Abn logo
Oct 23 2021 @ 15:31PM

కశ్మీర్ పండిట్లు తిరిగివచ్చే పరిస్థితులు లేవు: ఫరూక్ అబ్దుల్లా

జమ్మూ: కశ్మీర్ లోయలో పరిస్థితులు కశ్మీర్ పండిట్లు తిరిగి వచ్చేందుకు అనుకూలంగా లేవని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మతం పేరుతో దేశాన్ని విడగొడుతోందని ఆరోపించారు. టెర్రరిస్టుల కాల్పుల్లో హిందువులే కాదు, ముస్లింలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని రాజౌరి జిల్లాలో శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. 370వ అధికరణను రద్దు చేసేంత వరకూ లోయలో శాంతి నెలకొనదని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం జమ్మూకశ్మీర్‌లో అడుగుపెట్టిన సమయంలోనే ఫరూక్ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

''ఆర్టికల్-370 అధికరణ రద్దు తర్వాత ఉగ్రవాద నిర్మూలన జరిగిందంటూ చెబుతున్న వారికి ఇటీవల లోయలో జరుగుతున్న ఉగ్రదాడులు కనువిప్పులు కావాలి'' అని ఫరూక్ వ్యాఖ్యానించారు. 370 అధికరణను పునరుద్ధరించేంత వరకూ లోయలో శాంతిని తిరిగి నెలకొల్పడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. అమిత్‌షా పర్యటన సందర్భంగా అమిత్‌షాతో సమావేశం ఉంటుందా అని అడిగినప్పుడు....''ప్రభుత్వం నన్ను సంప్రదించింది. అమిత్‌షా నన్ను కలుసుకోవాలని అనుకున్నారు. నేను తిరస్కరించాను. ముందుగానే రాజౌరి, పూంచ్‌లలో నా పర్యటన ఖరారైంది'' అని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption