కేటీఆర్‌ సారూ.. ఆదుకోరూ..

ABN , First Publish Date - 2020-06-03T10:58:06+05:30 IST

కూలీ పనులు చేసుకుని బతికే తాము లాక్‌డౌన్‌తో పనుల్లేక కడుపు మాడ్చుకుని ఉంటున్నాం. ప్రభుత్వ సహాయం లేక

కేటీఆర్‌ సారూ.. ఆదుకోరూ..

శివరాంపల్లి వీకర్‌సెక్షన్‌ కాలనీ పేదల వేడుకోలు


రాజేంద్రనగర్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): కూలీ పనులు చేసుకుని బతికే తాము లాక్‌డౌన్‌తో పనుల్లేక కడుపు మాడ్చుకుని ఉంటున్నాం. ప్రభుత్వ సహాయం లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదుకోవాలని రాజేంద్రనగర్‌ సర్కిల్‌ శివరాంపల్లి వీకర్‌ సెక్షన్‌ కాలనీలోని సుమారు 25 కుటుంబాలకు చెందిన పేదలు వేడుకుంటున్నారు. పేదల ఇళ్లకు వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి వారు తమ బాధలు చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో అందరూ పేదలే నివసిస్తున్నారని పనుల్లేక పన్తులుంటున్నారని, మంత్రి కేటీఆర్‌ ఆదుకోవాలని స్థానికుడు కృష్ణ విజ్ఞప్తి చేశాడు.  


పస్తులుంటున్నాం 

నా భర్త 21 నెలల క్రితం చనిపోయాడు. బస్తీలో చందాలు వేసుకుని పెద్ద కుమారై వివాహం చేశారు. అల్లుడు అమ్మాయిని సరిగా చూడక వదిలిపెట్టాడు. ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలతో ఇబ్బంది పడుతున్నా. నేను షాదీఖానాల్లో లైట్లు పట్టుకోవడానికి వెళ్లేదాన్ని. ప్రస్తుతం ఆ పనీ లేదు. ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాం.               

- యాదమ్మ


పింఛన్‌ కూడా రావడం లేదు

నా భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. కొన్ని రోజులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేశాను. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నా. నా భర్త మరణించాడని దరఖాస్తు చేసుకున్నా పింఛన్‌ ఇప్పటివరకూ రాలేదు. ప్రభుత్వ సాయమూ అందలేదు.                               

 - రాజమణి 


ఆటో ట్రాలీ నడవక ఇబ్బందులు 

 భర్త ఆటో ట్రాలీ నడిపితే వచ్చే డబ్బుతో కుటుంబ పోషణ జరిగేది. అద్దె ఇంట్లో ఉంటున్నాం. తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. 

  - సురేఖ


లాక్‌డౌన్‌తో పోషణ భారంగా మారింది

నాన్నకు కాలు విరిగింది. అమ్మ అమరావతి ఫ్యాక్టరీలో పనికి వెళ్లేది. లాక్‌డౌన్‌తో కుటుంబ పోషణ భారంగా మారింది. ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి.                          



Updated Date - 2020-06-03T10:58:06+05:30 IST