Dera బాబాకు 100 ప్రశ్నలు..7 గంటల SIT విచారణ

ABN , First Publish Date - 2021-11-09T16:25:59+05:30 IST

చండీఘఢ్‌ సిట్ బృందం డేరా అధినేత రామ్ రహీమ్‌పై తొలిసారిగా 7 గంటల్లో 100 ప్రశ్నలు సంధించింది...

Dera బాబాకు 100 ప్రశ్నలు..7 గంటల SIT విచారణ

సునారియా:చండీఘఢ్‌ సిట్ బృందం డేరా అధినేత రామ్ రహీమ్‌పై తొలిసారిగా 7 గంటల్లో 100 ప్రశ్నలు సంధించింది. గురుగ్రంథ సాహిబ్‌లో దొంగతనం కేసులో నిందితుడైన డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను రోహ్‌తక్‌లోని సునారియా జైలులో పంజాబ్ పోలీసుల నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం ఏడు గంటలకు పైగా ప్రశ్నించింది. 2015 ఫరీద్‌కోట్ జిల్లాలోని బుర్జ్ జవహర్ సింగ్ వాలా గ్రామంలో హత్యాకాండ కేసులో డేరా అధినేతను తొలిసారిగా పోలీసులు ప్రశ్నించారు.మొట్ట మొదటిసారి డేరాబాబాను 100 ప్రశ్నలు సంధించామని సిట్ బృందం సభ్యుడు చెప్పారు.


గత ఏడాది జూలైలో, జూన్ 2, 2015న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన దొంగతనం,హత్యాకాండ కేసుల్లో డేరా చీఫ్‌ను నిందితుడిగా సిట్ పేర్కొంది.సిట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సురీందర్ పాల్ సింగ్ పర్మార్ నేతృత్వంలోని బటాలా ఎస్‌ఎస్‌పి ముఖ్వీందర్ సింగ్ భుల్లార్, డీఎస్పీ లఖ్వీర్ సింగ్, ఇన్‌స్పెక్టర్ దల్బీర్ సింగ్‌లతో కూడిన సిట్ బృందం డేరా చీఫ్‌ని సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 7 గంటలకు పైగా విచారించింది.2017లో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసినందుకు డేరా చీఫ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. జనవరి 2019లో జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో అతనితో పాటు మరో ముగ్గురికి కోర్టు జీవిత ఖైదు విధించింది. డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో అక్టోబరు 18న మరో నలుగురితో పాటు డేరాబాబాకు జీవిత ఖైదు కూడా పడింది.



2015 కేసుకు సంబంధించి తనపై ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసిన ఫరీద్‌కోట్ కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని, ముందస్తు బెయిల్‌ను కోరుతూ డేరాబాబా కోర్టును ఆశ్రయించారు.సిట్ జైలులో ఉన్న డేరాను విచారించవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్టు గత నెలలో ఆదేశించింది. ‘‘కోర్టు ఆదేశించినట్లుగా నవంబర్ 12వతేదీ లోపు పంజాబ్, హర్యానా హైకోర్టుకు నివేదికను సమర్పిస్తాం ’’ అని ఐజీ పర్మార్ చెప్పారు. 

Updated Date - 2021-11-09T16:25:59+05:30 IST