అధికారులపై సిట్‌ సీరియస్‌

ABN , First Publish Date - 2020-11-28T06:18:52+05:30 IST

జిల్లాలో భూముల ఆక్రమణపై ప్రభుత్వం నియమించిన ‘ప్రత్యేక దర్యాప్తు కమిటీ’ (సిట్‌) నివేదికను సిద్ధం చేసింది. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనుంది.

అధికారులపై సిట్‌ సీరియస్‌

22-ఎ సమస్యపై ఘాటైన వ్యాఖ్యలు

యంత్రాంగం చేసిన తప్పునకు సామాన్యులు ఎందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నలు

కఠిన చర్యలు, లేదంటే జరిమానాకు సిఫారసు

‘లులూ’ ప్రాజెక్టుపై వ్యాఖ్యలు

ప్రభుత్వానికి కలిగే నష్టానికి కారుకులెవరో తేల్చాలి

నివేదిక సిద్ధం...

రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పణ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో భూముల ఆక్రమణపై ప్రభుత్వం నియమించిన ‘ప్రత్యేక దర్యాప్తు కమిటీ’ (సిట్‌) నివేదికను సిద్ధం చేసింది. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనుంది. అందులో కీలకమైన అంశాలను ప్రస్తావించినట్టు విశ్వసనీయ సమాచారం. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగింది?, దాని వెనుక ఎవరు వున్నారనే అంశాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది. అధికారుల తీరు వల్ల భూములు కొనుక్కున్న సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అటువంటివి భవిష్యత్తులో తలెత్తకుండా ‘పబ్లిక్‌ అకౌంటబులిటీ’ (ప్రజలకు బాధ్యులను చేయడం) ఫిక్స్‌ చేయాలని పేర్కొంది. తప్పు చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడమో లేదంటే జరిమానా వసూలు చేయడమో జరగాలని స్పష్టంచేసింది. ఎవరికి వారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తే...గతంలో జరిగిన తప్పులు పునరావృతం అవుతాయని స్పష్టంచేసింది. 


22-ఏపై 270 ఫిర్యాదులు

22-ఏ అనేది బ్రహ్మ పదార్థంగా మారిందని సిట్‌ వ్యాఖ్యానించింది. ఇందుకు ఒక కేసును ఉదహరించింది. ఒక వ్యక్తి ఇంటి కోసం స్థలం కొనుక్కున్నాడు. దానిని రిజిష్టర్‌ చేసుకున్నాడు. అప్పుడు ఎటువంటి సమస్య ఎదురుకాలేదు. కొన్నాళ్లకు ఆర్థిక ఇబ్బందులతో ఆ స్థలాన్ని అమ్మాలని ప్రయత్నిస్తే...కుదరదని ఇటు రెవెన్యూ శాఖ, అటు రిజిస్ట్రేషన్ల శాఖ అడ్డం పడ్డాయి. ఆ స్థలం 22-ఏ జాబితాలో ఉందని, ప్రభుత్వ భూమి అని పేర్కొన్నాయి. ఒకవేళ అది ప్రభుత్వ భూమే అయితే...ఆ వ్యక్తి దానిని కొన్న సమయంలో అది 22-ఏ జాబితాలో ఎందుకు లేదు. ఆ తరువాత ఎందుకు చేరింది? దానికి బాధ్యులు ఎవరు?...అధికారులు చేసిన తప్పునకు సామాన్యులు ఎందుకు ఇబ్బంది పడాలి?...అని సిట్‌ వ్యాఖ్యానించింది. ఇలాంటి వివాదాలపై 270 ఫిర్యాదులు వచ్చాయని, ఈ సమస్యకు పరిష్కారం వుండాలని పేర్కొంది. ఇలాంటి తప్పులు చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడమో లేదంటే జరిమానా వసూలు చేయడమో జరగాలని సూచించింది. ముఖ్యంగా పబ్లిక్‌ రెస్పాన్సిబులిటీ పెంచాలని పేర్కొంది.


లులూ ప్రాజెక్టు రద్దుతో ఎవరికి ప్రయోజనం?

గత ప్రభుత్వం లులూతో ఒప్పందం చేసుకొని మాల్‌ ఏర్పాటు కోసం బీచ్‌రోడ్డులో ప్రైవేటు స్థలం తీసుకుంది. అందుకు ప్రత్యామ్నాయంగా వారికి చాలా ప్రధానమైన కేంద్రాల్లో 1.5 రెట్ల విలువైన స్థలాలను అప్పగించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక..లులూతో ఒప్పందం రద్దయింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే...ప్రైవేటు వ్యక్తుల నుంచి బీచ్‌ రోడ్డులో తీసుకున్న స్థలం ఇప్పటివరకు దేనికీ ఉపయోగించలేదు. వృథాగా ఉంది. అలాగే వారికి ఇచ్చిన భూములు కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. వీటికి ఎవరు బాధ్యులు. దీనివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం?, ఇలాంటి విలువైన ఒప్పందాలు సరిగ్గా అమలు జరగకుంటే...జరిగే నష్టానికి బాధ్యులు ఎవరో ఫిక్స్‌ చేయాలి. చర్యలు చేపట్టాలి. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి అంటూ సిట్‌ తన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.

Updated Date - 2020-11-28T06:18:52+05:30 IST