నిద్రలోనే.. శాశ్వత నిద్ర!

ABN , First Publish Date - 2021-07-31T08:40:44+05:30 IST

గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకేవానిదిబ్బ సమీపంలోని బెయిలీ ఆక్వా ఫారమ్స్‌ షెడ్డులో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది

నిద్రలోనే.. శాశ్వత నిద్ర!

ఆరుగురు వలస కూలీలు సజీవ దహనం

రొయ్యల చెరువు వద్ద ప్రమాదం

బాధితులంతా ఒడిసావాసులే 


రేపల్లె, జూలై 30: గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకేవానిదిబ్బ సమీపంలోని బెయిలీ ఆక్వా ఫారమ్స్‌ షెడ్డులో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ఒడిసా వలస కూలీలు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలివీ.. బెయిలీ ఆక్వా ఫారమ్స్‌.. లంకేవానిదిబ్బ వద్ద సుమారు వంద ఎకరాల్లో రొయ్యల చెరువులు నిర్వహిస్తోంది. ఇక్కడ పనిచేసేందుకు ఒడిసాలోని రాయగడ జిల్లా పుల్లపుటి, జంపాపూర్‌కు చెందిన 25 మంది కూలీలు వలస వచ్చారు. వారి నివాసం కోసం 8 గదుల రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. గురువారం పగలంతా పనులు చేసుకుని రాత్రి నిద్రిస్తుండగా ఆర్థరాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. వెనువెంటనే మంటలు చెలరేగటంతో గదిలో నిద్రిస్తున్న 10 మందిలో ఆరుగురు సజీవ దహనమయ్యారు.  మృతులలో  రామూర్తి సుబాల్‌, పండబ్‌ సుబాల్‌ (22), మనోజ్‌సుబాల్‌(21), కరుణాకరన్‌ సుబాల్‌ (21), నవీన్‌సుబాల్‌ (23), మహిర్‌ సుబాల్‌ (23) ఉన్నారు.  ఘటనపై సాంకేతిక దర్యాప్తు  నిర్వహిస్తున్నట్టు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారు. కాగా, విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతుండగా..  విద్యుత్‌ శాఖ అధికారులు  షార్ట్‌సర్య్కూట్‌ కారణం కాదంటున్నారు.  

Updated Date - 2021-07-31T08:40:44+05:30 IST