రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

ABN , First Publish Date - 2020-05-22T10:05:21+05:30 IST

రాష్ట్రంలో గురువారం జరిగినవేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు.

రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

పది అడుగుల దూరంలో పడిన తల


అల్లాదుర్గం/చిట్యాల రూరల్‌/ రఘునాథ్‌పల్లి, మే 21: రాష్ట్రంలో గురువారం జరిగినవేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. నల్గొండ జిల్లాలో ముగ్గురు, మెదక్‌లో ఒకరు, రఘునాథ్‌పల్లిలో ఇద్దరు మరణించిన వారిలో ఉన్నారు. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్‌ శివారులోని 161వ జాతీయ రహదారి సర్వీస్‌ రోడ్డులో బైకుపై వెళ్తున్న మన్నె దుర్గయ్య(45)ను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. దీంతో దుర్గయ్య తల తెగి పది అడుగుల దూరంలో పడింది. దుర్గయ్య రాంపూర్‌లోని ఓ రైస్‌ మిల్‌లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. తన నివాసమైన ఉత్తులూరు నుంచి ఎప్పటి లాగే గురువారం ద్విచక్రవాహనంపై వస్తున్న క్రమంలో బైక్‌ను డోజర్‌ ఢీ కొట్టింది.నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామశివారులో  హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై  జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.  తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన దయ్యాల లక్ష్మి, ఆమె కుమారుడు దయ్యాల రాంబాబు హైదరాబాద్‌కు కారులో వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.


అదే గ్రామానికి చెందిన గీసాల శ్రీనివాస్‌(48), ఆయన భార్య లక్ష్మి(40), జగ్గంపేట మండలం గొర్రుపూడికి చెందిన కండవెల్లి లక్ష్మీచందన(18), ఆమె సోదరుడు వీరబాబు,  లక్ష్మి కుమార్తె పిల్లలు గుత్తుల అనిల్‌కుమార్‌, గుత్తుల శృతిప్రియలు కూడా వారితో కలిసి బుధవారం అర్ధరాత్రి కొత్తపల్లి నుంచి కారులో బయలుదేరారు. కారు డ్రైవ్‌ చేస్తున్న రాంబాబు చిట్యాల మండలం వట్టిమర్తి శివారులో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని అతివేగంతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారులో ముందు కూర్చున్న శ్రీనివాస్‌, వెనుక ఉన్న ఆయన భార్య లక్ష్మి, కండవెల్లి లక్ష్మీచందన అక్కడికక్కడే మృతిచెందారు. దయ్యాల లక్ష్మికి, రాంబాబుకు గాయాలయ్యాయి. కారు వెనుక వరుసలో కూర్చున్న ముగ్గురు చిన్నారులకు ఎలాంటి గాయాలు కాకుండా ప్రమా దం నుంచి బయటపడ్డారు.


  జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల సమీపంలో వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి పైజరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని భీమారానికి చెందిన చింతల రమే్‌షబాబు (48), జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దతండాకు చెందిన బానోతు సురేష్‌ (25)  ఇద్దరూ కలిసి గురువారం ఉదయం వ్యాపార రీత్యా హైదరాబాద్‌కు  బయలుదేరారు.  కోమల్ల లోతువాగు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో  ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ  మృతి చెందారు.

Updated Date - 2020-05-22T10:05:21+05:30 IST