16 ప్రాంతీయ పార్టీలు PAN వివరాలు లేకుండా రూ.25కోట్ల విరాళాల సేకరణ

ABN , First Publish Date - 2021-10-30T16:28:12+05:30 IST

దేశంలో 16 ప్రాంతీయ పార్టీలు పాన్ వివరాలు లేకుండానే రూ.24.77 కోట్ల విరాళాలను తీసుకున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తాజా నివేదికలో వెల్లడించింది....

16 ప్రాంతీయ పార్టీలు PAN వివరాలు లేకుండా రూ.25కోట్ల విరాళాల సేకరణ

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో 16 ప్రాంతీయ పార్టీలు పాన్ వివరాలు లేకుండానే రూ.24.77 కోట్ల విరాళాలను తీసుకున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తాజా నివేదికలో వెల్లడించింది. పీఎంకే, జేవీఎం-పి, ఏజీపీ, ఎన్‌పీ‌ఎఫ్ వంటి ప్రాంతీయ పార్టీలు సేకరించిన విరాళాల్లో ఒక్క దాత పాన్ వివరాలు కూడా అందించలేదని ఏడీఆర్ తేల్చిచెప్పింది. అక్టోబరు 29వతేదీ నాటికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో సేకరించి విరాళాల రిపోర్టులను 23 ప్రాంతీయ పార్టీలు సమర్పించలేదని వెల్లడైంది. 53 ప్రాంతీయ పార్టీల్లో కేవలం రెండు పార్టీలే తమ విరాళాల నివేదికలను ఎన్నికల కమిషన్ కు నిర్ణీత వ్యవధిలో సమర్పించాయి.


 మరో 28 ప్రాంతీయ పార్టీలు విరాళాల నివేదికలను 6 నుంచి 320 రోజులు ఆలస్యంగా సమర్పించాయని ఈసీ తెలిపింది.6,923 మంది దాతలు 27 ప్రాంతీయ పార్టీలకు 20వేల రూపాయల కంటే తక్కువతో సహా రూ.233.68కోట్లు ఇచ్చాయని ఈసీ తెలిపింది.దేశంలోనే అత్యధికంగా శివసేనకు 436 మంది రూ.62.85కోట్లను విరాళంగా ఇచ్చారు. ఏఐఏడీఎంకే రూ.52.17 కోట్ల విరాళాలతో రెండో స్థానంలో నిలిచింది.ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 37.37 కోట్లతో అన్ని ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా విరాళాలు పొందిన పార్టీల్లో మూడో స్థానంలో ఉంది. 



ఆప్ ప్రకటించిన మొత్తం రూ. 37.52 కోట్ల విరాళాల్లో కేవలం రూ. 37.37 కోట్లు మాత్రమే సరైనవని ఏడీఆర్ నివేదిక కనుగొంది.బీజేడీకి రూ.28.20 కోట్లు, వైఎస్సార్ సీపీకి రూ.8.9కోట్ల విరాళాలు వచ్చాయి.పెద్ద సంఖ్యలో విరాళాల కోసం బ్యాంక్ వివరాలు అందించకుండా ప్రాంతీయ పార్టీలు ఆన్‌లైన్/ఆర్‌టీజీఎస్/చెక్కులను కాంట్రిబ్యూషన్ మోడ్‌లుగా పేర్కొన్నాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 

Updated Date - 2021-10-30T16:28:12+05:30 IST