Abn logo
Apr 29 2021 @ 09:01AM

బావమరుదులపై తల్వార్‌తో బావ దాడి

హైదరాబాద్/ఖైరతాబాద్‌ : కుటుంబ తగాదాలపై మాట్లాడుదామని పిలిచి బావమరుదులపై తల్వార్‌తో దాడి చేసిన బావని సైఫాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఏసీ గార్స్డ్‌కు చెందిన జమీల్‌ అహ్మద్‌(35)కు 2011లో వివాహమైంది. స్థానికంగా ఒక వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్నాడు. భార్య మానసిక పరిస్థితి బాగా లేదు. ఈ విషయమై సోమవారం జమీల్‌ అహ్మద్‌ ఆమె తండ్రికి ఫోన్‌ చేసి మాట్లాడుతుండగా బావమరుదులు ఫోన్‌ను లాక్కొని బావతో గొడవకు దిగారు. ఈ విషయంలో మాట్లాడుకునేందుకు వాటర్‌ ప్లాంట్‌ వద్దకు ఇరుకుటుంబాల వారు వచ్చారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో మరోసారి ఘర్షణకు దిగారు.


ఇంతలో జమీల్‌ ఇంట్లో ఉన్న తల్వార్‌ తీసుకొని వచ్చి బావమరుదులపై దాడి చేయగా రియాజ్‌ చేతికి, పర్వేజ్‌, అయాస్‌ చేతులు, భుజాలకు గాయాలయ్యాయి. అదేరోజు రాత్రి బాధితులు సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ జమీల్‌ అహ్మద్‌ను బుధవారం అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. దాడికి వినియోగించిన తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

క్రైమ్ మరిన్ని...