సిట్ ఏర్పాటు లక్ష్యం అదేనా!

ABN , First Publish Date - 2020-02-22T20:38:00+05:30 IST

చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైసీపీ సర్కార్ సిట్‌ను (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు ఇంటలిజెన్స్ డీఐజీ నేతృత్వం వహిస్తారు. సిట్‌లో సభ్యులంతా పోలీసుఅధికారులే.

సిట్ ఏర్పాటు లక్ష్యం అదేనా!

అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైసీపీ సర్కార్ సిట్‌ను (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు ఇంటలిజెన్స్ డీఐజీ నేతృత్వం వహిస్తారు. సిట్‌లో సభ్యులంతా పోలీసుఅధికారులే. టీడీపీ ఐదేళ్ల పాలనపై త్వరగతిన దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని కీలక నిర్ణయాలపై సిట్ విచారణ జరపనుంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా సిట్ పనిచేస్తుంది. సిట్ తక్షణమే పని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడ లేదా డీజీపీ కార్యాలయం నుంచి సిట్ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. సోమవారం నుంచి సిట్ పని ప్రారంభించనుంది. కేబినెట్ సబ్ కమిటీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ నివేదికను పరిశీలించనుంది. ఇప్పటికే సీఐడీ నమోదు చేసిన కేసుల గురించి నీటి ప్రాజెక్టుపై ఫీటర్ కమిటీ నివేదికను సిట్ పరిశీలించనుంది. 

చంద్రబాబు హయాంలో అవకతవకలు జరిగాయంటూ మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చిందని, ఆ సంగతి తేల్చేందుకు ప్రత్యేక సంస్థ అవసరమని నిర్ణయించి సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత తీసుకున్న విధాన, పాలనా నిర్ణయాలు, ప్రాజెక్టులు, పథకాలు, ఏర్పాటు చేసిన సంస్థలపై 2019 జూన్ 26వ తేదిన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీ తన తొలినివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సీఆర్డీయే పరిధిలో భూములు కేటాయింపుతో సహా పలు ప్రాజెక్టుల్లో విధాన, న్యాయ, ఆర్థిక పరమైన అవకతవకలను, మోసపూరిత లావాదేవీలు జరిగాయని సబ్ కమిటీ గుర్తించింది. దీనిపై నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంపై ఒక ప్రత్యేక ఏజన్సీతో దర్యాప్తు చేయాలని నిర్ణయించామని, జీవోలో వివరించారు. పైగా గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని స్పీకర్ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించారని గుర్తు చేశారు.     

సిట్‌ పనితీరు - విధి విధానాలను కూడా జీవోలో పొందుపరిచారు. దీనిప్రకారం... సిట్‌ అధికారులు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్పీసీ) ప్రకారం ఆయా అంశాలపై విచారణ చేయవచ్చు. కేసు రిజిస్టర్‌ చేసి దర్యాప్తు చేయవచ్చు. అలాగే... సంబంధిత సమాచారాన్ని అవసరమైతే రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో పంచుకోవడంతోపాటు సమన్వయం చేసుకోవాలి. 



Updated Date - 2020-02-22T20:38:00+05:30 IST