అంత ‘ప్రేమ’ ఏలనో?

ABN , First Publish Date - 2021-12-13T08:07:41+05:30 IST

సీమెన్స్‌ ప్రాజెక్టు కేసును లోతుగా పరిశీలిస్తే.. ఇందులో ప్రభుత్వ వాటా అయిన 10 శాతం నిధులు విడుదలైంది ఎల్‌.ప్రేమ్‌చంద్రారెడ్డి హయాంలోనే....

అంత ‘ప్రేమ’ ఏలనో?

  • బాధ్యుణ్ని వదిలేసి సాక్షిపై విచారణా?
  • స్కిల్‌ డెవల్‌పమెంట్‌లో ప్రేమ్‌చంద్రారెడ్డే కీలకం
  • ఆనాడు ‘నైపుణ్యాభివృద్ధి’కి ఎండీ, సీఈవో 
  • సీమెన్స్‌ ప్రాజెక్టుకు నిధులిచ్చిందీ ఆయనే!
  • సంతకం చేసి రూ.185 కోట్లకు చెక్‌ జారీ 
  • అండర్‌టేకింగ్‌లపై సంతకాలు కూడా
  • మొత్తం పరిశీలించాకే ఒప్పందం ఖరారు
  • ఆయన హయాంలోనే మరో 185 కోట్లు చెల్లింపు
  • ‘ఏదైనా’ జరిగి ఉంటే పూర్తి బాధ్యత ఎండీదే 
  • గంటా సుబ్బారావు సాక్షి మాత్రమే
  • సీఐడీ విచారణ తీరుపై ఎన్నెన్నో సందేహాలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సీమెన్స్‌ ప్రాజెక్టు కేసును లోతుగా పరిశీలిస్తే.. ఇందులో ప్రభుత్వ వాటా అయిన 10 శాతం నిధులు విడుదలైంది ఎల్‌.ప్రేమ్‌చంద్రారెడ్డి హయాంలోనే. అప్పట్లో ఆయన నైపుణ్యాభివృద్ధి  సంస్థ ఎండీగా ఉన్నారు. చెక్కులు, అండర్‌టేకింగ్‌పై సంతకాలు పెట్టింది కూడా ఆయనే. నిధులిచ్చిందీ ఆయనే. గంటా సుబ్బారావు కేవలం సదరు అండర్‌టేకింగ్‌పై సాక్షి సంతకం మాత్రమే పెట్టారు. మరి ఇందులో ముందుగా విచారించాల్సింది ఎవరిని.. విచారణ చేయాల్సి వస్తే, కేసు పెట్టాల్సి వస్తే ఎవరిపై పెట్టాలి.. ఎవరిపై పెట్టారు.. ఇదేం విచారణ? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. సీమెన్స్‌-డిజైన్‌టెక్‌ కంపెనీలతో కలిసి ఏపీఎ్‌సఎ్‌సడీసీ చేసిన చర్చల్లో భాగంగా 2015 డిసెంబరు 4న ఒక ఒప్పందం చేసుకున్నారు. దానిలో ప్రాజెక్టు వివరాలు, ఎవరు ఎంత శాతం ఖర్చు పెట్టాలి? నిధుల విడుదల ఎలా? తదితర విషయాలను పొందుపరిచారు.


అప్పుడు ఏపీఎ్‌సఎ్‌సడీసీ ఎండీ, సీఈవోగా ఉన్నది ఎల్‌.ప్రేమ్‌చంద్రారెడ్డే. ఆయనే డిజైన్‌టెక్‌ ప్రతినిధులతో జరిగిన అండర్‌టేకింగ్‌పై సంతకాలు చేశారు. దీనిలో భాగంగా అదే రోజు ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన మొత్తంలో సగం అంటే రూ.185 కోట్లు చెల్లించారు. ఆ నిధులు చెల్లించేందుకు చెక్కులు ఇచ్చింది ఎండీ, సీఈవో హోదాలో ప్రేమ్‌చంద్రారెడ్డే. ఆయనే స్వయంగా సంతకాలు చేసి డిజైన్‌టెక్‌కు రూ.185 కోట్లకు చెక్కు జారీచేశారు. అంటే నిజంగా అక్కడ ఏదైనా జరిగి ఉంటే అది పూర్తిగా తెలిసిన వ్యక్తి, బాధ్యత వహించాల్సిన వ్యక్తి ఈయనే. నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఎండీ, సీఈవోగా ఆయన మొత్తం పరిశీలించాకే ఒప్పందం జరిగింది. నిధులూ విడుదలయ్యాయి. ఈ పథకంలో నిధులు దారిమళ్లాయంటున్న సీఐడీ.. విచారణలో భాగంగా తొలుత ప్రశ్నించాల్సింది నేరుగా సంబంధం ఉన్నవాళ్లనే. కానీ ఆ పని చేయకుండా పర్యవేక్షణ కమిటీల్లో ఉన్నవారిపైనే కేసు పెట్టి, వారినే విచారించడం దేనికి సంకేతం? ప్రేమ్‌చంద్రారెడ్డి పర్యవేక్షణ కమిటీలో కేవలం సభ్యుడే కాదు. నైపుణ్య కేంద్రాలు ఏ కళాశాలలో ఏర్పాటు చేయాలో సూచించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యుల మాదిరిగా చిన్న పాత్రా కాదు. ఆయనదే సంతకం చేసే అధికారం. ఆయనదే నిర్ణయాత్మక అధికారం. నిజంగా ఏదైనా తేడా జరిగి ఉంటే ఆయనదే ప్రధాన బాధ్యత. ఆయన్నే విచారించాల్సి ఉంటుంది. కానీ ఆయన్ను పక్కన పెట్టేసి మిగతా వారిని విచారిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


