సృష్టి మొదలైన రోజు!

ABN , First Publish Date - 2020-03-20T06:02:31+05:30 IST

కాలం అనంతమైనది. అనంతుడైన కృష్ణ పరమాత్మ తానే కాలస్వరూపుణ్ణని భగవద్గీతలో చెప్పాడు. ఈ అనంతమైన కాలం లెక్కకు అందదు. అందుకే దాన్ని ‘యుగం’ అన్నారు. ‘యుగం’...

సృష్టి మొదలైన రోజు!

ఈ నెల 25న శ్రీశార్వరినామ సంవత్సరాది


లోకాన్ని శోభాయమానం చేసే పండుగ...

అఖండ కాల ప్రవాహానికి ఆనవాలైన వేడుక...

ప్రకృతి కొత్త చిగుళ్ళను అలంకరించుకొనే సంబరం...

వసంత ఋతు ఆగమన సూచిక...

అదే తెలుగు వారి కొత్త యుగాది... ఉగాది. 


కాలం అనంతమైనది. అనంతుడైన కృష్ణ పరమాత్మ తానే కాలస్వరూపుణ్ణని భగవద్గీతలో చెప్పాడు. ఈ అనంతమైన కాలం లెక్కకు అందదు. అందుకే దాన్ని ‘యుగం’ అన్నారు. ‘యుగం’ అంటే రెండు అని అర్థం. గణనలో కాలాన్ని రాత్రి, పగలు అని రెండుగా విభజించారు. అలా ఒక రోజు ఏర్పడింది. ఈ కాలాన్ని సూర్య, చంద్ర, నక్షత్ర గమనాన్ని అనుసరించి రోజులను వారాలు, పక్షాలు, మాసాలు, ఋతువులు, ఆయనాలుగా పూర్వ ఋషులు విభజించారు. దీనికోసం ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. భూ భ్రమణం, చంద్ర భ్రమణం ఆధారంగా సూర్యుడి చుట్టూ తిరిగే కాలాన్ని ‘ఒక సంవత్సరం’ అని నిర్ధరించారు. రాశులు, ఋతువులు, ఆయనాలు... ఇవన్నీ ఒక ఆవృతంలో వస్తాయి. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. సూర్య గమనాన్ని బట్టి సౌరమానం, చంద్ర గమనాన్ని బట్టి చాంద్రమానం ఏర్పడ్డాయి. వీటి ఆధారంగానే జ్యోతిష శాస్త్రం ఆవిష్కృతమయింది. తద్వారా పంచాంగాలు రూపొందాయి.

తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరిస్తారు. ఉగాది (యుగాది)ని సృష్టి ఆరంభానికి ఎంచుకున్నాడని కమలాకరభట్టు తన ‘నిర్ణయ సింధు’ గ్రంథంలో స్పష్టం చేశాడు. సృష్టితో పాటే కాల విభజన కూడా బ్రహ్మ చేసినట్టు ఈ కింది శ్లోకం చెబుతోంది:


చైత్రే మాసి జగద్బ్రహ్మా ససర్జ ప్రథమేహని శుక్ల పక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి

‘ఉగ’ ఉంటే నక్షత్ర గమనం. ‘ఉగస్య ఆదిః ఉగాది’ అని పెద్దల వాక్కు. ఆ నక్షత్ర గమనం ఎంతో ప్రత్యేకమైనది. సంవత్సరారంభంలో ప్రథమ ఆయనమైన ఉత్తరాయణంలో ఋతువులకు రారాజైన వసంత ఋతువులో, మాసాలలో మహత్తరమైన మధుమాసం (చైత్రం)లో, పక్షాలలో వెలుగు ఏరోజుకారోజు విస్తరించే శుక్లపక్షంలో, తొలి నక్షత్రం అశ్విని నాడు, తొలి తిథి పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకోవడం అనూచానంగా వస్తోంది. ఉగాదికి ఇంతటి ప్రత్యేకత ఉంది. చాంద్రమానంలో అరవై సంవత్సరాలు ఉన్నాయి. ఇవే పునరావృతం అవుతూ ఉంటాయి. కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజును ఉగాదిగా వ్యవహరిస్తారు. కాగా, శాలివాహన చక్రవర్తి (క్రీస్తు శకం డెబ్భై తొమ్మిది) ఉగాది నాడే పట్టాభిషిక్తుడు అయ్యాడనీ, శాలివాహన శకం ఆరంభ దినాన్నే ఉగాదిగా జరుపుకొంటున్నామనీ కొందరు చరిత్రకారులు పేర్కొంటున్నారు. 

