Abn logo
Mar 9 2020 @ 02:10AM

శివకరుణ

క్షణానికి కోటివీణలు పుప్పించే బ్రహ్మసాని, రసపనసవనగగనం

యేడువొందలకోట్ల రక్తసముద్రాల బొమ్మలగాంధారివాన, సహస్ర కంచుశిరసుల పెద్దపల్లియీతామాత

ప్రేమపాశాల పంచప్రాణాల పేగుబొడ్డుమల్లెల భువనతీర్థం, క్షమగుండెల తంగేడుతిర్నాల

పరలోకరక్షకుడు నరికిన శోకభైరవ సతీదేవి ఖండితకామాఖ్యకటివలయం

తల్లీ, సృజనరామా! రాజ్యమొదిలి అరణ్యాలకు యెట్లబోవాలె?

వెన్నెముకజాతుల, నరజీవనాడుల, సస్సకలస్వప్నప్రసవాల ఆదిభగవంతమేనా శిల్పమంటే?

త్రికాలజ్ఞానగురుడి నాట్యనయనం యెక్కడి అంధనర్తనశాలలో మధుశయనిస్తున్నది? 

భూలోకకంఠాన్ని చారిచేరంపంతో ఛేదించెయ్యనా? 


ధర్మలోకపు మర్మాంగములన్నింటినీ మహాయిష్టంగాభుజిస్తూ మహానుభావుల్నిచేస్తున్నదెవరో?

నరబలిభస్మమా, రెండుకాళ్ళపులులసింధువుల్లో బలికలిసిపొలిమాంసమయినవా?

స్వీయబలి... పరపొలి...

శైలీశిల్పఛిద్రయోనిలో నిద్రిస్తున్నాము, నివసిస్తున్నాము

ఖండిత పురుషాంగలింగ ఖీమాపదచిత్రములన్నీ మనజాతివే

జనరాజ్యరక్షకన్యాయవ్యాపారవినోదఅంతర్జాలవార్తాభక్తహంతకమాఫీయాబృందనాయకుణ్ణి నేనే

తండ్రీ, సృజనిఅల్లా! యెందుకోసం లొంగిపోను? 

శప్తభూచరితల, సర్పనాగరికతల, వంచితజనగణాల ప్రప్రథమవిప్లవం శైలి కాదా?

అనంతానంత అదృశ్యవిశ్వవూహలజిహ్వ యే సోడోమిజంతుసంభోగంలో వున్నది? 

ముక్కోటి దేవుళ్ళను సజీవఖననం చెయ్యనా? 


మనిషి అంతర్‌బాహ్య శైలీశిల్పాల పునరపిజననం పునరపివృద్ధి పునరపిమరణమే త్రియుగవిశ్వపురాణం

నిశ్శైలీలించుడి రాయితగిలి భస్మమయిన శబ్దబీఫ్‌ప్రియుణ్ణి, ధరణిదుఃఖవాక్యవడ్రంగివీనస్‌ను

నిశ్శిల్పభక్తభౌజనుల తూటాలుతగిలి చితిశాలచేరిన బహురూపధిక్కార దృశ్యవిన్యాస భరతమునిని

జిందగీ, కళ --- మూర్త అమూర్తాల అర్ధనారీశ్వరమేనా?

జననీ, సృజనైకక్రీస్తూ! ఎవరికోసం రక్తంచిమ్మను?

అధోజగత్‌ రేణుకరుద్రఫణివదనం యే మతకులపంచభూతాల్లో కలగలిసి మాయమయ్యింది?

ఉచ్ఛ్వాసనిశ్వాసలకు నిప్పంటించుకోనా?


నిస్సిగ్గు నరమానవ పెనుగాయపుక్షతులారా యేడుపుఊళలాపండి

సమాధినుంచిలేచివస్తున్నాను వేచివుండండి

ఇరవయ్యొకటోశతాబ్దపు నవనవీనసాయుధకాలజ్ఞానిని

నిశ్శరపు శోకవ్యథవ్యాఘ్రబోనములారా ఆపండి దేహాత్మలదహనాలను

చివరితాత్వికుడి, సిద్ధాంతుడితలలునరికి పంచపంచేద్రియాల ‘వీరభద్రుడి మహాచర్యతాంబాళం’లో తెస్తున్నాను

రాగరసయెడారిజాతి చర్మాలొలిచి సంఘవిప్లవ రుంజమృదంగాలుచేసుకొని వస్తున్నాను

నిర్‌క్రోథ భూస్థాపిత అవర్ణ సవర్ణ సకల అస్థిపంజరాల్లారా శత్రుబంధువులను మటాష్చేద్దాం రండి

పుష్పజలపాతాలై రండి, శిలువలుమోసుకొని రండి, ఖడ్గగండభేరుండాలై రండి

చాతుర్‌వర్ణ్యబానిససాధకుల, మహాకుబేరుల సంహారబుద్ధులై రండి


ఓం శ్లీం పశు హోం ఫట్‌ ఫట్‌ ఫట్‌

యిప్పుడిక ప్రజాపాశుపతాస్త్రశిల్పశైలీవిన్యాసంవినా మార్గం లేదు మార్గం లేదు

శివకరుణ శివకరుణ శివకరుణ 

శ్రీనివాస్‌ దెంచనాల 

98483 26517


Advertisement
Advertisement
Advertisement