సీఐడీ  విచారణ ఏ లక్ష్యంతో సాగుతోందన్న దానిపైనా ప్రశ్నలను రేకెత్తిస్తోంది. 2015లో జరిగిన ఒప్పందం ప్రకారం.. ఒక్కో ప్రాజెక్టు విలువ సుమారు రూ.559 కోట్లుగా పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టులో ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం, దాని పరిధిలో ఆరు క్లస్టర్లు ఏర్పాటుచేయాలి. ఇలాంటివి ఆరు ప్రాజెక్టులు కలిపి మొత్తం రూ.3,356 కోట్లుగా ప్రాజెక్టు విలువను అంచనా వేశారు. ‘ఇందులో 90ు సీమెన్స్‌ గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌గా ఇస్తుంది. సామాజిక బాధ్యతలో భాగంగా రూ.3 వేల కోట్లను సదరు సంస్థే పెట్టుకుంటుంది. 10 శాతం మాత్రం ప్రభుత్వం చెల్లించాలి. ఈ పది శాతాన్ని రెండు విడతల్లో ఇవ్వాలి. ప్రాజెక్టు ఒప్పందం జరిగిన రోజు సగం, ఆ తర్వాత ప్రాజెక్టు విలువపై మూడో పార్టీ మూల్యాంకనం చేశాక మిగతా సగం చెల్లించాలి. ఆ మూల్యాంకనం కూడా ఆ ఏడాది డిసెంబరు 30లోగా పూర్తిచేసి మిగిలిన నిధులను విడుదల చేయాలి’ అని ఒప్పందంలో పేర్కొన్నారు. 


371.25 కోట్లూ ఆయన హయాంలోనే విడుదల

సీమెన్స్‌ ప్రాజెక్టును చేపట్టే విషయంపై చాలా కసరత్తు జరిగింది. కంప్యూటర్స్‌ శిక్షణలో ప్రసిద్ధ సంస్థ సీమెన్స్‌ అప్పటికే గుజరాత్‌ ప్రభుత్వంలో నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టును అమలుచేస్తోంది. దానికయ్యే ఖర్చులో 90శాతం ఆ సంస్థే భరిస్తోంది. ఆ ప్రాజెక్టును అధ్యయనం చేసి వచ్చేందుకు నాటి రాష్ట్రప్రభుత్వం గుజరాత్‌కు ఒక బృందాన్ని పంపింది. 2014 డిసెంబరు 13న  ఏపీఎ్‌సఎ్‌సడీసీని ఏర్పాటుచేయడం, అదేవిధంగా గుజరాత్‌కు బృందాన్ని పంపేందుకు ఉత్తర్వులిచ్చారు. సదరు బృందం గుజరాత్‌ వెళ్లి పరిశీలించి వచ్చాక 2015 ఫిబ్రవరి 9న సీమెన్స్‌ సంస్థకు ఏపీ ప్రభుత్వం ఒక ప్రజంటేషన్‌ ఇచ్చింది. దానిలోనే సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, టెక్నికల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్ల ఏర్పాటు, వాటి అంచనా వ్యయం ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును అమలుచేసేందుకు ఏపీఎ్‌సఎ్‌సడీసీని ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీగా నియమించారు. 2015 జూన్‌ 22న ఏపీఎ్‌సఎ్‌సడీసీ సీఈవో.. సీమెన్స్‌తో ఒప్పందం కోసం రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. అదే నెల 30న ప్రభుత్వం ఎంవోయూకు అనుమతించింది. అందులోనే 90 శాతం నిధులను సీమెన్స్‌ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఇవ్వాలని, 10 శాతం ప్రభుత్వం ఇస్తుందని పేర్కొంది.


సీమెన్స్‌ సంస్థ సాఫ్ట్‌వేర్‌, ట్రైనర్స్‌ ట్రైనింగ్‌, కొంత మేర హార్డ్‌వేర్‌ తదితరాలను అందిస్తుంది. సీమెన్స్‌తో కలిసిన డిజైన్‌టెక్‌ ఇంకొంత హార్డ్‌వేర్‌ను సరఫరా చేస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడం కోసం ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన మొత్తాలకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ మొత్తాలన్నీ చెల్లించింది ప్రేమ్‌చంద్రారెడ్డి హయాంలోనే. తొలుత రూ.185 కోట్లు, ఆ తర్వాత ఇచ్చిన సుమారు రూ.185 కోట్లు... మొత్తం 371.25 కోట్లూ  ఆయన ఏపీఎ్‌సఎ్‌సడీసీ ఎండీ, సీఈవోగా ఉన్నప్పుడే హార్డ్‌వేర్‌ పరికరాల కొనుగోలుకు డిజైన్‌టెక్‌ సంస్థకు చెల్లించారు. ఆయనే చెక్కులపై సంతకాలు చేసి సదరు సంస్థకు జారీచేశారు.

Updated Date - 2021-12-13T08:07:41+05:30 IST