మహోన్నతమైన మానవ జన్మను భగవంతుడికి కైంకర్యం చేయాలి. ఆయనను పొందడానికి మనసా వాచా కర్మణా విధిని నిర్వర్తించాలి.ప్రతియేటా దానికి సంకల్పం చేసుకోవడానికి సదవకాశంగా అందివచ్చిన రోజు... ఉగాది!


ఉగాది నాడు ఏం చేయాలి?

ఉగాదిని అనుష్ఠించ డానికి కావలసిన శాస్త్ర విధిని మన పూర్వ ఋషులు నిర్ణయించారు. ఆ విధి విధానాలను కూడా స్పష్టంగా తెలియజేశారు. 

విధిగా ఆచరించవలసినవి: 

అభ్యంగన స్నానం, నూతన వస్త్ర ధారణ, ఇష్టదేవతా పూజ, షడ్రుచుల ఉగాది పచ్చడి నివేదన, ఇంటి పెద్దల ఆశీస్సులు పొందడం, నింబ కుసుమ (వేప పువ్వు) భక్షణం, పంచాంగ శ్రవణం. ఉగాదికి ముందురోజునే ఇల్లు, వాకిళ్ళు కడగాలి. గుమ్మాలకు పసుపు, కుంకుమలు పెట్టాలి. ద్వారాలకు మామిడి ఆకులు, వేప మండలు తోరణాలుగా కట్టాలి. పూజామందిరాన్ని ఉగాది పూజకు సిద్ధం చేసుకోవాలి.  ఉగాది నాడు బ్రహ్మీ ముహూర్తాన నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ఇంటిలో పెద్దల ఆశీస్సులు తీసుకొని, తలపై నువ్వుల నూనె పెట్టించుకొని, స్నానం ఆచరించడం శుభప్రదం. అనంతరం నూతన వస్త్రాలు ధరించాలి.  పూజామందిరంలో ఇష్టదైవాన్నీ, గణపతినీ అర్చించి, షోడశోపచారాలతో పూజించి, ధూప, దీప, నివేదనలూ, హారతి సమర్పించాలి. 




పంచాంగ శ్రవణం దేని కోసం?

ఉగాది విధి విధానాలలో పంచాంగ శ్రవణం అతి ముఖ్యమైనది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చదవడమో లేక ఆలయాల్లో పండితులు చదివేది శ్రద్ధగా వినడమో చేయాలి. ‘పంచాంగం’ అంటే తిథి, వార, నక్షత్ర, కరణ, యోగాలనే అయిదు అంగాలతో కూడుకొని ఉన్నది. ప్రతి వ్యక్తి మీదా ఆయా గ్రహాలూ, నక్షత్రాలూ కలిగించే ఫలితాలు దీని ద్వారా తెలుస్తాయి. ఇవన్నీ భగవంతుడి ఆధీనంలో ఉంటాయి. కనుక ఈశ్వరానుగ్రహం కోరుతూ పంచాంగ శ్రవణం చేసిన వారికి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్యం, సంపద, ఆయువు, విజయం, పాప విముక్తి లాంటి విషయాలు పంచాంగం ద్వారా తెలుస్తాయి. ఒకవేళ ఏవైనా దుష్పరిణామాలు పొంచి ఉన్నాయని తెలిస్తే, వాటి నుంచి రక్షణ పొందడానికి పరమ శక్తి సంపన్నుడయిన పరమేశ్వరుణ్ణి సభక్తికంగా ఆశ్రయించాలి. తద్వారా వాటిని తొలగించుకోవచ్చు. 



ఉగాది పచ్చడే ఎందుకు?

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున అంటే, సంవత్సరం తొలి రోజున దైవానికి చేసే నివేదనలో విధిగా షడ్రుచుల ఉగాది పచ్చడిని ఉంచాలి. ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో పూర్వులే వివరించారు:

‘కించ యద్వర్షాదౌ నింబ కుసుమం - శర్కరామ్ల ఘృతైర్యుతం

భక్షతం పూర్వ యేమేస్యాత్‌ - తద్‌వర్షం సౌఖ్యదాయకం’ అని. కొత్త సంవత్సరం తొలి రోజున వేప పూవు, బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడికాయ ముక్కలు, అవు నెయ్యి, మిరియాల పొడి, రుచికోసం లవణం కలిపి తయారు చేసిన షడ్రుచుల పచ్చడిని ప్రసాదంగా పరగడుపున భుజించాలి. ఈ పచ్చడి ఆయుర్వేద శాస్త్రరీత్యా ఎంతో విలువైనది. సంవత్సరం పాటు వాత, పిత్త, కఫ రోగాలను నివారించడమే కాకుండా శరీర ఆరోగ్యాన్ని కుదుటపరుస్తుందని పెద్దలు చెప్పారు.


ఎ. సీతారామారావు

Updated Date - 2020-03-20T06:02:31+05:30 IST