బ్రహ్మంగారి మఠాధిపతి శివైక్యం

ABN , First Publish Date - 2021-05-09T08:53:47+05:30 IST

కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం 11వ మఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి(75) శివైక్యం చెందారు. 7వ తరానికి చెందిన వేంకటేశ్వరస్వామి కొంతకాలంగా అనారోగ్యంతో

బ్రహ్మంగారి మఠాధిపతి శివైక్యం

అనారోగ్యంతో పరమపదించిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి

11వ మఠాధిపతిగా 52 ఏళ్ల సుదీర్ఘ పాలన 


బ్రహ్మంగారిమఠం(కడప), మే 8: కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం 11వ మఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి(75) శివైక్యం చెందారు. 7వ తరానికి చెందిన వేంకటేశ్వరస్వామి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి శనివారం మధ్యాహ్నం పరమపదించారు. 11వ మఠాధిపతిగా 52 సంవత్సరాలుగా బ్రహ్మంగారి మఠాన్ని అభివృద్ధిబాటలో నడిపించారు. ఉభయ తెలుగు రాష్ర్టాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకలోని భక్తులకు స్వామివారి భూత, భవిష్యత్తు కాలజ్ఞానం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. మఠానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించారు. మఠంలో ప్రతి శివరాత్రినాడు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించేవారు. వైశాఖ శుద్ధ దశమిన వీరబ్రహ్మేంద్రస్వామి జీవసమాధి అయిన సందర్భంగా వారంపాటు మఠంలో ఉత్సవాలను నిర్వహించేవారు. కాలజ్ఞానాన్ని పుస్తకాలు, సీడీల రూపంలో ప్రజలకు చేరువ చేశారు.


త్రిభాషల్లో ప్రావీణ్యం

వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి 1946, జూన్‌ 21న భాగీరథమ్మ, శ్రీనివాస స్వామికి జన్మించారు. వీరి తండ్రి 1932 నుంచి 1969 వరకు మఠాధిపతిగా ఉన్నారు. కాలజ్ఞానంలోని ప్రథమ, చతుర్థ అశ్వాశాలలో ప్రాశస్త్యమైన ‘వీరభోగ వసంతరాయ’ అనే పదంలో వారి తండ్రి శ్రీనివాసులస్వామి పేరు చేర్చి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి అని పేరు పెట్టారు. అప్పటి మఠం మేనేజర్‌ బండికట్ల వేంకటేశ్వరశాస్త్రి వద్ద వేదం నేర్చుకున్నారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం సంపాయించారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేశారు. వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి తన 23వ ఏటనే 1969 ఆగస్టు 10న 11వ మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరుకు చెందిన చంద్రావతమ్మను వివాహం చేసుకున్నారు. ఆమె ద్వారా నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు కలిగారు. ఆమె మరణం తర్వాత మారుతీ మహాలక్ష్మమ్మను 2006 ఫిబ్రవరి 19న వివాహం చేసుకున్నారు. ఈమె ద్వారా ఇద్దరు కుమారులు జన్మించారు.  


అంతిమ సంస్కారాలు పూర్తి

వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి పార్థివదేహానికి శనివారం సాయంత్రం మఠం ప్రాంగణంలో అంతిమసంస్కారాలు నిర్వహించినట్టు మఠం మేనేజర్‌ ఎన్‌.ఈశ్వరయ్య ఆచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, శిష్యులు పాల్గొన్నట్టు పేర్కొన్నారు. 


ఎన్టీఆర్‌తో పరిచయం

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌తో మఠాధిపతికి ఎంతో పరిచయం ఉంది. 1981లో ఎన్టీఆర్‌ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత ఇతివృత్తంతో చలన చిత్రాన్ని రూపొందించినప్పుడు మఠంలో 10-12 రోజులు గడిపారు. వీరికి వసతి ఏర్పాటు చేయడంతో పాటు కొంత సమాచారాన్ని మఠాధిపతి వేంకటేశ్వరస్వామి అందజేశారు.

Updated Date - 2021-05-09T08:53:47+05:30 IST