ప్రతీఎకరాకు గోదావరి జలాలు

ABN , First Publish Date - 2020-08-10T06:44:51+05:30 IST

వచ్చే ఏడాదిలో ఖమ్మం జిల్లాలోని ప్రతీ ఎకరాకు గోదావరి జలాలు అందనున్నాయని, ఈ లక్ష్యంతోనే సీతారామ ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ప్రతీఎకరాకు గోదావరి జలాలు

వచ్చే ఏడాదిలో సీతారామ నీరు

సీఎం ముందుచూపుతో ముందస్తుగా సాగర్‌ నీటి విడుదల

12నుంచి జిల్లా ఆయకట్టుకు అందిస్తున్నాం

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌


ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు 9:   వచ్చే ఏడాదిలో ఖమ్మం జిల్లాలోని ప్రతీ ఎకరాకు గోదావరి జలాలు అందనున్నాయని, ఈ లక్ష్యంతోనే సీతారామ ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ అధ్యక్షతన ఆదివారం ఖమ్మంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో జరిగిన ఖమ్మం జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశంలో ఆయన మాట్లాడారు.


ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు రాకపోయినా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో సాగర్‌ జలాలను ముందే విడుదల చేయించారన్నారు. ఆల్మట్టి, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుల విషయంలో అక్కడి ప్రభుత్వాల తీరుతో భవిష్యత్‌లో రాష్ట్రానికి కృష్ణాజలాలు కష్టతరం కానున్నాయని భావించిన సీఎం గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను డిజైన్‌ చేశారన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ద్వారా సాగునీరు సమృద్ధిగా అందుతుంటే మరో ఏడాది కాలంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎన్నెస్పీ ఆయకట్టును కూడా స్థిరీకరించబోతున్నామన్నారు. 


12న సాగర్‌ జలాల విడుదల

ఇప్పటికే సాగర్‌ డ్యాం నుంచి జిల్లాకు 5,500 క్యూసెక్కుల నీళ్లు విడుదలవుతున్నాయి.. పాలేరు రిజర్వాయర్‌ను నింపడంతో పాటు ఈనెల 12న (జోన్‌2) జిల్లాకు సాగర్‌ జలాలను విడుదల చేయనున్నట్లు మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా నీటిపారుదల సలహా మండలిలో తీర్మానం చేశామన్నారు.


జిల్లాలోని అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు, రైతుల అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని, 12వతేదీ నుంచి 23రోజుల పాటు నిరంతరాయంగా నీటిని అందించడంతో పాటు ఆ తర్వాత నుంచి వారబందీ ప్రకారం పంపిణీ చేస్తామన్నారు. చివరి ఆయకట్టు భూములకు ముందస్తుగా నీటిని అందించిన తర్వాతే వారబందీ ప్రకారం నీటిని సరఫరా చేయాలని మంత్రి ఎన్నెస్పీ అధికారులను ఆదేశించారు. తాగునీటి అవసరాలు, భక్తరామదాసు ప్రాజెక్టుకు నీటికేటాయింపులు చేస్తూ ఎన్నెస్పీ అధికారులు ప్రణాళికలను రూపొందించి అమలుచేయాలన్నారు.


ఈ సందర్భంగా పలువురు శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల్లో సాగునీటి అవస్థలను, ఎన్నెస్పీ జలాల విడుదలలో లోపాలను, సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.  సమావేశంలో కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌తో పాటు జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, పాలేరు, వైరా ఎమ్మెల్యేలు సండ్రవెంకటవీరయ్య, లావుడ్యా రాములు నాయక్‌, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, డీసీఎంస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొర్రా రాజశేఖర్‌, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ వెంకటకృష్ణ, ఎన్నెస్పీ ఎస్‌ఈ సుమతీదేవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయలక్ష్మి, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ నర్సింహారావు, నీటిపారుదలశాఖ, ఐడీసీ, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. 


 నీటి విడుదల షెడ్యూల్‌ ఖరారు

ఈ వానాకాలం పంట సాగుకు సాగర్‌ ఎడమ కాలువ పరిధిలో నీటి విడుదలకు షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు ఎన్నెస్పీ ఎస్‌ఈ సుమతీదేవి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 11గంటలకు పాలేరు వద్ద రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు పాలేరు, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్రవెంకటవీరయ్య, లావుడ్యా రాములు నాయక్‌ సాగర్‌ జలాలను విడుదల చేస్తారన్నారు.


ఈ మేరకు షెడ్యూల్‌ వివరాలను ఆమె వెల్లడించారు. నీటిని పొదుపు చేస్తూ.. చివరి ఆయకట్టుకూ నీటిని అందించాలన్న లక్ష్యంతో వారబందీ పద్ధతిని అవలంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పాలేరు నీటిమట్టం 18.3 అడుగులు ఉందని సాగర్‌ జలాలు ఆదివారం ఉదయం నుంచి రిజర్వాయర్‌కు చేరుకున్నాయని ఆమె తెలిపారు.  12నుంచి  కాలువకు ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో కొనసాగించాలన్న మంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. జిల్లాలో మొత్తం 77రోజుల పాటు 7 విడతలుగా 24.611 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్లు సుమతీదేవి వివరించారు. 


షెడ్యూల్‌ ఇదీ


నీటి విడుదల తేదీ ప్రతి రోజు నీటి విడుదల రోజులు టీఎంసీల్లో

(క్యూసెక్కుల్లో)

ఆగస్టు12 నుంచి

సెప్టెంబర్‌ 3 వరకు 4333 23 8.611


సెప్టెంబర్‌ 10 నుంచి

సెప్టెంబర్‌ 18వరకు 3666 9 2.850

సెప్టెంబర్‌ 25నుంచి

అక్టోబర్‌ 3వరకు 3666 9 2.850

అక్టోబర్‌ 10నుంచి

అక్టోబర్‌ 18వరకు 3666 9 2.850

అక్టోబర్‌25 నుంచి

నవంబర్‌ 2వరకు 3666 9 2.850

నవంబర్‌ 9నుంచి

నవంబర్‌ 17వరకు 3666 9 2.850

నవంబర్‌ 24 నుంచి

డిసెంబర్‌ 2 వరకు 3370 9 1.747


మొత్తం 77 24.611

Updated Date - 2020-08-10T06:44:51+05:30 IST