న్యూయార్క్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఆరుకు చేరిన మహిళల సంఖ్య

ABN , First Publish Date - 2021-03-10T22:20:13+05:30 IST

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమోపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోంది.

న్యూయార్క్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఆరుకు చేరిన మహిళల సంఖ్య

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమోపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఐదుగురు మహిళలు ఆయనపై ఈ ఆరోపణలో చేయగా, తాజాగా మరో మహిళ ఈ జాబితాలో చేరింది. క్యూమోపై మాజీ మహిళా ఉద్యోగులైన లిండ్సే బోయ్లాన్, షార్లెట్ బెన్నెట్, అన్నా రూచ్ ఇలా ఐదుగురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తాజాగా మరో మహిళ కూడా ఈ జాబితాలో చేరింది. గతేడాది గవర్నర్ అధికారిక నివాసంలో తనపట్ల క్యూమో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి తెలియజేసింది. అయితే, ఆమె వివరాలను న్యూస్ ఏజెన్సీ బయటపెట్టలేదు. కాకపోతే ఆమె కూడా ఇంతకుముందు గవర్నర్ వద్ద పనిచేసినట్లు పేర్కొంది. 


ఇక తనపై వచ్చిన ఆరోపణలపై క్యూమో మంగళవారం మరోసారి వివరణ ఇచ్చారు. తాను ఎవరిపై కూడా అలాంటి చర్యలకు పాల్పడలేదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, చేయని తప్పుకు తనను రాజీనామా చేయాలని కోరడం ఎంతవరకు సమంజసమని ఆయన వాపోయారు. ఈ ఆరోపణల నేపథ్యంలో తాను తన పదవికి రాజీనామా చేయబోనని క్యూమో స్పష్టం చేశారు. ఒకవేళ తనకు తెలియకుండా తన ప్రవర్తనతో వారిని బాధపెట్టి ఉంటే తనను క్షమించాలని కోరారు. తాను ఎప్పుడూ వారిని అసభ్యంగా తాకలేదన్నారు. అలాగే నిజానిజాలేంటో తెలియకముందే ప్రజలు తన పట్ల ఓ అభిప్రాయానికి రావొద్దని అభ్యర్థించారాయన. కాగా, డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఆండ్రూ క్యూమో గత పదేళ్లుగా న్యూయార్క్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. 2022తో ఆయన మూడో టర్మ్ గవర్నర్ గిరి ముగియనుంది.                

Updated Date - 2021-03-10T22:20:13+05:30 IST