పోలీసులపై దగ్గి.. కరోనా సోకిందంటూ బెదిరించడంతో.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-04-02T21:37:32+05:30 IST

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నాయి. ఆంక్షలు విధించేది ప్రభుత్వమైనప్పటికి.. వాటిని అమలు చేసేది మాత్రం పోలీసు

పోలీసులపై దగ్గి.. కరోనా సోకిందంటూ బెదిరించడంతో.. అమెరికాలో..

నెవార్క్: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నాయి. ఆంక్షలు విధించేది ప్రభుత్వమైనప్పటికి.. వాటిని అమలు చేసేది మాత్రం పోలీసు అధికారులనే చెప్పాలి. అయితే చాలా దేశాల్లో కరోనా పేరు చెప్పి పోలీసు అధికారులను అనేక మంది బెదిరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల ఫ్లోరిడాలో ఓ వ్యక్తి కారులో వేగంగా వెళ్తోంటే.. పోలీసు అధికారి అతడిని ఆపారు. ఇదే సమయంలో ఆ వ్యక్తి పోలీసుపై దగ్గి తనకు కరోనా సోకిందంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో పోలీసు అధికారి అతడిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. న్యూజెర్సీలో ఇప్పటివరకు ఇలాంటి కేసుల్లో ఆరుగురు ఆకతాయిలను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. వీరందరూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. కరోనా సోకిందంటూ బెదిరించారని పోలీసులు చెబుతున్నారు. కాగా.. వీరిలో నలుగురిపై ఫోర్త్ డిగ్రీ దాడి కింద, మిగతా ఇద్దరిపై సెకండ్ డిగ్రీ దాడి కింద కేసు నమోదు చేశామన్నారు.


కాగా.. ఫోర్త్ డిగ్రీ దాడి కింద అరెస్ట్ అయిన వారికి పదేళ్ల జైలు శిక్ష, లక్షా 50 వేల డాలర్ల(రూ. కోటి 14 లక్షలు) జరిమానా పడే అవకాశముంది. అదే విధంగా సెకండ్ డిగ్రీ దాడి కింద అరెస్ట్ అయిన వారికి 18 నెలల శిక్ష, పది వేల డాలర్ల(రూ. 7 లక్షల 61 వేలు) జరిమానా పడే అవకాశముంది. ప్రజల కోసం కష్టపడే పోలీసు అధికారులపై ఈ విధంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదంటూ పైఅధికారులు హెచ్చరిస్తున్నారు. ఇకపై పోలీసులతో ఈ విధంగా ప్రవర్తించే ముందు జైలుశిక్షను కూడా గుర్తుచేసుకోవాలన్నారు. విధులు నిర్వహిస్తూ ఇప్పటివరకు 380కి పైగా పోలీసు అధికారులు కరోనా బారిన పడినట్టు న్యూజెర్సీ పోలీసులు చెబుతున్నారు. ప్రజల కోసం విధులు నిర్వహిస్తున్న వారికి ప్రజలు అండగా ఉండాలని వారు ప్రజలను కోరుతున్నారు.

Updated Date - 2020-04-02T21:37:32+05:30 IST