వేర్వేరు హత్య కేసుల్లో ఆరుగురి అరెస్టు

ABN , First Publish Date - 2020-02-02T05:44:46+05:30 IST

నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన హత్య కేసుల్లో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ ఆర్థిక వివాదాల్లో సవతి తల్లిని హత్య చేసిన కుమారుడిని,

వేర్వేరు హత్య కేసుల్లో ఆరుగురి అరెస్టు

రెండు ఆటోలు, కత్తులు స్వాధీనం

నేరేడ్‌మేట్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన హత్య కేసుల్లో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ ఆర్థిక వివాదాల్లో సవతి తల్లిని హత్య చేసిన కుమారుడిని, అప్పు తీసుకొని ఇవ్వడం లేదని స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తిని, ఆటో డ్రైవర్‌ను హతమార్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నేరేడ్‌మెట్‌ వినాయకనగర్‌లో నివసిస్తున్న యాదగిరి(60) రైల్వే ఉద్యోగి. గత ఏడాది డిసెంబర్‌లో పదవీ విరమణ చేశాడు. యాదగిరి మొదటి భార్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విజయవాడలో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు కృష్ణప్రసాద్‌యాదవ్‌ వినాయకనగర్‌లో పాల వ్యాపారం చేస్తున్నాడు. మొదటి భార్య రెండేళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి యాదగిరి తన తల్లితో కలిసి చిన్న కుమారుడి వద్ద ఉంటున్నారు.

అతడు సరిగా చూడకపోవడంతో రెండో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కుటుంబ సభ్యులకు చెప్పి గత ఏడాది నవంబర్‌లో శంషాబాద్‌కు చెందిన లలిత(44)ను ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం చిన్న కొడుకుతోనే కలిసి వినాయకనగర్‌లో ఉంటున్నాడు. లలితను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కుటుంబంలో ఆర్థిక వివాదాల వల్ల కలతలు మొదలయ్యాయి. దీంతో యాదగిరి దీన్‌దయాళ్‌నగర్‌లోని తన సొంతింటికి కాపురం మార్చాడు. పదవీ విరమణ బెనిఫిట్స్‌ రూ. 23 లక్షలు వచ్చాయి. డబ్బుల విషయంలో కుటుంబ వివాదాలు మొదలయ్యాయి.

 తండ్రి లేని సమయంలో కృష్ణప్రసాద్‌ సవతి తల్లిని చంపాలనుకున్నాడు. తన తండ్రి ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లాడని తెలియగానే గత మంగళవారం దుడ్డు కర్రతో లలితను కొట్టాడు. ఆమె కేకలు వేస్తూ రోడ్డుపై పరుగెత్తగా వెంబడించి కొట్టాడు. నాయనమ్మ కొట్టొద్దని బతిమాలినా విడిచిపెట్టలేదు. లలిత భయంతో ప్రసన్న నిలయం అపార్ట్‌మెంట్‌ ఆవరణలోకి వెళ్లింది. అందరూ చూస్తుండగానే ఆమె తలపై కొట్టి చంపాడు. కర్రను అక్కడే వదిలేసి ద్విచక్రవాహనంపై పారిపోయాడు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో ఘటన దృశ్యాలు నమోదయ్యాయి. ఫుటేజీల ఆధారంగా నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించామని సీఐ నరసింహస్వామి తెలిపారు.

Updated Date - 2020-02-02T05:44:46+05:30 IST