వచ్చే వానాకాలానికి ‘సీతారామ’ నీరు

ABN , First Publish Date - 2020-07-11T09:24:57+05:30 IST

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గోదావరిపై నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ఈ ఏడాది డిసెంబరు

వచ్చే వానాకాలానికి ‘సీతారామ’ నీరు

ఈ ఏడాది డిసెంబరునాటికి పనులు పూర్తి చేస్తాం

విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌

భద్రాద్రి జిల్లా బీజీకొత్తూరు, వీకే రామవరంలో పర్యటన

సీఎంవో కార్యదర్శి, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి ప్రాజెక్టు పనుల పరిశీలన 


ఖమ్మం/కొత్తగూడెం, జూలై 10 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గోదావరిపై నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తిచేసి.. వచ్చే వానాకాలనికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయకట్టుకు గోదావరి జలాలు అందిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 31లోపు సీతారామ ఎత్తిపోతలకు సంబంధించిన పంపుహౌస్‌ల ట్రయల్‌రన్‌ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. శుక్రవారం ఆయన.. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ఇరిగేషన్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, ఇరిగేషన్‌ ఈఎన్‌సీ మురళిధర్‌, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావుతో కలిసి భద్రాద్రిజిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు, మలకలపల్లి మండలం వీకే రామవరంలో జరుగుతున్న సీతారామ ఎత్తిపోతల పంప్‌హౌస్‌, కాలువ పనులను పరిశీలించారు. తొలుత బీజీ కొత్తూరులో ప్యాకేజీ 1కింద, ప్యాకేజీ 2కింద వీకేరామవరంలో పనులు జరుగుతుండగా.. వాటి నిర్వహణ తీరును తిలకించారు. అనంతరం నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సీతారామ ఎత్తిపోతల పథకం పనుల పరిస్థితి, భూసేకరణ స్థితిగతలను తెలుసుకున్నారు.


పనులు, భూసేకరణ ప్రక్రియ ఈనెలాఖరుకల్లా ఎత్తిపోతల పథకం పనులు, మెయిన్‌కెనాల్‌, డిస్ట్రిబ్యూషన్‌ కెనాల్‌ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ సీతారామ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి 60శాతం పనులు పూర్తయ్యాయని, సుమారు రూ.3,500కోట్ల పనులు జరిగాయని తెలిపారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో 6లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతోరూ.10వేలకోట్లతో చేపడుతున్న సీతారామ ఎత్తిపోతల పథకం పనులు ఎట్టకేలకు డిసెంబరు నెలాఖరుకు పూర్తిచేసి 2001 వానాకాలానికి ఇరుజిల్లాల్లోని భూములను తడుపుతామన్నారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లాకు కూడా సాగునీరు అందిస్తామని, నాగార్జునసాగర్‌ ఆయకట్టును గోదావరి జలాలతో స్థిరీకరిస్తామన్నారు. సీతారామ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న వరప్రదాయని అని, మొత్తం ఎనిమిది ప్యాకేజీల పనులువేగవంతంగా చేపట్టబోతున్నామన్నారు. కరోనా కారణంగా మూడునెలలుగా పనులు నిలిచిపోయాయని, కార్మికులు కూడా తమరాష్ట్రలకు వెళ్లడంతో జాప్యం జరిగిందన్న ఆయన వచ్చే మూడునెలల్లో పనులు వేగవంతం చేస్తామన్నారు.


మొత్తం ఆయకట్టులో సుమారు 3లక్షల ఎన్నెస్పీ ఆయకట్టు స్థిరీకరణ జరగబోతోందని, అలాగే దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్‌ పేరుతో గోదావరిపై బ్యారేజీ నిర్మించబోతున్నామని, దీనికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైందని, ఎల్‌అండ్‌టీ ఆధ్వర్యంలో ఈబ్యారేజీ నిర్మాణ పనులు మొదలుకానున్నాయని, త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బ్యారేజీ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈబ్యారేజీ కారణంగా వరదల సమయంలో వచ్చే 30నుంచి40టీఎంసీల నీరు నిల్వ ఉంటుదని, 90రోజులపాటు గోదావరి వరద నీటిని సాగునీటికి వినియోగించుకోవచ్చన్నారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుపై హైదరాబాద్‌లో మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. నీటిపారుదలశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకం కాలువ, లిఫ్టు పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుందని కొవిడ్‌ కారణంగా జరిగిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. చైనానుంచి ఎత్తిపోతలకు అవసరమైన పంపులన్నీ వచ్చాయని, కొన్ని రవాణాలో ఉన్నాయని, మరికొన్ని రావాల్సి ఉందని తెలిపారు. భూసేకరణకు సంబంధించిన సమస్యలు పూర్తిచేయాలని ఇరు జిల్లాల కలెక్టర్లు, అధికారులను ఆదేశించామని వివరించారు. వాస్తవానికి సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు 2019 డిసెంబరునాటికి పూర్తికావాల్సి ఉండగా.. ఏడాదిపాటు జాప్యం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌, రబీ సాగుకు ఢోకా ఉండదన్నారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇరు జిల్లాల కలెక్టర్లు ఆర్వీకర్ణన్‌, ఎంవీరెడ్డి, జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య, ఇరిగేషన్‌ ఎస్‌ఈలు వెంకటకృష్ణ, శ్రీనివాసరెడ్డి, ఈఈ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


పనుల నత్తనడకపై ఉన్నతాధికారులు అగ్రహం..నిర్మాణ సంస్థ ఏజెన్సీపై ఫిర్యాదు చేయాలని ఆదేశం

సీతరామాప్రాజెక్టు ఎత్తిపొతల ప్రాజెక్టు పనుల నత్తనడక విషయమై సమీక్షా సమావేశంలో కాంట్రాక్టు దక్కించుకున్న నిర్మాణ సంస్థలపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ములకలపల్లి మండలంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ఇరిగేషన్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్‌ అధికారులతో పాటు సీతారామా పనులు నిర్వహిస్తున్న ఆయా ప్యాకేజీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్యాకేజీ 2, ప్యాకేజీ 3 పనులు నత్తనడకన సాగుతున్నందున సంబంధిత నిర్మాణ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిర్మాణ సంస్థ ఏజెన్సీపై ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్యాకేజీ 2తో పాటు భూ సేకరణ జాప్యం, ఇతర ప్యాకేజీ పనులు స్థబ్దతగా ఉండటంపై కూడా కాంట్రాక్ట నిర్మాణ సంస్థ ప్రతినిదులను కారణాలను అడిగితెలుసుకున్నారు. ఇకపై పనులు జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.

Updated Date - 2020-07-11T09:24:57+05:30 IST