ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో ఆరుగురు మహిళలు

ABN , First Publish Date - 2021-10-07T21:13:49+05:30 IST

ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన 100 మంది భారతీయ ధనవంతుల

ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో ఆరుగురు మహిళలు

న్యూఢిల్లీ : ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన 100 మంది భారతీయ ధనవంతుల జాబితాలో ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరు సావిత్రి జిందాల్, వినోద్ రాయ్ గుప్తా, లీనా తివారీ, దివ్య గోకుల్‌నాథ్, కిరణ్ మజుందార్ షా, మల్లిక శ్రీనివాసన్. ఫోర్బ్స్ ఇండియా ఏటా విడుదల చేసే ఈ జాబితాలో మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ కొనసాగుతున్నారు.


ఓపీ జిందాల్ గ్రూప్‌నకు చెందిన సావిత్రి జిందాల్ (71) ఈ జాబితాలోని మహిళా ధనవంతుల్లో తొలి స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తుల విలువ గత ఏడాది 13 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది 18 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొత్తం ఫోర్బ్స్ ఇండియా జాబితాలో ఆమె 7వ స్థానంలో ఉన్నారు. 


ఈ జాబితాలోని మహిళా ధనవంతుల్లో రెండో స్థానంలో హావెల్స్ ఇండియాకు చెందిన వినోద్ రాయ్ గుప్తా (76) ఉన్నారు. ఫోర్బ్స్ ఇండియా 100 జాబితాలో ఆమె 24వ స్థానంలో ఉన్నారు. ఆమె ఆస్తుల విలువ గత ఏడాది కన్నా ఈ ఏడాది రెట్టింపు అయింది. ఈ ఏడాది ఆమె ఆస్తుల విలువ 7.6 బిలియన్ డాలర్లు. 


యూఎస్‌వీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన లీనా తివారీ (43) ధనవంతులైన మహిళా వ్యాపారవేత్తల్లో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. 4.4 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఫోర్బ్స్ ఇండియా 100 జాబితాలో 43వ స్థానంలో ఉన్నారు. 


బైజూస్ సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్ (35) నాలుగో అత్యధిక ధనవంతురాలు. ఆమె ఆస్తుల విలువ 4.05 బిలియన్ డాలర్లు. ఈ వంద మంది ధనవంతుల జాబితాలో ఆమె ర్యాంక్ 47. 


బయోకాన్‌కు చెందిన కిరణ్ మజుందార్ షా (68) మన దేశంలోని ధనవంతులైన మహిళల్లో ఐదో వ్యాపారవేత్త. ఫోర్బ్స్ ఇండియా 100 జాబితాలో ఆమె ర్యాంకు 53. ఈ ఏడాది ఆమె ఆస్తుల విలువ 3.9 బిలియన్ డాలర్లు. 


ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన మల్లిక శ్రీనివాసన్ ఫోర్బ్స్ ఇండియా 100 జాబితాలోని ఆరుగురు మహిళా ధనవంతుల్లో ఆరో స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తుల విలువ 2.89 బిలియన్ డాలర్లు. 


ఫోర్బ్స్ ఇండియా 100 ధనవంతుల జాబితాలో అగ్ర స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ 14 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. ఆయన తన ఆస్తులకు 2021లో 4 బిలియన్ డాలర్లు జత చేశారు. 


Updated Date - 2021-10-07T21:13:49+05:30 IST