ఆ ‘డు’ పేరు మరోసారి చెబుతా

ABN , First Publish Date - 2020-02-07T21:03:12+05:30 IST

నటుడిగా ఉండడానికి ఇష్టపడతారా? మిమిక్రీ కళాకారుడిగా ఉండడానికా? రెండు కళ్లలో ఏదంటే ఏమని చెబుతాం. స్టేజ్‌ షోలో అయితే వెంటనే రెస్పాన్స్‌ ఉంటుంది.

ఆ ‘డు’ పేరు మరోసారి చెబుతా

ఎన్నో కష్టాలు పడ్డాను... తిండిలేని రోజులెన్నో గడిపాను

మాటతో పాటు బాడీ లాంగ్వేజీనీ అనుకరిస్తా

పరిశ్రమలో వివక్ష లేదనుకుంటున్నాను

7-2-2011న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి


నటుడిగా ఉండడానికి ఇష్టపడతారా? మిమిక్రీ కళాకారుడిగా ఉండడానికా?

రెండు కళ్లలో ఏదంటే ఏమని చెబుతాం. స్టేజ్‌ షోలో అయితే వెంటనే రెస్పాన్స్‌ ఉంటుంది. అప్పుడు ఆనందంగా ఉంటుంది. అదే సినిమాలో అయితే ప్రేక్షకుల మధ్య కూర్చొని చూసే అవకాశం తక్కువ. నేను అమెరికాలో ఎక్కువ ప్రదర్శనలు ఇస్తుండటంతో ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు శివారెడ్డి అమెరికాలోనే ఉంటాడు అని ప్రచారం చేశారు. మిమిక్రీ కారణంగా సినిమా అవకాశాలు చాలా తగ్గాయి. మొదట్లో నాపై వ్యతిరేక ప్రచారం చేసినప్పుడు చాలా బాధ పడ్డాను. ఏడ్చాను కూడా. ఆయన కాళ్లపై పడి నేనేం తప్పు చేశానని అడిగాను.


ఆయన పేరేంటి? సినీ అవకాశాలు తగ్గడంలో ప్రతిబంధకాలున్నాయా?

ఎందుకు లెండి... ఇప్పటికే సినిమాలు తగ్గాయి. పూర్తిగా అవకాశాలు పోతాయి. అవకాశం వచ్చినప్పుడు చెబుతాను. అవును. కొందరు అడ్డుకుంటున్నారు. మిమిక్రీ కూడా ఒక ప్రతిబంధకమే. నేను కష్టపడి పైకి వచ్చాను.


మీరు హీరో ఎందుకు కాలేకపోతున్నారు?

మొదటి సినిమా పిట్టలదొర. ఆ తర్వాత యాదిరెడ్డి గారు నాకు మూడు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నాకు అమ్మాయి కోసం చిత్రంలో ఓ హీరోగా చేశాను. కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. అయితే నా గ్రాఫ్‌ మాత్రం కిందకు పడిపోయింది. నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్లిపోతాను.


మిమ్మల్ని తొక్కేస్తున్నదెవరు?

తొక్కేస్తున్నది ఒక్కరే. మంచి క్యారెక్టర్లు రాకుండా మాత్రం అడ్డుకుంటున్నాడు. అదీ తన కాంబినేషన్‌లో వచ్చినప్పుడు. అయితే, ఎవరు ఎలాంటి వారో అందరికీ అర్థం అవుతుంది అని భావిస్తున్నాను. నేను కాకా పట్టను. ఆ విద్య నాకు అబ్బలేదు. కృషినే నమ్ముకున్నాను.


మిమిక్రీ ఆర్టిస్ట్‌ కావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?

చిన్నప్పుడు డ్రిల్‌ పీరియడ్‌లో ఉన్నప్పుడు జంతువులు తిరిగేవి. వాటి అరుపులు అనుకరించేవాడిని. కుక్క అరిస్తే, ఏడిస్తే ఎలా ఉంటుందో గమనించి, నేను అలాగే అనేవాడిని. అయితే, ఇదంతా నాకు మిమిక్రీ అని తెలియదు. ఓసారి మా స్కూల్‌ వార్షికోత్సవానికి ఓ మిమిక్రీ కళాకారుడు వచ్చినప్పుడు, మిమిక్రీ నేర్చుకోవాలనే ఆలోచన వచ్చింది.


అమ్మతో మీకు ఎందుకంత అనుబంధం?

ఆమె ఎంత కష్టపడి పెంచిందో తెలుసు. మాకు అన్నం పెట్టడానికి ఎంతో కష్టపడింది. తినడానికి కూడా ఉండేది కాదు. అవన్నీ నాలో నాటుకుపోయాయి. అందుకే ఎన్టీపీసీలో ఆఫీస్‌ బాయ్‌గా చేరాను. ఆ తర్వాత అదే ఎన్టీపీసీలో ఓ ప్రదర్శన ఇవ్వడం నాకు గర్వమనిపించింది.


మీ సక్సెస్‌కి కారణం? మీ ప్రత్యేకతలు ఏంటి?

నాకు డాన్స్‌, నటన, మిమిక్రీ వచ్చు. అవే కారణం కావచ్చు. ఎవరినైనా అనుకరించినప్పుడు వారి బాడీ లాంగ్వేజ్‌ను కూడా అనుకరిస్తాను. అది నా ప్రత్యేకత. (ఆర్కే: మీలో ఇన్ని కళలు ఉన్నా సినీ పరిశ్రమ మాత్రం గుర్తించడం లేదా?) అలా అనేం లేదు. అయితే, పెద్ద దర్శకులెవరైనా నాకు ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. (ఆర్కే: తెలంగాణకు చెందిన వారనే అవకాశం ఇవ్వడం లేదని ఒక్కసారి చెప్పండి. అవకాశాలు వస్తాయేమో?) తెలంగాణ వాడిననే వివక్ష చూపిస్తున్నారని అనుకోవడం లేదు.


మిమిక్రీ కళాకారులంతా తెలంగాణ నుంచే ఎక్కువ మంది ఉన్నారు కదా?

ఎందుకో తెలియదు. మరి సినిమాల్లో నటులు ఆంధ్రావారే ఉన్నారు కదా... ఈసారి మళ్లీ మీరు పిలిచినప్పుడు ఇక్కడే మిమిక్రీ కళాకారులు ఎక్కువగా ఉండడానికి కారణం చెబుతాను. అలాగే, ఆ వ్యక్తి గురించి కూడా చెబుతాను.

 

Updated Date - 2020-02-07T21:03:12+05:30 IST