డామిట్‌! కథ అడ్డం తిరిగింది..

ABN , First Publish Date - 2020-08-14T11:34:05+05:30 IST

విశాఖకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో నగర శివారునున్న..

డామిట్‌! కథ అడ్డం తిరిగింది..

- 103 ఎకరాలకు వైసీపీ నేతల స్కెచ్‌

- ఆ భూములు ఎనిమిది దశాబ్దాల కిందట గంగాపూర్‌ ఎస్టేట్‌ వారసుల నుంచి సింహగిరిపైనున్న విశ్వేశ్వర ఆలయానికి దాఖలు పడ్డాయంటున్న దేవదాయ శాఖ

- తమవంటూ ధర్మకర్త, లీజుదారుని వారసుల వాదనలు

- 2007లో రికార్డులు పరిశీలించి ఆలయానికి చెందుతాయన్న ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ అధికారి

- పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేసిన రెవెన్యూ

- అధికార పార్టీ నేతల రంగప్రవేశం

- ధర్మకర్తల వారసులతో మంతనాలు

- విషయం వెలుగుచూడడంతో ఒకరిని సస్పెండ్‌ చేసిన వైసీపీ అధిష్ఠానం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో నగర శివారునున్న వందల కోట్ల రూపాయల విలువైన 103 ఎకరాలను కైవసం చేసుకోవడానికి అధికార పార్టీ నాయకులు స్కెచ్‌ వేశారు. అయితే ఈ వ్యవహారం బయటకు రావడంతో పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన కొయ్య ప్రసాదరెడ్డిని వైసీపీ అధిష్ఠానం సస్పెండ్‌ చేసింది. కానీ దీనివెనుక ఒక ఎమ్మెల్యేతో పాటు మరికొందరి హస్తం కూడా వున్నట్టు ప్రచారం జరుగుతోంది. 


భూమి పూర్వపరాలు

నగరానికి చెందిన అధికార పార్టీ నేతను బహిష్కరించడంతో అసలు ఆ భూమి ఎక్కడ ఉంది?, వివాదం ఏమిటీ...అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ భూమికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గంగాపూర్‌ ఎస్టేట్‌ రాజు నారాయణ గజపతి తన కుమార్తెకు పలుచోట్ల భూములు ఇచ్చారు. తండ్రి నుంచి సంక్రమించిన భూముల్లో ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో 3/1 నుంచి 3/4 వరకు గల సర్వే నంబర్లలోని 103.08 ఎకరాలను ఆమె 1944లో సింహాచలం కొండపై వున్న కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయానికి దఖలు పరచారు.


ఈ భూమి నిర్వహణకు ధర్మకర్తగా మేడూరి అప్పలనరసింహశాస్త్రి అనే వ్యక్తిని నియమించారు. ఆయన భూమిపై ఫలసాయాన్ని దేవాలయానికి వెచ్చించేవారు. ధర్మకర్త శాస్ర్తి మరణానంతరం ఆయన భార్య కామేశ్వరమ్మ వద్ద 1969లో అప్పటి సింహాచలం దేవస్థానం స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేసిన బి.గౌరీశంకరరాజు ఏడాదికి రూ.200 ఇచ్చేలా 99 సంవత్సరాల లీజు రాయించుకున్నారు. అది అప్పలనరసింహశాస్త్రి ఆస్తిగా భావించిన లీజుదారుని వారసులు సదరు భూమిని విక్రయించే ప్రయత్నం చేశారు.


ఈ క్రమంలో సింహాచలం దేవస్థానం అధికారులు అప్రమత్తమై రెవెన్యూ అధికారులను సంప్రతించారు. 2007లో అప్పటి సెటిల్‌మెంట్‌ అధికారి రికార్డులు పరిశీలించి 103 ఎకరాలు కాశీ విశ్వేశ్వర దేవాలయానికి చెందినవేనని నిర్ధారించారు. ఈ మేరకు సింహాచలం రెవెన్యూ అధికారులు దేవస్థానానికి దత్తత దేవాలయంగా వున్న కాశీవిశ్వేశ్వరాలయం పేరిట ఆ 103 ఎకరాలకు పాస్‌ పుస్తకాలు జారీచేశారు. ఈ క్రమంలో గంగసాని అగ్రహారం భూమిలో వున్న ఆక్రమణదారులను తొలగించాలని ప్రభుత్వం నుంచి దేవదాయ శాఖ డిక్రీ పొందింది. దీనిపై లీజు పొందిన బి.గౌరీ శంకరరాజు వారసులు కోర్టును ఆశ్రయించారు.


ప్రస్తుతం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. కాగా కాశీ విశ్వేశ్వర దేవాలయానికి ఆర్‌సీ నంబరు 226/2006 పేరిట 2008 ఫిబ్రవరి 25న ఆనందపురం తహసీల్దారు ఇచ్చిన పట్టాపై లీజుదారుని వారసులు 2008లో విశాఖ ఆర్డీవో కోర్టులో కేసు వేశారు. ఇదిలావుండగా దేవాలయ ధర్మకర్తగా వుండే అప్పలనరసింహశాస్ర్తి వారసులమంటూ కళ్యాణ వెంకటేశ్వరస్వామి అనే వ్యక్తి ఈ భూమిపై తమకు హక్కులున్నాయంటూ విశాఖ ఆర్డీవో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఒకసారి సెటిల్‌మెంట్‌ అధికారి నిర్ధారించిన తరువాత ఆ ఫైలు తిరిగి ఓపెన్‌ చేసే అధికారం ఆర్డీవోకు లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావించి నాలుగేళ్ల క్రితం అప్పటి ఆర్డీవో జిల్లా యంత్రాంగం ద్వారా సీసీఎల్‌ఏకు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సీసీఎల్‌ఎలో పెండింగ్‌లో ఉంది.


అధికార పార్టీ నేతల రంగ ప్రవేశం

ఇదిలావుండగా ఆనందపురం మండలంలో జాతీయ రహదారికి సమీపంలో వున్న ఈ 103 ఎకరాలు చేజిక్కించుకోవడానికి అధికార పార్టీ నేతలు కొన్నాళ్లుగా ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానంలో వున్న నేత ఒకరు ఏడాది క్రితం ఈ భూమి కొనుగోలుకు యత్నించినా ఎందుకో విరమించుకున్నారు. ఆ తరువాత నగర నేతలు కొయ్య ప్రసాద రెడ్డి, మరికొందరు రంగప్రవేశం చేశారు. ఆరు నెలల నుంచి తరచూ గంగసాని అగ్రహారం, పొరుగునున్న రామవరం గ్రామానికి వస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. సదరు భూముల్లో వున్న రైతులు కొంతమందితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. వీరికి నగరానికి చెందిన పార్టీ సానుభూతిపరుడు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు అండదండలు వున్నాయనే ప్రచారం సాగుతుంది. వీరంతా నగరంలో ఒక కార్యాలయం కూడా తీసుకున్నారని తెలిసింది. అయితే ఈ వ్యవహారం బయటపడడంతో కొయ్య ప్రసాదరెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది.

Updated Date - 2020-08-14T11:34:05+05:30 IST