ఇంటికి రావాలని ఉంది.. మా అమ్మను చూసుకోవాలని ఉంది.. మృత్యువుతో పోరాడుతున్న ఓ ప్రవాస భారతీయుడి ఆవేదన!

ABN , First Publish Date - 2021-11-17T02:24:50+05:30 IST

సోదరుడి కాపాడుకునేందుకు ఓ సోదరి పడుతున్న ఆవేదన

ఇంటికి రావాలని ఉంది.. మా అమ్మను చూసుకోవాలని ఉంది.. మృత్యువుతో పోరాడుతున్న ఓ ప్రవాస భారతీయుడి ఆవేదన!

ఇంటర్నెట్ డెస్క్: కేవలం మూడు చెంచాల డ్రగ్స్‌ను సరిహద్దు దాటించినందుకు ఓ భారత సంతతి వ్యక్తి ప్రస్తుతం సింగపూర్‌లో మరణ శిక్షను ఎదుర్కొబోతున్నాడు. అతడి పేరు నాగేంద్రన్ కే. ధర్మలింగం. అనేక మందిని కబళించిన కరోనా.. అతడిని మాత్రం రక్షించింది. నాగేంద్రన్‌కు పాజిటివ్ అని తేలడంతో మరణ శిక్ష అమలు వాయిదా పడింది. అయితే.. ఈ ఊరట తాత్కాలికమేనని అతడి సోదరి వ్యధ చెందుతోంది. ఇంటికి రావాలని, తన తల్లిని చూడాలని కోరుకుంటున్న అతడికి జీవించేందుకు మరో అవకాశం ఇవ్వాలని ఆమె సింగపూర్ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. 


డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో సింగపూర్ చాలా కచ్చితంగా వ్యవహరిస్తుంది. మరణ శిక్షలు పడుతుందన్న భయమే నేరస్థులను అదుపు చేస్తుందని బలంగా నమ్ముతుంది. అందుకే.. నాగేంద్రన్ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. 20 ఏళ్ల వయసులో నాగేంద్రన్‌  మలేషియా నుంచి సింగపూర్‌కు మాదకద్రవ్యాలు తరలిస్తూ సింగపూర్ అధికారులకు చిక్కాడు. పదమూడేళ్ల క్రితం జరిగిందీ ఘటన. ఇన్నేళ్లుగా అతడు జైల్లోనే మగ్గుతున్నాడు. 2010లో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఇప్పుడు ఆ శిక్షను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. 


అయితే..మరణ శిక్ష నిలిపివేయాలంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సింగపూర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి సోదరి కూడా నాగేంద్రన్‌కు మరో అవకాశం ఇవ్వాలని కోరుకుంటోంది.  అతడు పోలీసులకు చిక్కిన సమయంలో పరీక్షలు జరపగా..అతడి ఐక్యూ సామర్థ్యం 69గా తేలింది. అంటే.. నాగేంద్రన్ దాదాపుగా మానసిక వికలాంగుడని దీనర్థం. నాగేంద్రన్ సోదరి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తోంది. 


తామిద్దరం కటిక పేదరికంలో పెరిగామని ఆమె చెప్పుకొచ్చింది. మానసిక సామర్థ్యంలేని అతడు పేదరికం కారణంగా మరింత ఒత్తిడికి లోనయ్యేవాడని, ఎవరి మాటలనైనా ఇట్టే నమ్మేసేవాడని పేర్కొంది. ఈ క్రమంలో నాగేంద్రన్ మాదకద్రవ్యాల అక్రమరవాణాకు పూనుకుని ప్రమాదంలో పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని నాగేంద్రన్‌కు జీవించే అవకాశాన్ని కల్పించాలని కోరింది. జైల్లో కలిసిన ప్రతిసారీ అతడు ఇంటికి రావాలని, తల్లిని చూడాలని కోరుకునేవాడని చెప్పింది. దీంతో.. సింగపూర్ ప్రభుత్వం అతడి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

Updated Date - 2021-11-17T02:24:50+05:30 IST