్పందించలేదు. వ్యాక్సిన్ల సేకరణ పూర్తిగా అయోమయంలో పడింది. (8) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు సరఫరా చేసే వ్యాక్సిన్లకు భిన్నమైన ధరలు నిర్ణయించి మోదీ సర్కార్ పెద్ద తప్పు చేసింది. ఉత్తత్తిదారులు ప్రభుత్వాసుపత్రులకు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు విక్రయించుకోవడంతో వాక్సిన్ల కొరత ఏర్పడింది. కొన్ని రాష్ట్రాలలో వ్యాక్సినేషన్‌ను నిలిపివేశారు. కొవిషీల్డ్, స్పుట్నిక్–వి, కొవాగ్జిన్ టీకాలకు వరుసగా రూ.780, రూ.1145, రూ.1410 ధర వసూలు చేసేందుకు ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతి ఇవ్వడంపై నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది. (9) వ్యాక్సినేషన్‌ కోసం విధిగా కొవిన్ యాప్‌లో పేరు నమోదు చేయించుకోవాలని కేంద్రం నిర్దేశించడం సబబుగా లేదు. కేంద్రం ఆదేశం డిజిటల్ అంతరాలను సృష్టిస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.


ఈ తప్పులను పక్కన పెడదాం. టీకాల ఉత్పత్తి, సరఫరా మెరుగుపడింది. రష్యన్ టీకా స్పుట్నిక్‌–వి అందుబాటులోకి వచ్చింది. జూన్ 6తో ప్రారంభమైన వారంలో, ప్రతి రోజూ వేస్తున్న సగటు టీకాల సంఖ్య 30 నుంచి 34 లక్షలకు పెరిగింది. అయితే ఇదే రీతిలో వ్యాక్సినేషన్ కొనసాగినా ఈ సంవత్సరాంతానికి 60 కోట్ల టీకాలు వేయడం మాత్రమే సాధ్యమవుతుంది. మరి 90 నుంచి 100 కోట్ల మంది వయోజనులకు (వీరిలో ఐదు కోట్ల మంది వయోజనులు ఇప్పటికే రెండు డోసులు వేయించుకున్నారు) ఈ సంవత్సరాంతానికి టీకా రెండు డోసులు వేయాలన్న లక్ష్యం ఎలా నెరవేరుతుంది? 


వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు తదుపరి చర్యలను కేంద్రం 2021 జూన్ లోగా చేపట్టి తీరాలన్నది స్పష్టం. అవి: (1) దేశీయ ఉత్పత్తిదారులు 2021 జూలై–డిసెంబర్ మధ్య నెలవారీగా ఉత్పత్తి చేయవలసిన టీకాలకు ఒక విశ్వసనీయ షెడ్యూల్‌ను నిర్దేశించాలి. దిగుమతి చేసుకునే స్పుట్నిక్‌వి టీకాలు, లైసెన్స్ పొందిన ఇతర కంపెనీలు ఉత్పత్తి చేసే మొత్తం టీకాలను కూడా కలుపుకోవాలి. (2) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, సైనోఫామ్ టీకాలకు తక్షణమే ఆర్డర్లు ఇవ్వాలి. సరఫరాలకు ముందస్తుగా చెల్లింపులు జరపాలి. వీటితో కూడా అందుబాటులోకి వచ్చే మొత్తం టీకాలను పరిగణనలోకి తీసుకోవాలి.


(3) వ్యాక్సిన్ల సేకరణ బాధ్యతను పూర్తిగా కేంద్రమే చేపట్టాలి (75 శాతం వ్యాక్సిన్ల సేకరణ బాధ్యతను కేంద్రమే చేపడుతుందని జూన్ 7న ప్రధాని మోదీ అన్నారు) వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్‌ను కేటాయించేందుకు రాష్ట్రాలకు స్వేచ్ఛ నివ్వాలి. (4) అవసరాలకు అనుగుణంగా టీకాలు అందుబాటులో లేకపోతే ఆ కొరతను ఎలా తీర్చనున్నదీ ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలి. 2021 డిసెంబర్ లోగా టీకాల కొరతను పూర్తిగా తీర్చడమనేది అసాధ్యంగా కన్పిస్తోంది. కనుక రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి వ్యాక్సినేషన్ ప్రాథమ్యాలను కేంద్రం పునఃనిర్ణయించాలి. (5) ఆసుపత్రి పడకలతో సహా ఆరోగ్య భద్రతా సదుపాయాలను ఇతోధికంగా మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపట్టాలి. 


ఇవేమీ అసాధ్యమైన చర్యలు కావు. అయితే వాటికి ప్రణాళిక అవసరం. మరి మోదీ ప్రభుత్వానికి ప్రణాళికా విధానం గిట్టదు కదా. ప్రణాళికా సంఘాన్నే రద్దు చేసిన పాలకులు వాటికి ఇష్టపడతారా? ఇతర దేశాలలో ప్రణాళికలకు నిత్యం ప్రాధాన్యమిస్తున్నారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికా విధానం పట్ల మోదీ సర్కార్ తన వైషమ్యాన్ని విడనాడాలి. అనూహ్య పరిణామాలను ముందుగా పసిగట్ట గల నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేసి ఎటువంటి ఆపదలనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు పటిష్ఠ ప్రణాళికలను రూపొందించాలి. ఈ సవాల్‌ను కేంద్రప్రభుత్వం ఎలా ఎదుర్కోనున్నదో చూద్దాం.





పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-06-12T06:03:56+05:30 IST