ఆ ఆఫ్ఘాన్ సైనికులకు 6నెలల e-Visa మంజూరు చేసిన India

ABN , First Publish Date - 2021-09-29T17:26:57+05:30 IST

భారత్‌లోని వివిధ మిలిటరీ అకాడమీలలో ట్రైనింగ్‌ పొందిన సుమారు 180 మంది ఆఫ్ఘానిస్థాన్ సైనికులకు తాజాగా భారత ప్రభుత్వం 6 నెలల వ్యవధితో ఈ-వీసాలు మంజూరు చేసింది.

ఆ ఆఫ్ఘాన్ సైనికులకు 6నెలల e-Visa మంజూరు చేసిన India

న్యూఢిల్లీ: భారత్‌లోని వివిధ మిలిటరీ అకాడమీలలో ట్రైనింగ్‌ పొందిన సుమారు 180 మంది ఆఫ్ఘానిస్థాన్ సైనికులకు తాజాగా భారత ప్రభుత్వం 6 నెలల వ్యవధితో ఈ-వీసాలు మంజూరు చేసింది. ఇటీవల ఈ సైనికుల ట్రైనింగ్ కోర్సులు పూర్తి కావడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, వీరిలో 140 మంది వరకు కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ దేశాలకు వెళ్లేందుకు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. కాగా, ట్రైనింగ్ పూర్తైన తర్వాత ఈ ఆరు నెలల్లో వారు తాము ఎక్కడికి వెళ్లాలనేదానిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు ఈ అవకాశం ఇచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇక మిగిలిన వారిలో చాలా మంది ఇండియాలోనే ఉండేందుకు మొగ్గచూపుతున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే.. ఇటీవల తాలిబన్లు ఆఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకోవడంతో ఈ సైనికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 


ఇప్పటికే ఆ దేశ ఆర్మీ తాలిబన్లకు లొంగిపోయింది. దాంతో మనదగ్గర ట్రైనింగ్ పొందిన ఈ 180 మంది సైనికులు తిరిగి వారి దేశానికి వెళ్లలేని పరిస్థితి. వీరు ట్రైనింగ్ మధ్యలో ఉండగానే ఆఫ్ఘాన్‌లో సంక్షోభం మొదలైంది. కానీ, భారత్ మానవత దృక్పథంతో 180 మంది సైనికులను వారి కోర్సులు పూర్తి చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. తాజాగా వారి కోర్సులు పూర్తి కావడంతో ఇండియా నుంచి వెళ్లిపోవాల్సింది. కానీ, ఇప్పుడు ఆఫ్ఘాన్.. తాలిబన్ల అధీనంలోకి వెళ్లిపోవడంతో అక్కడికి వెళ్లలేరు. దాంతో ఎక్కడికి వెళ్లాల్లో తగిన నిర్ణయం తీసుకునేందుకు ఆరు నెలల వ్యవధితో వారికి ఈ-వీసాలు మంజూరు చేసింది. భారత్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ)-డెహ్రాడూన్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)-చెన్నై, నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ)-ఖడక్వాస్లా(పుణె)లో వీరు ట్రైనింగ్ అయ్యారు. వీరి ట్రైనింగ్‌కు అయిన ఖర్చులను భారతే భరించింది. కానీ, ప్రస్తుతం ఆఫ్ఘాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఈ 180 మంది సోల్జర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  

Updated Date - 2021-09-29T17:26:57+05:30 IST